03/09/2026
*గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా అనకాపల్లి పోలీసులు పటిష్ట చర్యలు: సుమారు 3 కోట్ల విలువైన 600 కేజీల భారీ గంజాయి పట్టివేత – ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్*
*సమర్థవంతంగా పనిచేసిన అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్*
*అనకాపల్లి, సెప్టెంబర్ 3:* అనకాపల్లి జిల్లాను సంపూర్ణ గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు, నిఘా చర్యలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు తెలిపారు. ఒడిస్సా నుంచి అనకాపల్లి మీదుగా తుని వైపు తరలిస్తున్న 600 కేజీల భారీ గంజాయిని, రవాణాకు ఉపయోగించిన వాహనాలను అనకాపల్లి రూరల్ పోలీసులు సమయస్ఫూర్తితో పట్టుకున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు.
*కేసు పూర్వాపరాలు & నేర విధానం:*
*జైలు పరిచయం – భారీ నెట్‌వర్క్:* పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెంకు చెందిన *A-1 షేక్ మస్తాన్ వలి* గతంలో జి.మాడుగుల PS (Cr.No.7/2023) పరిధిలో గంజాయి కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉండగా, అదే జైలులో ఉన్న నర్సీపట్నానికి చెందిన A-3తో పరిచయం ఏర్పడింది.
*కమీషన్ ఒప్పందం:* ఒడిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ దగుడుపల్లికి చెందిన A-2 నుంచి 600 కేజీల గంజాయిని సమకూర్చి, తుని సమీపంలో తనకు అప్పగిస్తే సరుకు ఖరీదు కాకుండా అదనంగా రూ.3,00,000 కమీషన్ ఇస్తానని A-3 ఒప్పందం కుదుర్చుకున్నాడు.
*రవాణా పన్నాగం:* A-2 వద్ద గంజాయి కొనుగోలు చేసి, A-5 మరియు A-6 (పాంగి రత్నాలు)ల సహాయంతో చెక్‌పోస్టులు తప్పించేందుకు ఒడిస్సా సరిహద్దుల నుండి నడక ద్వారా, మోటార్ సైకిళ్లపై దఫదఫాలుగా తరలించారు. అనంతరం ఆ సరుకును వ్యాన్ (AP39 VA 6786)లోకి లోడ్ చేసి, దానికి పైలట్‌గా హోండా సివిక్ కారు (AP16 BC 0018)ను ఏర్పాటు చేసుకుని తుని వైపు తరలించేందుకు పన్నాగం పన్నారు.
*పోలీసుల మెరుపు దాడి:* పక్కా ముందస్తు సమాచారంతో అనకాపల్లి రూరల్ ఎస్సై, సిబ్బంది రంగంలోకి దిగి అనకాపల్లి మండలం సంపతిపురం జంక్షన్ వద్ద మాటువేసి గంజాయి లోడుతో ఉన్న వ్యాన్‌తో పాటు పైలట్ కారును పట్టుకున్నారు.
*అరెస్ట్ అయిన నిందితులు:*
*షేక్ మస్తాన్ వలి (A-1)* – ధర్మాజీగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
*షేక్ మదీనా (A-4)*
*పాంగి రత్నాలు (A-6)* – అల్లూరి సీతారామరాజు జిల్లా
*పరారీలో ఉన్న నిందితులు:*
A-2 (ఒడిస్సా మూలం), A-3 (నర్సీపట్నం), A-5 (అల్లూరి జిల్లా). వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
*స్వాధీనం చేసుకున్న సొత్తు:* 600 కేజీల గంజాయి రవాణాకు ఉపయోగించిన వ్యాన్ (AP39 VA 6786)
పైలట్ వెహికిల్ హోండా సివిక్ కారు (AP16 BC 0018)
*నిందితుల నేర చరిత్ర & పీడీ యాక్ట్ ప్రతిపాదన:*
A-1 (షేక్ మస్తాన్ వలి): గతంలో జి.మాడుగుల (అల్లూరి జిల్లా), కిర్లంపూడి (కాకినాడ జిల్లా)లలో 2 కేసులు నమోదయ్యాయి.
A-3 (నర్సీపట్నం): గొలుగొండ (అనకాపల్లి), మార్టూరు (పశ్చిమ గోదావరి), కిర్లంపూడి, జగ్గంపేట (కాకినాడ), టంగుటూరు (ప్రకాశం) పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 5 గంజాయి కేసులు ఉన్నాయి. ఇతనిపై పిట్ ఎన్‌డీపీఎస్ (PIT-NDPS) చట్టం కింద పీడీ యాక్ట్ (PD Act) అమలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది.
A-6 (పాంగి రత్నాలు): జి.మాడుగుల PS పరిధిలో ఒక కేసు నమోదై ఉంది.
*పోలీస్ సిబ్బందికి అభినందనలు - రివార్డుల ప్రదానం:*
ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించి భారీ గంజాయి ముఠాను పట్టుకున్న ఎస్.బి సీఐ ఎస్.బాల సూర్యరావు, అనకాపల్లి టౌన్ సీఐ జి.ప్రేమ కుమార్, రూరల్ సీఐ జి.అశోక్ కుమార్, రూరల్ ఎస్సై జి.రవికుమార్, టౌన్ ఎస్సై షేక్ జిలాని, ఈగల్ టీం సీఐలు టీ.ధనుంజయ నాయుడు, వి.నాగరాజు మరియు వారి సిబ్బందిని ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
జిల్లాలో మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు,
మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఈ.శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Andhra Pradesh Police