K S Babu Madiga Mrps

K S Babu Madiga Mrps WE FIGHT FOR DALITS & SC reservation

01/05/2022

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గంలో దళితులకు రక్షణ కరువైంది. ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పది వేలు బాకీ చెల్లించలేదని దళితుడిని కాళ్లు, చేతులు విరిచేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.దళితుల ప్రభుత్వం అంటూ పదే పదే మైకుల ముందు ఊదరగొట్టే నారాయణ స్వామిపై దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగాధర నెల్లూరు మండలం నందనూరు పంచాయతీ పెద్దకంటిపల్లి గ్రామంలో చంద్రన్ అనే దళితుడిపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. కలిజవేడు గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి వద్ద తీసుకున్న పది వేలు అప్పు సకాలంలో చెల్లించలేదని దారుణానికి ఒడిగట్టారు. చంద్రన్‌ను ఈశ్వర్ రెడ్డి ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని తన మామిడి తోటలోకి తీసుకెళ్లి దుర్భాషలాడుతూ, కులం పేరుతో దూషిస్తూ, విచక్షణ రహితంగా కొట్టి కాళ్ళు చేతులు విరిచాడు. ప్రస్తుతం బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

30/04/2022

టిఆర్‌ఎస్‌ అత్యున్నత నాయకుడిగా కెసిఆర్‌ అకస్మాత్తుగా రాజ్యాంగాన్ని తీసేసి, కొత్త రాజ్యాంగం రాయాలని అనడమే కాదు, ఈ విషయం మీద దేశవ్యాప్త చర్చ చేయాలని కూడా సూచించారు.తెలంగాణ సమాజం ఇప్పుడు ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకొనేవాళ్లు, కొత్త రాజ్యాంగాన్ని కోరుకొనేవాళ్లుగా విడిపోయింది. స్పష్టంగా చెప్పాలంటే టిఆర్‌ఎస్‌, దాని వ్యతిరేకులుగా వైరివర్గాలుగా మారిపోయింది.

రాజ్యాంగం సరిగా అమలైందా, విఫలమైందా? అనే చర్చ మొదటినుంచీ ఉంది. రాజ్యాంగంతో అంగీకారంలేని బిజెపి అదే రాజ్యాంగబద్ధంగా మొదటిసారి వాజపేయి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. ఆయన జస్టిస్‌ వెంకటాచలయ్య నేతృత్వంలో రాజ్యాంగ పనితీరు సమీక్ష కమిటీ ఏర్పాటు చేశారు. అప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలిపారు. ముఖ్యంగా దళితులు తీవ్రమైన ఆందోళనలు చేపట్టారు. అయితే, రాజ్యాంగ విషయాలను కేవలం దళితులకే పరిమితం చేస్తూ, అది దళితుల కోసమే రాసినట్టు ఇతర వర్గాలను ఒక రకమైన అనుమానంలోకి నెట్టే ప్రచారం అప్పుడూ ఇప్పుడూ జరుగుతుంది. ఇది సరైనది కాదు. ఈ దేశంలోని ప్రతి పౌరుడి జీవితానికి, వారి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అతిముఖ్యమైన విషయం అది.

'పాశ్చాత్య రాజ్యాంగాలకు నకలుగా ఉంది, ఇందులో మనతత్వం అంటే హిందూతత్వం లేదు' అని ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజే తిరస్కరించింది. బిజెపి 2024లో 'దైవిక రాజ్యాంగం' తేవాలని వ్యూహాత్మకంగా పని చేస్తుంది. యుపి ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేవని అమిత్‌షా అన్న మాటల్లోని నిగూఢార్థం అదే. రాజ్యాంగం పట్ల తమకున్న విపరీత భావాలను హిందూత్వవాదులెప్పుడూ దాచిపెట్టుకోలేదు. 'భగవద్గీత' భారత రాజ్యాంగం కన్నా గొప్పదని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఖట్టర్‌ మీడియా ముఖంగా ప్రకటించాడు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేశాలలో పర్యటిస్తూ, ఆయా దేశాధినేతలకు భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ బహుకరించాడు. భారత దేశాన్ని హిందూదేశమనీ, అది భగవద్గీత ఆధారంగా నడుస్తున్నదనే సంజ్ఞార్థాన్ని ప్రపంచానికి మోదీ ఇచ్చాడు.

రాజ్యాంగంపట్ల వ్యతిరేక భావాలు ఒక్క బిజెపికి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కీ మాత్రమే లేవు. దేశంలోని చాలా సంస్థలకు, చాలా పార్టీలకు రాజ్యాంగం పట్ల ఆమోదం లేదు. వివిధ మత ప్రచారకుల నోటివెంట కూడా రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలు విన్నాము. 'భారత రాజ్యాంగం మనుషుల మధ్య జరిగిన ఒక ఒప్పందం. దాన్ని నేను అంగీకరించను. దైవిక రాజ్యాంగాన్ని మాత్రమే నేను అంగీకరిస్తాను' అని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక ప్రచారకుడు సద్గురు జగ్గీవాసుదేవ్‌ బహిరంగంగానే ప్రకటించాడు. భారత రాజ్యాంగం కన్నా బైబిల్‌ గొప్పదనీ, బైబిల్‌ను మాత్రమే క్రైస్తవులు పాటించాలని ఉద్బోధ చేసిన సువార్తీకులను కూడా చూశాము. భారత రాజ్యాంగాన్ని 'బూర్జువా రాజ్యాంగం'గా నిర్వచించిన కమ్యూనిస్టు పార్టీలు, విప్లవం తీసుకొచ్చి 'విప్లవ రాజ్యాంగం' తేవాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి. ఒక్క బహుజన సమాజ్‌ పార్టీ మాత్రమే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా విశ్వసించి, దాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి పార్టీ స్థాపించానని మాన్య కాన్షీరాం చెప్పారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో గానీ, అంతకుముందు గానీ రాజ్యాంగం మార్చాలని కెసిఆర్‌ మాట్లాడిన దాఖలాలు లేవు. పైగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఏర్పాటు కావాలని జరిగిన పోరాటానికి ఆయన నేతృత్వం వహించారు. అంతమాత్రాన ఆయనలో రాజ్యాంగ వ్యతిరేకత లేదని అనుకోలేము. ఆయన పుట్టిపెరిగిన కుల వ్యవస్థ, అది ఇచ్చిన ఆధిపత్యం తాలూకు నేపథ్యం అందుకు కారణమై ఉండొచ్చు. స్వతంత్ర పోరాటకాలం నుంచీ తెలంగాణలోని భూస్వామ్య కులాలు చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పాలనను కోరుకోలేదు. బ్రిటీషు ఇండియాలో మొదటి భారత చట్టం, రెండో భారత చట్టం ప్రకారం పాలన సాగింది. కానీ హైదరాబాదు సంస్థానంలో మాత్రం నిజాం రాజు ఆదేశాలు, ఫత్వాల మేరకు పాలన సాగింది. రాచరికంలో మౌఖిక శాసనాలు ఉంటాయి గానీ రాజ్యాంగం ఉండదు. నిజాం రాజు పరిపాలనలో గ్రామీణ తెలంగాణలోని భూస్వాములు, జమీందార్లు ఎదురులేని ఆధిపత్యాన్ని, ఆపాదించుకున్న అధికారాలను అనుభవించారు. తెలంగాణలోని భూస్వామ్య కుటుంబాలకు ఆర్యసమాజ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూమహాసభ వంటి సంస్థలు అండగా నిలబడ్డాయి. విలీనం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జనసంఘ్ బలపడటానికీ, ఆ తర్వాత వచ్చిన బిజెపి బలపడడానికి ఈ భూస్వామ్య కులాలు తోడ్పడ్డాయి. కెసిఆర్‌ను కూడా ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాలి. కెసిఆర్‌ది రాజకీయ హృదయమే అయినా, ఆయన ఆత్మమాత్రం పచ్చి హిందూత్వ భావజాలంతో నిండిపోయింది. అపరిమిత అధికారాలకు రాజ్యాంగం అడ్డుగా ఉందనే ఆలోచన ఆయనకు మొదటి నుంచీ ఉంది. మొదటిసారి అధికారంలోకి రాగానే ప్రజలకు నిరసన తెలిపే అవకాశాన్ని రద్దు చేసింది అందుకే.

