31/08/2026
హిందువులు కెరీర్ ముసుగులో కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు
@ కుటుంబ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
@ హిందువుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని.. ఇతర మతస్తుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతుంది..
@ సరైన సమయానికి పెళ్లిళ్లు చేసుకొని కుటుంబ జీవనం సాగించాలి
@ విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మహామంత్రి గుమ్మల్ల సత్యం జీ
హైదరాబాద్: ఆధునిక జీవన విధానం, కెరీర్ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి పేరుతో కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్షేత్ర సంఘటన మహామంత్రి శ్రీ గుమ్మల్ల సత్యం జీ హెచ్చరించారు. కెరీర్ ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యమని, వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం పట్ల బాధ్యతను యువత గుర్తించాలని హిందువులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వహిందూ పరిషత్ బాధ్యతాయుతమైన కార్యకర్తల సమావేశం భాగ్యనగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక సవాళ్లు, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, మతమార్పిడులు, మహిళలు–యువత భద్రత, జనాభా సమతుల్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా గుమ్మల్ల సత్యం జీ మాట్లాడుతూ.. “కెరీర్ కోసం కుటుంబాన్ని వాయిదా వేస్తూ పోతే ఒక దశలో కుటుంబమే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఆస్తులు సంపాదించడం మాత్రమే జీవిత లక్ష్యం కాదు. విలువలతో కూడిన కుటుంబాన్ని నిర్మించడం, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం కూడా ప్రతి వ్యక్తి బాధ్యత” అని అన్నారు.
యువత సరైన సమయంలో వివాహం చేసుకొని కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కుటుంబ వ్యవస్థ బలహీనపడితే దాని ప్రభావం వ్యక్తిపైనే కాకుండా మొత్తం సమాజంపై పడుతుందని పేర్కొన్నారు. జనాభా సమతుల్యతపై సమాజంలో చైతన్యం అవసరమని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుటుంబం తమ పరిస్థితులు, సామర్థ్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని సత్యం జి అన్నారు.
“చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు.. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలి” అని ఆయన పేర్కొన్నారు. కుటుంబ విలువలు, వివాహ వ్యవస్థ, సంస్కారం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై యువతలో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
హిందూ సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం, మతమార్పిడులపై చైతన్యం కల్పించడం, మహిళలు, యువతకు ఎదురవుతున్న సామాజిక సమస్యలపై అవగాహన పెంచడం, కుటుంబ వ్యవస్థను పరిరక్షించడం వంటి అంశాలపై విశ్వహిందూ పరిషత్ మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
హిందూ సమాజం భవిష్యత్తు కేవలం ప్రభుత్వాల చేతుల్లోనే లేదని, ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రి, ప్రతి యువకుడు, ప్రతి యువతి తమ సామాజిక బాధ్యతను గుర్తించినప్పుడే సమాజం బలపడుతుందని సత్యం జీ అన్నారు. “బలమైన కుటుంబం – బలమైన సమాజం – బలమైన దేశం” అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఇతర మతస్థుల జనాభా విపరీతంగా పెరిగిపోతుందని .. అదే సమయంలో క్రమ క్రమంగా హిందువుల సంఖ్య తగ్గిపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సరైన సమయానికి పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కణాలని, సుఖసంతోషాలతో కుటుంబంతో జీవించాలన్నారు.
విశ్వహిందూ పరిషత్‌ను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేయడం, హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం, రాబోయే కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు.
సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సునీత రెడ్డి, రాష్ట్ర సహ కార్యదర్శులు చింతల వెంకన్న, రమేష్, ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్‌దళ్, గోరక్ష, దుర్గా వాహిని, పలు విభాగాల రాష్ట్ర కన్వీనర్లు, ముఖ్య బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.