24/05/2026
# # డోన్ పట్టణ ప్రజల చిరకాల కోరిక ఈ రోజు నెరవేరింది. డోన్ పట్టణంలోని పాతపేట ప్రభుత్వ ఆసుపత్రి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు *శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి* గారు హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పాతపేట ప్రాంత ప్రజలు చాలా కాలంగా ప్రభుత్వ ఆసుపత్రి పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి అభ్యర్థన మేరకు తిరిగి ఆసుపత్రి సేవలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై చిన్న చిన్న వైద్య అవసరాల కోసం స్థానిక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పాతపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పేద ప్రజలకు సమీపంలోనే వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిని తిరిగి ప్రారంభించామని, అవసరమైన మౌలిక వసతులు మరియు వైద్య సిబ్బంది ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం సులభంగా అందుబాటులో ఉండేలా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే చికిత్స పొందే విధంగా ఆధునిక సదుపాయాలతో డయాలసిస్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు.
స్థానిక ప్రజలు మాట్లాడుతూ, ఆసుపత్రి మూతపడిన తర్వాత చిన్న చిన్న చికిత్సల కోసం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు తిరిగి ఆసుపత్రి ప్రారంభం కావడం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి స్పందించి ఆసుపత్రిని పునఃప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారికి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది మరియు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.