కొత్త రాజ్యాంగ ప్రతిపాదనను సమర్థించుకోవడానికి కెసిఆర్ చెప్తున్న సమస్యలను చూద్దాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను హరిస్తుంది కాబట్టి, చేయకూడని తప్పులు చేస్తుంది కాబట్టి పాత రాజ్యాంగాన్ని తీసేసి కొత్తది తేవాలని అనడంలో ఔచిత్యంగానీ తర్కంగానీ లేదు. రాష్ట్రాల హక్కులను హరించే కేంద్రం చర్యలను తప్పకుండా వ్యతిరేకించాలి. కానీ రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తిని లాగేసే జిఎస్టీ చట్టం చేసినప్పుడు ఇదే కెసిఆర్‌ ఎలాంటి చర్చ చేయకుండానే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఆ చట్టాన్ని ర్యాటిఫై చేశారు. నీట్‌ వల్ల తెలంగాణకు నష్టం అని తెలిసి కూడా వ్యతిరేకించలేదు. వ్యవసాయ చట్టాల పట్ల ద్వంద్వ వైఖరి చూపించారు.

పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని ఆర్టికల్స్ 15,16 చెప్తున్నాయి. 50శాతం రిజర్వేషన్ సీలింగ్ రాజ్యాంగంలో లేదు.అది సుప్రీంకోర్టు తీర్పు. దాన్ని తీసుకొచ్చి రాజ్యాంగం మీద రుద్దారు. ఆ సీలింగును చాలా రాష్ట్రాలు పాటించట్లేదు. తెలంగాణ రాష్ట్రం మాత్రం పాటిస్తుంది. ఇది తప్పు కాదా? బిసి జనగణన చేయాలని రాజ్యాంగం చెప్తోంది. ఆర్టికల్ 340 ప్రకారం బిసిల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వాలు చేపట్టాలి. రాజ్యాంగం కులగణన వద్దని ఎక్కడ చెప్పిందో కెసిఆర్‌కే తెలియాలి.

పేదరికం పెరగడానికి, చైనా సింగపూరులా మన దేశం అభివృద్ధి చెందక పోవడానికి సోషలిస్ట్ ఆర్థిక విధానం వదిలేసి బడా కార్పొరేట్ కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు ఉపయోగపడే నూతన ఆర్థిక విధానాలు అమలు చేయడమే అని కెసిఆర్ గుర్తించాలి. రాజ్యాంగంలో చెప్పుకున్న సోషలిస్ట్ విధానం అమలు చేస్తే చాలు. దానికి కొత్త రాజ్యాంగం దేనికి?

గవర్నర్ వ్యవస్థను అన్ని పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఆ వ్యవస్థనే మొత్తంగా రద్దు చేయటం మంచిది. రాష్ట్ర ప్రభుత్వాలను చెప్పుచేతుల్లో పెట్టుకోవడానికి, కొంతమందికి పదవులు ఇవ్వడానికి తప్ప, దాని వల్ల లాభం లేదు. ఈ విషయంలో రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు.

రాష్ట్రాల జాబితాలో కేంద్రం జోక్యం చేసుకోకుండా బలమైన సవరణ చేసుకోవచ్చు. ఉమ్మడి జాబితాను రద్దు చేయాలి. కేవలం దేశ సరిహద్దు భద్రత, మిలటరీ, విదేశాంగ విధానం, కరెన్సీ ముద్రణ అనే అంశాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉండాలి. విద్య, వైద్యం, పరిశ్రమలు, రహదారులు, టెలీ కమ్యూనికేషన్స్, అంతరాష్ట్ర, అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాలు, విద్యుత్, నదీజలాలు, పన్నులు, సుంకాలు వంటి ఆంశాలన్నీ రాష్ట్రాలకే ఉండాలి. ఇందుకు అవసరమైన సవరణలు చేసుకునే వెసులుబాటు మన రాజ్యాంగంలో ఉన్నది.

దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కోసం ప్రత్యేక ఆర్టికల్స్ పెట్టాలి. దక్షిణాదికి హైదరాబాదులో, ఈశాన్యానికి కలకత్తాలో, పశ్చిమ వాయవ్యానికి భోపాల్‌లో సుప్రీంకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలి. ఈ మాత్రానికి కొత్త రాజ్యాంగం అవసరం లేదు.

రాష్ట్రాల హక్కులను హరించి ఒక నిరంకుశ రాచరిక ఆధునిక సామ్రాజ్యాన్ని నిర్మించాలని మోదీ అనుకుంటున్నారు. ఇది సరియైనది కాదు. మోదీ తప్పులకు అతణ్ణి ఓడించి, ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అవసరమైన సవరణలు చేసుకుని రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చు. కానీ అమలు చేసేవాడు రాజ్యాంగ వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి అయితే, ఎన్ని కొత్త రాజ్యాంగాలు రాసుకున్నా మార్పేమీ ఉండదు.

కెసిఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. తనకో నేషనల్‌ లీడర్‌ గుర్తింపు రావాలంటే దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వర్గాల ఆమోదం పొందాలి. అందుకే కొత్త రాజ్యాంగం అనే మాటతో దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వర్గాలకు కెసిఆర్‌ చేరువయ్యారు. దైవిక రాజ్యాంగం తీసుకు రావాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు కూడా కెసిఆర్‌ను ఈ మాటతో ఇష్టపడతారు. ఆ రకంగా తను జాతీయ నాయకుడిగా రంగ ప్రవేశం చేసే ఒక వాతావరణాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. టిఆర్‌ఎస్‌ లాంటి పార్టీలు మరిన్ని దేశవ్యాప్తంగా కొత్త రాజ్యాంగ చర్చను రాబోయే కాలంలో లేపనున్నాయి. కానీ, గత ఇరవై యేళ్లుగా రాజ్యాంగం పట్ల ప్రజల్లో స్పష్టమైన అవగాహన పెరిగింది. ఆ రాజ్యాంగాన్ని సఫలం కాకుండా జాగ్రత్తపడుతున్న పార్టీల పట్లా, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహాలు, ఎత్తుల పట్ల స్పష్టత పెరిగింది. అందువల్ల రాజ్యాంగాన్ని ఏవిధంగానైతే ఈ దేశప్రజలు తమకు తాము సమర్పించుకున్నారో, అదే విధంగా ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటారు.

పెద్దపాడు గ్రామంలో దామోదరం సంజీవయ్య స్మారక సేవా సంస్థ అది బహుశా 1959వ సంవత్సరం..హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ కారు కర్నూలు ...
29/04/2022

పెద్దపాడు గ్రామంలో దామోదరం సంజీవయ్య స్మారక సేవా సంస్థ
అది బహుశా 1959వ సంవత్సరం..
హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ కారు కర్నూలు పట్టణం దాటి దగ్గర్లోని పెద్దపాడు అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ దళితవాడలో ఓ చిన్న ఇంటి ముందు ఆగింది.

