22/02/2026
గోదావరి–కృష్ణా జలాలపై శాసనసభలో సమగ్ర చర్చ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగం, వివాదాలు మరియు ప్రాజెక్టుల పురోగతిపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్ర చర్చ నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నేడు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను సీఎం పరిశీలించి, ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.
👉 రాష్ట్రంపై ఉన్న అప్పుల భారం నేపథ్యంలోనూ, వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు సమీకరిస్తామని తెలిపారు. సవరించిన అంచనాలకు మంత్రివర్గ ఆమోదం తీసుకుని పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.
👉 కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తెలంగాణ ప్రజల ఆస్తి అని పేర్కొంటూ, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిర్మాణ సంబంధిత అంశాలపై సమగ్ర విశ్లేషణ జరిపి భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
👉 గోదావరి, కృష్ణా జలాలపై తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ, ప్రతిపక్షం సూచనలు స్వాగతించనున్నామని సీఎం పేర్కొన్నారు. అవసరమైతే కేంద్రం, రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులు లేదా న్యాయస్థానాల వద్దకు వెళ్లేందుకు సిద్ధమని తెలిపారు.