04/09/2026
అలహాబాద్ హైకోర్టులో యోగి సర్కార్ కు చెంపపెట్టు - కల్పిత కథలతో యువతిని 5 నెలలు జైల్లో కుళ్లబెట్టిన నిరంకుశ ప్రభుత్వం
నోయిడా కార్మికుల న్యాయమైన ఆందోళనలను అణచివేసేందుకు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎంత నీచానికి దిగజారిందో అలహాబాద్ హైకోర్టు తీర్పు మరోసారి రుజువు చేసింది. 25 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ గ్రాడ్యుయేట్ ఆకృతి చౌదరిపై బుధవారం హైకోర్టు జాతీయ భద్రతా చట్టం (NSA) నిర్బంధాన్ని కొట్టివేయడమే కాదు, ప్రభుత్వం అల్లిన కథ పూర్తిగా "కల్పిత కథ - Concocted Story" అని కుండబద్దలు కొట్టింది.
జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం యూపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చట్టాన్ని అడ్డుపెట్టుకుని చేసిన రాజ్య హింస, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని తేల్చి చెప్పింది.
అసలేం జరిగింది?
గత ఏప్రిల్‌లో నోయిడాలో వేతనాల పెంపు, మెరుగైన పని వసతుల కోసం సుమారు 40 వేల మంది ఫ్యాక్టరీ కార్మికులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. తమ చెమటను పిండుకుంటున్న యాజమాన్యాలకు, పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. అయితే ఆ నిరసనలు హింసాత్మకంగా మారాయనే సాకుతో, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు యూపీ పోలీసులు ఒక అమాయక యువతిని బలిపశువును చేశారు.
నిరసనకారులను రెచ్చగొట్టారనే పచ్చి అబద్ధంతో మే 13న ఆకృతి చౌదరిపై దేశంలోనే అత్యంత కఠినమైన ఎన్‌ఎస్‌ఏ చట్టాన్ని ప్రయోగించారు. ఒక చరిత్ర విద్యార్థిని, ప్రశ్నించే గొంతుకను నొక్కేయడానికి ప్రభుత్వం ఈ కుట్ర పన్నింది.
కోర్టులో బట్టబయలైన ప్రభుత్వ బండారం:
ఆకృతి తరపున దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో యూపీ సర్కార్ నిస్సిగ్గుగా, సిగ్గులేకుండా ప్రవర్తించింది.
ఒక్క వీడియో సాక్ష్యం లేదు: ఆకృతి రెచ్చగొట్టినట్లు ఒక్క వీడియో ఆధారం కూడా చూపించలేకపోయారు. ఐదు నెలలుగా ఒక యువతిని జైల్లో మగ్గబెడుతూ, ఇప్పటికీ "సమయం కావాలి" అంటూ బుకాయించిన ప్రభుత్వ తీరుపై కోర్టు మండిపడింది. ఇక సమయం ఇవ్వబోమని తెగేసి చెప్పింది.
చట్టాన్ని తుంగలో తొక్కారు: భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) నిబంధనలను యూపీ పోలీసులు కాలరాశారు. నోటీసులు కూడా సరిగ్గా ఇవ్వలేదు. అసలు నోటీసు తయారు కాకముందే ఆమెను అరెస్టు చేసినట్లు జనరల్ డైరీ ఎంట్రీలే చెబుతున్నాయని కోర్టు బయటపెట్టింది. ఇది పోలీసు రాజ్యానికి, అరాచక పాలనకు నిదర్శనం.
ఈ కల్పిత కథతో ఒక యువతి జీవితంలోని ఐదు విలువైన నెలలను నాశనం చేసినందుకు కోర్టు ప్రభుత్వానికి గట్టి శిక్ష వేసింది. మరే ఇతర కేసులోనూ అరెస్టు అవసరం లేకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు, బాధితురాలికి రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఆ డబ్బును ప్రజల సొమ్ము నుంచి కాకుండా, ఈ కుట్రకు బాధ్యులైన అధికారుల జీతాల నుంచే వసూలు చేయాలని స్పష్టం చేసింది.
కార్మికుల హక్కులను కాలరాస్తూ, ప్రశ్నించే ప్రతి గొంతుపై ఎన్‌ఎస్‌ఏ, యూఏపీఏ వంటి చట్టాలను ప్రయోగించడం యోగి సర్కార్ కు అలవాటుగా మారింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఈ నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక, ఫాసిస్టు విధానాలపై కొట్టిన చెంపపెట్టు