ఓ పెద్ద బంగ్లాను ఊహించుకున్న ఆ కారులోని మనిషి ఆ చిన్న ఇంటిని చూసి కాస్త తికమక పడ్డారు. ఇంటి ముందు కట్టెలపొయ్యిపై వంట చేస్తూ కనిపించిందో పెద్దావిడ. కారు దిగి ఆమెతో మాట్లాడి, తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.

ఆ ఇల్లు ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యది. ఆ వంట చేస్తున్న వ్యక్తి ఆయన తల్లి. దామోదరం సంజీవయ్యకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పదవులు ఇచ్చే క్రమంలో జరిగిందీ ఘటన.

ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ, అప్పటి ప్రధాని నెహ్రూకు ఫిర్యాదులు చేశారు కొందరు కాంగ్రెస్ నాయకులు.

దానిపై స్పందించిన నెహ్రూ రహస్యంగా ఒక వ్యక్తిని విచారణకు పంపారు. ఆ వ్యక్తి సంజీవయ్య వాళ్ల ఊరెళ్లి విచారించారు. తిరిగి దిల్లీ వెళ్లి ఆయన వాస్తవ ఆర్థిక పరిస్థితిని నెహ్రూకు వివరించారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ సంజీవయ్యను శంకించలేదు నెహ్రూ.
ఆ వ్యక్తిని సంజీవయ్య తల్లి కొన్ని ప్రశ్నలు అడిగారు. దిల్లీ నుంచి కారులో వచ్చి ఆరా తీస్తున్నారంటే, తన కుమారుడికి ''ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తున్నారా?'', ''మా అబ్బాయి జీతం పెరుగుతుందా?'' అని ఆశతో అడిగారామె.

దామోదరం సంజీవయ్య నిజాయితీని వివరిస్తూ చాలా మంది తరచూ చెప్పే సంఘటన ఇది.

తన కుమారుడికి జీతం పెరిగితే, కట్టెల పొయ్యి బదులు కిరోసిన్ పొయ్యి కొనుక్కోవచ్చని ఆ తల్లి ఆశగా అడిగినట్టు ఇంకొందరు చరిత్రకారులు చెబుతారు.

ఆ విచారణ కోసం కర్నూలు వచ్చిన వ్యక్తి, ఒకప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, నెహ్రూకి సన్నిహుతుడైన యశ్వంత్ సింగ్ పర్మర్ అని కొందరు అధ్యయనకారులు చెబుతారు. కాదు, వేరే వ్యక్తి అని కొందరు అంటారు. మొత్తానికి రహస్య విచారణ జరిగింది అనేది వాస్తవమేనని అందరూ అంగీకరిస్తారు.

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర భారతదేశంలో ఒక దళితుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భం అది. 1960 నుంచి 62 వరకూ ఆయన సీఎంగా ఉన్నారు.అయిష్టంగా రాజకీయాల్లోకి

1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో మునెయ్య, సుంకులమ్మలకు ఐదవ సంతానంగా సంజీవయ్య జన్మించారు. ఆయన పుట్టిన మూడు రోజులకే తండ్రి మునెయ్య చనిపోయారు.

మేనమామల సంరక్షణలో చదువుకున్నారు. కర్నూలు మునిసిపల్ హైస్కూల్, అనంతపురం ఆర్ట్స్ కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు.

రెండవ ప్రపంచం యుద్ధం సందర్భంగా బ్రిటిష్ వారు ఆహార ధాన్య సేకరణ విస్తృతంగా చేస్తున్న రోజుల్లో కర్నూలు సివిల్ సప్లయిస్‌లో గుమస్తాగా, బళ్లారి సివిల్ సప్లయి విభాగంలో ఇనస్పెక్టర్‌గా పనిచేశారు.

అక్కడ పరిచయమైన ఒక జడ్జి సలహాతో మద్రాస్ వెళ్లి లా చదివారు. అక్కడ డబ్బుల కోసం ట్యూషన్లు చెప్పేవారు. లా పూర్తయ్యాక పిలకా గణపతి శాస్త్రి, జాస్తి సీతామహాలక్ష్మిల దగ్గర జూనియర్ అప్రెంటిస్‌గా చేరారు.

1950లలో భారతదేశం రిపబ్లిక్ అయింది. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన వచ్చింది. అప్పటికి కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీ రెండు పదవుల్లోనూ ఎస్.నాగప్ప ఉండేవారు.

''తాజా నిబంధనతో నాగప్ప ఎమ్మెల్యే పదవి ఉంచుకుని ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో అభ్యర్థిని వెతికే పనిని ఎన్జీ రంగాకు అప్పగించారు చక్రవర్తుల రాజగోపాలాచారి. అదే సమయంలో జాస్తి సీతామహాలక్ష్మి దగ్గరకు వేరే పనిపై ఎన్జీ రంగా వెళ్లారు. మాటల సందర్భంలో ఈ విషయం చెప్పినప్పుడు తన దగ్గర జూనియర్‌గా ఉన్న దామోదరం సంజీవయ్యను పరిచయం చేశారామె.

అయితే ఆయనకు కుటుంబ బాధ్యతలు ఉన్నందున రాజకీయాల్లో చేరడానికి ఒప్పుకోలేదు. కానీ నరసప్ప అనే స్నేహితుడు సంజీవయ్యను ఒప్పించారు. అప్పటి తన క్లాస్ మేట్, తరువాత చాలాకాలం మిత్రునిగా కొనసాగిన మరో ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కూడా సంజీవయ్యను ప్రోత్సహించారు.

అలా 29 ఏళ్ల వయసులో ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి, 1950 సంవత్సరంలో భారత ప్రొవిజినల్ పార్లమెంటులో కర్నూలు సభ్యునిగా అడుగుపెట్టారు సంజీవయ్య'' అంటూ ఆయన రాజకీయ ప్రవేశాన్ని బీబీసీకి వివరించారు సంజీవయ్య అన్న కొడుకు, ప్రస్తుత కాంగ్రెస్ నేత దామోదరం రాధాకృష్ణమూర్తి.

1952లో భారతదేశంలో మొదటి ఎన్నికలు జరిగినప్పుడు, కర్నూలు నుంచి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికై చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రభుత్వంలో హౌసింగ్, కోపరేటివ్ మంత్రిగా చేశారు సంజీవయ్య.

ఆంధ్ర, తమిళనాడు కలసిన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనూ, ఆ తరువాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆపై తెలంగాణ, ఆంధ్ర కలసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేశారు. మద్రాస్ రాష్ట్ర మొదటి కేబినెట్‌లో అతి చిన్న వయసు వ్యక్తి సంజీవయ్యే అని చెబుతారు.

1952లో తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి 1960లో సీఎం అయ్యే వరకూ మంత్రిగా కొనసాగారు. ఆంధ్ర రాష్ట్రంలో 1953లో ప్రకాశం కాబినెట్‌లో సాంఘిక సంక్షేమ, ఆరోగ్య శాఖలు, 1955 బెజవాడ గోపాల రెడ్డి కాబినెట్‌లో రవాణా, వాణిజ్య పన్నులు, స్థానిక సంస్థల పాలన శాఖలను నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956లో నీలం సంజీవ రెడ్డి కాబినెట్‌లో కార్మిక, స్థానిక సంస్థల శాఖ నిర్వహించారు.

