25/01/2026
కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఒత్తిడి నుండి విజయం వైపు’ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర
విద్యార్ధులకు ఒత్తిడి లేని చదువులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని గోల్డ్ కన్వెన్షన్లో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒత్తిడి నుండి విజయం వైపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పదో తరగతి విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఒత్తిడిని జయించడం, ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మెరుగైన ఫలితాలు సాధించడం, పదో తరగతి తర్వాత ఉన్న ఉన్నత విద్య అవకాశాల గురించి నిపుణులతో శిక్షణ ఇచ్చారు. అవసరమైన మెటీరియల్ కూడా అందించారు.
రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి.. విద్య వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్య వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడంతో పాటుగా.. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం ప్రవేశపెట్టాం. పేరెంట్ టీచర్ మీటింగ్స్ ద్వారా విద్యార్ధుల సమస్యలను పరిష్కరించడం, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడం చేశాం.
మన రాష్ట్రంలోని మానవ వనరుల్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా స్కిల్ డెవలప్మెంట్ కోసం సన్నాహాలు చేపట్టాం. దేశ విదేశాల్లో పర్యటించి ఏపీకి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడకు వెళ్లి చదువుకున్నా.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తిరిగి స్వస్థలాలకు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నాం. వచ్చే ఏడాదికి బందరు పోర్టును పూర్తి చేయడం ద్వారా మన బందరు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేయబోతున్నాం. మరిన్ని కంపెనీలను కూడా బందరులో ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాను.
ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో పాలన సాగిస్తున్నాం. ఆ దిశగా యువతకు అవకావాలు కల్పిస్తున్నాం. విద్యార్థి దశ నుండే పారిశ్రామిక రంగంలో స్థిరపడేందుకు ఉన్న అవకాశాలను శోధించాలని మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్ధులకు పిలుపునిచ్చారు.