అనుకోకుండా ముఖ్యమంత్రిగా..

1956 నుంచి 1960 ప్రారంభం వరకూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ఉన్నారు. ఆయన అనివార్య కారణాల వల్ల పదవి దిగిపోయినప్పుడు, ఆ స్థానంలో సంజీవయ్య నియమితులయ్యారు.

1960-62 మధ్య 27 నెలల పాటూ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. సంజీవయ్య ముఖ్యమంత్రి కావడం వెనుక పశ్చిమ గోదావరికి చెందిన కాంగ్రెస్ నాయకులు అల్లూరి సత్యనారాయణ రాజు పాత్ర ఉంది.

''అల్లూరి సత్యనారాయణ రాజు, సంజీవయ్య చాలా సన్నిహితంగా ఉండేవారు. అవసరమైతే ఒకరి కోసం ఒకరు పదవులు వదులుకునేట్టుగా ఉండేవారు'' అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దాసరి మురళీ మనోహర్ బీబీసీతో చెప్పారు.

''అప్పుడు సంజీవ రెడ్డికి, సత్యనారాయణ రాజుకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో అనూహ్యంగా సంజీవయ్య పేరు తెరపైకి తెచ్చారు సత్యనారాయణ రాజు" అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.వెంకట రాజం బీబీసీకి చెప్పారు .

అధిష్ఠానం మధ్యేమార్గంగా, రెండు పెద్ద వర్గాల మధ్య రాజీకోసం ఎన్నుకున్న ముఖ్యమంత్రులు అంత చురుగ్గా కనిపించరు. కానీ సంజీవయ్య దానికి మినహాయింపు.

ముఖ్యమంత్రిగా చాలా పథకాలు ప్రారంభించారు. పరిపాలనలో చురుగ్గా వ్యవహరించారు. ప్రస్తుత అవినీతి నిరోధక శాఖ 'ఏసీబీ' ఆయన హయాంలోనే ప్రారంభం అయింది.

గవర్నమెంటు ఎంప్లాయిస్ తరహాలో, గవర్నమెంటు టీచర్లకు కూడా పెన్షన్ ప్రారంభించారు సంజీవయ్య. అంతుకు ముందు టీచర్లకు పెన్షన్ లేదు.

రిజర్వేషన్లు

రాయలసీమలోని బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చారు. కోస్తా ప్రాంత కాపు (తెలగ), రాయలసీమ బలిజలను బీసీ జాబితాలో చేర్చారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలతో పాటూ, ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు అమలయ్యేలా 1961లో ఉత్తర్వులు ఇచ్చారు.

ముఖ్యమంత్రిగా 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, గనుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.

హంద్రీ నదిపై గాజులదిన్నె ప్రాజెక్టు (ఇప్పుడు సంజీవయ్య సాగర్), ఆత్మకూర్ అటవీ ప్రాంతంలో వరదరాజుల ప్రాజెక్టు మొదలుపెట్టారు. పులిచింతల ప్రాజెక్టు, వంశధార ప్రాజెక్టుల శంకుస్థాపన చేశారు.

''ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ నిర్మాణం సాగుతోంది. దాచేపల్లి నుంచి సిమెంట్ తొందరగా వచ్చేలా మానిటర్ చేశారు. నాగార్జున సాగర్ త్వరగా పూర్తయ్యేందుకు చాలా కృషి చేశారాయన'' అన్నారు ప్రొఫెసర్ వెంకట రాజం.

''వ్యవసాయంతో పాటూ పరిశ్రమలపైనా శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు సంజీవయ్య కృషి వల్ల వచ్చినవే. దిల్లీలో లాబీ చేసి అవి హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేశారు. జిల్లాల్లో పారిశ్రామిక పార్కులు ప్రారంభించారు'' అని వివరించారు రాధాకృష్ణమూర్తి.

ప్రస్తుత ప్రభుత్వాలు పోటాపటీగా అమలు చేస్తోన్న వృద్ధాప్య పింఛన్లు ప్రారంభించింది ఈయనే.

''ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో సొంతూరు వచ్చి, తిరిగి వెళుతూ తల్లికి వంద రూపాయలు ఇచ్చారు. ప్రతి నెలా, ప్రతి ఒక్కరికీ ఇలా ఎవరు డబ్బు ఇస్తారు అన్న తల్లి ప్రశ్నకు సమాధానంగా వృద్ధాప్య పింఛన్ ప్రారంభించారు. అప్పట్లో నెలకు 25 రూపాయల పింఛన్ ఇచ్చేవారు'' అని రాధాకృష్ణ మూర్తి వివరించారు.

ఆంధ్ర, తెలంగాణల మధ్య కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా కేవీ రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేశారు సంజీవయ్య.
ముఖ్యమంత్రికీ కుల వివక్ష తప్పలేదు

సంజీవయ్య మాల దాసరి కులానికి చెందిన వ్యక్తి. దీంతో ఆయనకు మిగిలిన అగ్ర కులాల కేబినెట్ సహచరులు తగినంత గౌరవం ఇచ్చేవారు కాదని అనేక సాక్ష్యాలు చెబుతున్నాయి.

''ఆయన వస్తే నిల్చునే వారు కాదు. కనీసం మర్యాదకు కూడా నమస్కారం పెట్టేవారు కాదు. కానీ ఇవన్నీ సంజీవయ్య పెద్దగా పట్టించుకునేవారు కాదు. ముఖ్యంగా నీలం సంజీవ రెడ్డి వర్గానికి చెందిన, నెల్లూరుకు చెందిన ప్రముఖ నాయకులు ఆనం చెంచు సుబ్బారెడ్డి, సంజీవయ్యను బాగా అవమానకరంగా చూశారు. అదను కోసం వేచి చూసిన సంజీవయ్య, సుబ్బారెడ్డిని కేబినెట్ నుంచి తొలగించారు. ఏసీ సుబ్బారెడ్డి ఒకసారి సంజీవయ్యకు రాజీనామా పత్రం పంపించారు. రాజకీయ పరిణామాలు ఆలోచించకుండా, తక్షణం ఆ లేఖను గవర్నర్‌కు పంపి, ఆమోదించేలా చేసి సుబ్బారెడ్డిని పక్కన పెట్టారు సంజీవయ్య'' అని వివరించారు ప్రొఫెసర్ వెంకట రాజం.

అయితే ఏసీ సుబ్బారెడ్డి సంజీవయ్యను, కేబినెట్ సమావేశంలోనే కులం పేరుతో దూషించినట్టు కొందరు చరిత్ర పరిశోధకులు చెబుతారు.

సంజీవయ్య అన్న కుమారుడు కూడా ఆ విషయం చెప్పారు. అయితే, అలా నేరుగా కులం పేరుతో తిట్టలేదు కానీ, చాలా అవమానకరంగా వ్యవహరించే వారని ఇంకొందరు చరిత్రకారులు చెబుతారు.

''1962లో ఆంధ్ర, తెలంగాణలకు కలపి మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకుముందు ఆంధ్రకు వేరుగా, తెలంగాణకు వేరుగా జరుగగా, ఉమ్మడిగా జరిగిన మొదటి ఎన్నికలు అవే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సంజీవయ్య గెలిపించారు. కానీ ఆ తరువాత ఆయనను సీఎం చేయకుండా పక్కన పెట్టారు. తిరిగి నీలం సంజీవ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు'' అని ప్రముఖ పాత్రికేయులు ఎం.నాంచారయ్య బీబీసీతో చెప్పారు

ఆ ఎన్నికల్లో సంజీవయ్య నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు వచ్చాయి.

''సంజీవయ్యను తిరిగి ముఖ్యమంత్రి చేయకూడదంటూ తెలుగు రాష్ట్రాల్లోని అగ్ర కుల నాయకులంతా, మరీ ముఖ్యంగా నీలం సంజీవ రెడ్డి దిల్లీలో లాబీ చేశారు. ఒక దశలో నెహ్రూను.. మేం కావాలో అతను కావాలో తేల్చుకోమన్నారు. దాంతో నెహ్రూ వారి ఒత్తిడికి తలొగ్గారు'' అన్నారు వెంకట రాజం.

''నిజానికి సంజీవయ్య తెలుగునాట ఎదుర్కొన్నంత కులవివక్ష దిల్లీలో కూడా ఎప్పుడూ ఎదుర్కోలేదు'' అని వివరించారు ప్రొఫెసర్ మురళీ మనోహర్.

''సంజీవయ్యకు మొదట్లో కర్నూలు రెడ్లతో సఖ్యత ఉండేది. కానీ సంజీవయ్య ఎదిగే కొద్దీ శత్రుత్వంగా మారింది. ఆ క్రమంలో తనకంటూ కొందరు రెడ్లను చేరదీసి, ఒక వర్గం తయారు చేసుకున్నారు. అదే సమయంలో కర్నూలులో బీసీ నాయకత్వాన్నీ ప్రోత్సహించారు. కేఈ మాదన్నను (కేఈ కృష్ణమూర్తి తండ్రి) బీసీ నాయకుడిగా ప్రోత్సహించారు. ఆయన చివరి వరకూ సంజీవయ్యతో సఖ్యతతో ఉన్నారు. చివరకు 1967 ఎన్నికల్లో అగ్ర కులాల వారు పార్టీలకతీతంగా పనిచేసి, సంజీవయ్యను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు'' అని వివరించారు రాధాకృష్ణమూర్తి.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా..

సంజీవయ్య నచ్చారో లేక ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేనందుకు నష్టపరిహారంగానో కానీ సంజీవయ్యను దిల్లీ పిలిపించారు నెహ్రూ. అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిని చేశారు.

1962-1964 వరకూ నెహ్రూ హయాంలో, 1971-72 మధ్య ఇందిర హయాంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేశారు సంజీవయ్య. అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన తొలి దళితుడిగా కూడా రికార్డు సృష్టించారు.

''మొట్టమొదటిసారి కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు ప్రధాని నెహ్రూ లేచి సంజీవయ్యను పిలిచి, ''సర్ మీ కుర్చీని అలంకరించండి అంటూ స్వాగతం చెప్పారు. నెహ్రూ అంతటి వారు లేచి తనను సర్ అని పిలిచి అధ్యక్ష స్థానం అలంకరించమనేసరికి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు సంజీవయ్య'' అన్నారు రాధాకృష్ణమూర్తి.

1964, 1970లలో రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారాయన. నెహ్రూ, నందా, శాస్త్రి, ఇందిర కాబినెట్లలో కేంద్ర మంత్రిగా పరిశ్రమలు, కార్మిక శాఖలకు పనిచేశారు. కార్మిక శాఖ మంత్రిగా జెనీవాలో, ఐక్యారాజ్య సమితి అనుబంధ అంతర్జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగించారు.

కంపెనీలు, ఫాక్టరీలు తమ సిబ్బందికి తప్పనిసరిగా ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే చట్టం తేవడం ద్వారా సంజీవయ్య పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.

అదే సమయంలో దిల్లీ కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలపి ఉంచే ఒక రాజకీయ వేదికగా 'సేవా స్థంబ్' అనే సంస్థ ప్రారంభించారు.

''తరువాత కాలంలో బీఎస్పీ ప్రారంభించిన కాన్షీరాం కూడా 'ఈ విషయంలో నాకు దామోదరం సంజీయవ్య స్ఫూర్తి' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు" అన్నారు రాధాకృష్ణమూర్తి.

సంజీవయ్య సాహిత్యం

సంజీవయ్యలో చాలా మందికి తెలియని కోణం సాహిత్యం, సంగీతం. తన జన్మవృత్తాంతంపై స్వయంగా సీస పద్యం రాసుకున్నారాయన.

'కనకాంతులీను కర్నూలు సీమలో.' అంటూ సాగుతుందా పద్యం. తాను పూజలో పాడుకునేందుకు వినాయకుడు, సరస్వతీ దేవిలపై హంసధ్వని రాగంలో స్తోత్రం రాసుకుని, ట్యూన్ చేసుకున్నారు. భీష్మ జననం అనే హరికథ రాశారు.

ఆయన రాసిన మరికొన్ని సాహిత్య గ్రంథాలు అందుబాటులో లేవు. సీఎంగా మొదటిసారి 'అఖిల భారత తెలుగు రచయితల సంగీతి' నిర్వహించారు.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరధ్వాజ సంజీవయ్య మిత్రులు. ఒక ప్రాచీన కావ్యంపై చర్చ మా ఇద్దరినీ మిత్రులుగా చేసిందని ఒక సందర్భంలో చెప్పారు భరధ్వాజ. 'సంజీవయ్యకు మొక్కెద' అంటూ ఆయనపై కవిత్వం రాశారు దాశరథి.

''మాల దాసరి కులస్తులు స్వతహాగా వాద్యకారులు. పాటలు పాడతారు. అలా అనువంశికంగా వచ్చిన విద్య ఆయనకు రాజకీయంగా బాగా ఉపయోగపడింది. బహిరంగ సభల్లో భారత, భాగవత పద్యాలు పాడుతూ, ఛలోక్తులు విసురుతూ, పౌరాణిక, ఇతిహాస వృత్తాంతాలు చెబుతూ జనాన్ని తన వైపుకు తిప్పుకునేవారు. అందుకే ఆయన బహిరంగ సభలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. జనాన్ని కట్టిపడేసేవారు'' అన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్.

''అందరికీ లెక్కల్లో వంద మార్కులు వస్తాయి. కానీ సంజీవయ్యకు అప్పట్లో తెలుగులో 99 మార్కులు వచ్చాయి'' అని చెప్పారు రాధాకృష్ణమూర్తి.

సంజీవయ్యకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆయనకు పిల్లలు లేరు. సావిత్రి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆయన భార్య పేరు కృష్ణవేణి. మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి సంజీవయ్యకు తోడల్లుడు.

సంజీవయ్య షుగర్ వ్యాధితో బాధపడేవారు. 51 ఏళ్ల వయసులో 1972 మే 5 న మరణించారు. 2006లో పార్లమెంటు సెంట్రల్ హాలులో సంజీవయ్య ఫోటో ఆవిష్కరించారు. ఆయన పేరుతో స్టాంప్ కూడా ఆవిష్కరించారు.

25/04/2022

దళితులు, అగ్రవర్ణాలు అంటూ తేడాలు చూపిస్తున్నారు. తాజాగా తమిళనాడులో కులవివక్ష సంచలనంగా మారింది. ఓ గ్రామంలోని బార్బర్ షాపుల్లో దళితులకు అనుమతి నిరాకరించారు అగ్రవర్ణాల వారు. దీనిపై ఏళ్లుగా పోరాటం చేసినా వారి ఉద్యమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇక విధిలేని పరిస్థితుల్లో మధురై బెంచ్ ను ఆశ్రయించారు. దళిత సంఘాలు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమిళనాడులో (Tamilnadu) ని పుదుకోట్టై జిల్లాలో పుథుపట్టి గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారు 200 దళిత కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామంలో మూడు సెలూన్ షాపులు ఉండగా.. అందులోకి అగ్రవర్ణాల వారు మాత్రమే రావాలి. హెయిర్ కటింగ్(Hair cutting) కు దళితులకు అనుమతి లేదు. వారు కటింగ్ కు వస్తే అగ్ర వర్ణాలవారు ఒప్పుకోరు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కులవివక్ష ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ.. న్యాయం జరగకపోవడంతో చేసేదేమి లేక హెయిర్ కటింగ్ కోసం సమీప గ్రామాలకు వెళుతున్నారని బాధితులు చెబుతున్నారు. ఆఖరికి టీ షాపులోనూ వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కుల వివక్ష వేధింపులు ఎక్కువ అవడంతో ఇక భరించలేక మద్రాస్ కోర్టు మధురై బెంచ్ ను ఆశ్రయించారు. మధురై న్యాయస్థానంలో సెల్వం అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఘటన వివరాలు తెలుసుకుని బాధ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

04/03/2022

కాంట్రాక్టర్‌కు స్థలం అప్పగింత

విగ్రహం ఏర్పాటు ప్రాంతంలో నిర్మాణాల తొలగింపు

12 అడుగుల నమూనా విగ్రహ పనులు ప్రారంభం

402 రోజుల్లో అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం పూర్తిచేసేలా ప్రణాళిక

విజయవాడ నగరంలో ఏర్పాటుచేయనున్న భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతివనం పనులు ఊపందుకుంటున్నాయి.
ఈ పనులు చేసేందుకు వీలుగా ఇక్కడి స్వరాజ్‌ మైదాన్‌లో ఉన్న 42 కట్టడాలను తొలగించగా ఆ భూమిని జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ సాంఘిక సంక్షేమ శాఖకు ఇప్పటికే అప్పజెప్పారు. 18 ఎకరాల విస్తీర్ణంలో రూ.249 కోట్లతో ఇక్కడ అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పనుల నిర్వహణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్టŠస్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది.

పనుల పర్యవేక్షణకు నోడల్‌ ఏజెన్సీగా సాంఘిక సంక్షేమ శాఖ, కార్యనిర్వహణ ఏజెన్సీగా ఏపీఐఐసీ వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ 125 అడుగుల అంబేడ్కర్‌ కాంస్య విగ్రహంతోపాటు స్మృతి వనం నిర్మించనున్నారు. ఇందులో మెమోరియల్‌ పార్కు, అధ్యయన కేంద్ర నిర్మాణంతోపాటు, 2వేల మంది కూర్చునేందుకు వీలుగా కన్వెన్షన్‌ సెంటర్, 500 మందికి సరిపడా ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, 100 మంది సామర్థ్యంగల కన్వెన్షన్‌ మెడిటేషన్‌ హాల్‌ నిర్మంచనున్నారు. అలాగే గ్రీనరీని ఏర్పాటుచేస్తారు. ఇప్పటికే ఇక్కడున్న భవనాలను తొలగించడంతోపాటు, పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ ప్రాంతాన్ని చదును చేస్తోంది.

2023 మార్చికల్లా సిద్ధం
ఇక అంబేడ్కర్‌ 12 అడుగుల కాంస్య విగ్రహం నమూనా తయారీ పనులూ ప్రారంభమయ్యాయి. హైలెవల్‌ కమిటీ దీనిని పరిశీలించి ఈనెల 18కల్లా ఆమోదం తెలుపుతుంది. ఆ తరువాత 25 అడుగుల నమూనా పనులు 19న ప్రారంభమై, మార్చి 10 నాటికి పూర్తిచేస్తారు. మార్చి 15లోపు ఈ నమూనాకు కమిటీ అనుమతి ఇవ్వాల్సింటుంది. మార్చి 16 నుంచి 2023 మార్చి నాటికి అంటే మొత్తం 402 రోజులకు అంబేద్కర్‌ విగ్రహంపూర్తిగా ముస్తాబవుతుంది. అన్ని పనులు పూర్తిచేసుకుని మార్చి 31, 2023 నాటికి విగ్రహాన్ని ఏర్పాటుచేసే విధంగా కాల పరిమితిని నిర్ణయించారు. దీంతో పాటు మిగిలిన భవనాల నిర్మాణం పనులూ అదే సమయానికి పూర్తిచేయాలని నిర్ణయించారు.

పనులు వేగవంతం..
అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం పనులు వేగవంతమయ్యాయి. స్వరాజ్‌ మైదాన్‌ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను తొలగించి, స్థలాన్ని కాంట్రాక్టు సంస్థకు అప్పగించాం. స్థలాన్ని చదును చేయడంతోపాటు, కాంస్య విగ్రహ నమూనా పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనుల ప్రగతిపై ఏపీఐఐసీ అధికారులతో ఇటీవలే సమీక్షించాం. పనులు నిర్ధిష్ట కాల వ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించాం.

- జె. నివాస్, జిల్లా కలెక్టర్, కృష్ణా

14/02/2022

రాజ్యాంగం మంచి చెడూ..పాలకుల చేతల్లోనే..

1949లో రాజ్యాంగ సభలో అంబేద్కర్ చివరి స్పీచ్
''రాజ్యాంగం మంచి చెడుల గురించి నేను మాట్లాడను.
ఎందుకంటే అమలు చేయడానికి మనం ఎంచుకునేవాళ్లను బట్టి మంచి రాజ్యాంగం చెడుగా మారిపోవచ్చు. అమలు చేసే వాళ్లను బట్టే చెడు రాజ్యాంగం కూడా మంచిగా మారిపోవచ్చు.''

''దేశానికి అవసరమైన చట్టవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల నిర్మాణాన్ని మాత్రమే ఈ రాజ్యాంగం అందిస్తుంది. ప్రజలు, రాజకీయ పార్టీలు వారి ఆకాంక్షలు, రాజకీయాల కోసం అనుసరించే మార్గాలను బట్టే ఈ వ్యవస్థల పనితీరు ఆధారపడి ఉంటుంది.''

''భారత ప్రజలు, రాజకీయ పార్టీలు భవిష్యత్‌లో ఎట్లా వ్యవహరిస్తారో ఎవరు చెప్పగలరు? వారి లక్ష్యాలను సాధించుకోవడానికి రాజ్యాంగ విధానాలనే అనుసరిస్తారా? లేక విప్లవ ఆలోచనలను కోరుకుంటారా అన్నది ఎవరికి తెలుసు? వారు విప్లవ మార్గాలనే ఎంచుకుంటే రాజ్యాంగం ఎంత మంచిదైనా సరే ఫెయిలవుతుందని వేరే చెప్పనక్కరలేదు. ప్రజలు, వారి రాజకీయ పార్టీలు ఎట్లా ప్రవర్తిస్తారన్నది చెప్పకుండా రాజ్యాంగం మంచిచెడులపై మాట్లాడడంలో అర్థం లేదు.''

''కేంద్రం, రాష్ట్రాల మధ్య చట్టవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాల విభజనను రాజ్యాంగమే చెప్పడం సమాఖ్య వ్యవస్థ మౌలిక సూత్రం. ఇదే సూత్రం మన రాజ్యాంగంలో ఉంది. ఇందులో ఎలాంటి లోపం లేదు. అందువల్ల రాష్ట్రాలను కేంద్ర పెత్తనం కింద ఉంచారనడం సరికాదు. అధికారాల విభజన హద్దులను కేంద్రం తనకు తానుగా మార్చలేదు. న్యాయవ్యవస్థ కూడా వీటిని మార్చలేదు.''

''సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగలేదు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఇది స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని జీవనసూత్రాలుగా గుర్తించే మార్గం. ఈ మూడింటిని వేర్వేరుగా చూడడానికి వీలులేదు. వీటిలో ఏ ఒక్కదాన్ని వేరుచేసి చూసినా ప్రజాస్వామ్య లక్ష్యమే దెబ్బతింటుంది.''

రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కావాలని సీఎం కేసీఆర్​ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఎందుకు మార్చాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కేసీఆర్​పై మండిపడుతున్నాయి. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఇష్టమున్నట్లు మాట్లాడుడేందని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేస్తున్నాయి. అయితే.. రాజ్యాంగం గురించి, పాలకుల వ్యవహార శైలి గురించి ఆనాడే అంబేద్కర్​ స్పష్టంగా చెప్పారు. ''మనం ఎంచుకునెటోళ్లను బట్టి మంచి రాజ్యాంగం చెడుగా మారొచ్చు..' అని 1949లో రాజ్యాంగ సభలోనే అన్నారు. ఇలాంటి ఎన్నో అంశాలను ఆయన ప్రస్తావించారు.

2023 ఏప్రిల్‌ 23 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చ...
11/02/2022

2023 ఏప్రిల్‌ 23 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం

విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రుల కమిటీ ఆదేశించింది.

తాడేపల్లిలోని ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. సాంఘిక సంక్షేమ, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమల శాఖల అధికారులతోపాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై కమిటీ చర్చించింది. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను పరిశీలించిన మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్‌ పలు సూచనలు చేశారు.

స్వరాజ్‌ మైదానంలో మిగిలిన వాటిని ఖాళీ చేయించి పూర్తిస్థాయిలో స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2023 ఏప్రిల్‌ 23 నాటికి అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు. పనుల పురోగతిపై మరో సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో నిర్వహించి సమస్యలుంటే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కె.హర్షవర్ధన్, కలెక్టర్‌ జె.నివాస్, జూమ్‌ ద్వారా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్‌ పలు అంశాలపై మంత్రుల కమిటీతో చర్చించారు.

05/02/2022

2023 ఏప్రిల్‌ 23 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం

విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రుల కమిటీ ఆదేశించింది.
తాడేపల్లిలోని ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. సాంఘిక సంక్షేమ, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమల శాఖల అధికారులతోపాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై కమిటీ చర్చించింది. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను పరిశీలించిన మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్‌ పలు సూచనలు చేశారు.

స్వరాజ్‌ మైదానంలో మిగిలిన వాటిని ఖాళీ చేయించి పూర్తిస్థాయిలో స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2023 ఏప్రిల్‌ 23 నాటికి అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు. పనుల పురోగతిపై మరో సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో నిర్వహించి సమస్యలుంటే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కె.హర్షవర్ధన్, కలెక్టర్‌ జె.నివాస్, జూమ్‌ ద్వారా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్‌ పలు అంశాలపై మంత్రుల కమిటీతో చర్చించారు.

దళిత వేదనను, పరివేదనను, కవిత్వమై ప్రశ్నించే కవి అమాంతంగా కనుమరుగయ్యాడు. దళిత సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన చరితార్థుడు ఆ...
04/02/2022

దళిత వేదనను, పరివేదనను, కవిత్వమై ప్రశ్నించే కవి అమాంతంగా కనుమరుగయ్యాడు. దళిత సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన చరితార్థుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ మౌనంగా కలాన్ని మూసేశాడు.అతడింకా ఎన్నో నల్లద్రాక్షపందిరి లాంటి కావ్యాల్ని మనకందించాల్సిన వాడు. సామాజిక న్యాయం కోసం ఎవరైనా కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకున్నారంటే ఆ ముందు వరసలో ఉండేది మాత్రం ఎండ్లూరి సుధాకర్‌. ఎన్నో అనుభవాల్ని, ఎన్నో అవమానాల్ని, ఎన్నో వేదనల్ని అనుభవించి కవిగా ఈ వర్తమాన సమాజంపై చెరగని ముద్రవేసిన మనకాలం జాషువా ఎండ్లూరి సుధాకర్‌.
మనదేశంలో కులనిర్మూలన కోసం జరిగిన పోరాటాలు, జరుగుతున్న పోరాటాలు ఇంకా విజయం సాధించాల్సి ఉంది. 1990 ప్రాంతంలో దళితవాదం ప్రారంభమైందని చెబుతున్నా 1933లోనే కుసుమ ధర్మన్న హరిజన శతకం ద్వారా దళిత సమస్యల్ని తీవ్రంగా వ్యతిరేకించారు.1980లో బొజ్జా తారకం నదిపుట్టిన గొంతుక కవితా సంపుటిలో నేను అస్పృశ్యుణ్ణి అంటూ 'నా ఒళ్ళంతా మట్టివాసన/ నా బతుకు నిండా వెట్టివేదన' అంటూ కవిత రాశారు. 90లలో దళితవాదం ఆర్థిక రాజకీయ సాంస్క ృతిక కోణాలన్నింటిలో బ్రాహ్మణీయ సంస్కృతిపై పోరాడుతూ డా.బిఆర్‌ ఆంబేడ్కర్‌ సిద్ధాంతాల్ని అనుసరిస్తూ ఆత్మగౌరవం కోసం, సామాజిక సమానత్వం కోసం కులనిర్మూలన కోసం ఉద్యమ కవిత్వం దేశమంతా నిప్పులా రాజేసుకుంటున్న క్రమంలో ఉవ్వెత్తున ఎగసి పడిన కవిత్వకెరటం ఎండ్లూరి సుధాకర్‌. ఈ భూమ్మీద అణగారిన ప్రజలు ఎక్కడ వివక్షకు, అత్యాచారాలకు, ఊచకోతలకు గురైనా సుధాకర్‌ కలం కత్తిలా దూసుకుపోయింది. మన రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గాలు దురాగతాలపై గత మూడు దశాబ్దాల నుంచి కవిత్వం నెత్తుటి ప్రవాహమౌతున్నది. ఎండ్లూరి సుధాకర్‌ మాకొక ఊరు కావాలి అనే కవితలో..
ఎక్కడ మా హక్కుల కోసం అమరులై పోరాడుతున్నారో
ఎవరు మా పక్షాన అక్షరాలై నిలబడతారో
ఎక్కడ ధర్మదేవత న్యాయాన్ని
నిప్పులా నిస్వార్ధంగా నడిపిస్తుందో
ఎక్కడ మానవత నలుదిక్కులా వెన్నెలగా విరబూస్తుందో
అటువంటి నిర్మలమైన ఊరు కావాలి.. అని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేటలో 2012 జూన్‌ 12న జరిగిన అమానుష దాడి నేపథ్యంలో రాసిన కవిత ఇది. అతడి కవిత్వం గూర్చి మాట్లాడాలంటే నల్లద్రాక్ష పందిరో, కొత్త గబ్బిలమో, వర్గీకరణీయమో, గోసంగో కాదు.. ప్రతి కవితా గొప్ప కావ్యమే !
ఈ సందర్భంగా గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన మాట గుర్తుకు వస్తుంది : 'శోకమనే జీవధాతువు చేత కవి మనిషికి అందరి కంటే సన్నిహితుడవుతాడు'. సున్నితత్వం ప్రేమతత్వం కలిగిన ఎండ్లూరి సుధాకర్‌ శోకాన్ని ప్రేమించిన వాడు, దళిత ఉద్యమాన్ని ముందుకు మున్మందుకు తీసుకెళ్ళే ప్రయత్నాన్ని బాధ్యతగా నిరంతరం చేశారు. జాషువా అనగానే గబ్బిలం గుర్తుకు వస్తుంది. ఎండ్లూరి అనగానే మనకు నల్లద్రాక్ష పందరి కవిత్వమే కాక ఎన్నో అనువాదాలు, కథలు కనబడి పలకరిస్తాయి. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా అమితంగా ప్రేమించిన సోదరుడతడు. మూడంటే మూడు రోజుల్లోనే వర్గీకరణీయం పేరుతో దళిత దీర్ఘకావ్యం రాశాడు. ఇది అస్తిత్వ పోరాటమైనప్పటికీ ఇందులోని కవిత్వాన్ని గూర్చి సినారె, చలసాని ప్రసాద్‌, అవంత్స సోమసుందర్‌ వంటి ప్రముఖుల చేత బలమైన ఉద్యమ కవిత్వంగా ప్రశంసించేలా రాయగలిగాడు. ఇందులో ...
మహాభారత కథ
మళ్ళీ మొదలయ్యింది
కులాల కురుక్షేత్రం కుంపటి
రంగం మీద రగులుతుంది
కృష్ణరాయభారం
కొత్త మలుపు తిరిగింది
విదురుడి మాటలు
వినిపించుకోవడం లేదెవ్వరు..
ఈ వర్గీకరణ కవిత్వాన్ని దళిత సాహిత్య చేగువేరాగా కీర్తింపబడుతున్న చండాల చాటింపు కవి డా.నాగప్ప గారి సుందర్రాజ్‌కు, గూటం దెబ్బ యాదయ్యకు, మద్దెల శాంతయ్య, మద్దూరి నగేష్‌బాబుకూ అంకితం చేశాడు. ఇందులోని కవిత్వ శిల్పం కవులకు కొత్త వస్తువునిస్తుంది. తను నూటికి నూరుపాళ్ళు అనుభవిక కవిత్వమే రాశాడు. తన బాధ, తన జాతి ఆవేదన, తన జాతి గురౌతున్న దోపిడీనే కవిత్వంగా ప్రశ్నించాడు. వర్తమాన సమాజంలోని వాస్తవికత ఆధారంగానే కవిగా జీవించాడు. అతడి బహుముఖీన ప్రజ్ఞ అనేక పార్శ్వాలుగా ప్రవహించింది. కవిత్వమూ కథలే కాదు, అనేక అనువాదాలు చేశారు. ఉర్దూలోకి అనువదించిన ఒక కవిత దు:ఖదీవిగా కనబడుతుంది..ఆ కవిత తన జీవితాన్నే పలకరించినట్లుంటుంది.
తెల్లారి పోయినా ఆ కొవ్వొత్తి
ఇంకా ఏడుస్తోంది దేనికనీ ?
ఇంకొద్దిగా వెలిగించు
అది కూడా కరిగిపోవాలని ...
- ఆగ్‌ జాన్‌ ఏశ్‌ రాసిన పై కవితలో ఉన్న ఇప్పుడు శోకం ఎవరిదో స్పష్టంగా తెలుస్తున్నది. సుధాకర్‌ పెన్ను మూసేశాక దళిత సాహిత్యాన్ని ఏ దరికి చేర్చకుండా నడి సంద్రంలో వొదిలేసినట్లైంది. జాషువా పద్య కవిత్వం ఎంత ప్రభావితం చేసిందో ఎండ్లూరి కవిత్వం అంతే ప్రభావం చూపింది. దళిత సాహిత్య సృజనకారుల్లో ముందు వరసలో ఉన్న ఎండ్లూరి సుధాకర్‌ తన కవిత్వంలో అత్యంత ఇష్టమైన కవిత్వంగా గోసంగి గురించి చెప్పుకుంటారు.
ఒక విషాద శతాబ్దంలో జీవించిన వాణ్ణి
ఒక అంధకార యుగంలో
అస్మ ృశ్యతను అనుభవించిన వాణ్ణి
పేర్కొనడానికి
వీలులేని కులంలో పుట్టినవాణ్ణి
ముట్టుకోవడానికి ఇష్టపడని/ మురికి జలాన్ని
ఐదు వందల సంవత్సరాలుగా
హైందవలోక అవమానితుణ్ణి
అనువానితుణ్ణి/ అభిమానవంతుణ్ణి
సూర్య నమస్కారం చేసినంత సుఖంగా
ప్రతి వర్ణ నమస్కారం చేయలేం కదా
ప్రతిసారి ఎదుటివాడి రూపంలో
చండాలుడే కనిపిస్తే
దుఃఖంతో పక్కకి తొలగిపోం కదా.!
ఈ దీర్ఘ కావ్యాన్ని 3.7.2010 రోజున సాయంత్రం నాలుగ్గంటలకు మొదలెట్టి తెల్లారు నాలుగ్గంటలకంతా రాసేశాడు. అతనిలా దార్శనికత కలిగిన కవులు తెలుగు కవిత్వంలో కొందరే కనబడతారు. ఒక జాతి కన్నీళ్ళు. ఆ కన్నీటి వాసనలే కవిత్వ పరిమళాలుగా గోసంగిగా పరచుకున్నాయి. ఒక్కో పాదం భావావేశం కలిగి, ఒక్కో కవితా వాక్యం అణచివేతకు గురైన శోకమైంది. సుధాకర్‌ కవిత్వంలోని ప్రతి వాక్యం నిప్పులా రాజుకుంది. అతడి సాహిత్య జీవితం మొత్తం దళితజాతిని జాగృతం చేసే ప్రయత్నమే చేసింది. ఈ కవి ఇంకా నిలబడాల్సినోడు. నిండా బతకావాల్సినోడు. దళితుల జీవితాల్ని చూపుడు వేలు సాక్షిగా కవిత్వ వెలుతురులూది నడిపించాల్సినోడు. చివరగా అతడి కవిత్వం అతని జీవితాన్ని ఎలా తడిపి ముద్ద చేసిందో పరిశీలిస్తే ...
ఆగ్రహం రాని అక్షరం జ్వలించదనీ/ ఆర్ధ్రతలేని వాక్యం ఫలించదనీ/ నా అనుభవం నేర్పిన కవిత్వ పాఠం/ నాలుగు మెతుకులే నా అక్షరాలు/ నలుగురు నేను చదివిన ప్రబంధాలు/ నా బాల్య దృశ్యాలే నేను చూసిన అలంకార శాస్త్రాలు/ ఆకలి రసం నాలోని రచనా రహస్యం/ అవమాన విషం నా కంఠంలోని నీలామృత విశేషం/ మా బీద బస్తీలే నన్ను కవిని వేేశాయి/ మా వీధి కుక్కలు జీవితాన్నీ/ జీవించడాన్నీ నేర్పాయి. ఇలా జీవించి వెళ్లిపోయిన ఎండ్లూరి సుధాకర్‌ తెలుగు కవిత్వానికి ఎంతో చైతన్యాన్ని, కొత్త సొబగునీ ఇచ్చారు. ఆ చైతన్యాన్ని కొనసాగించటమే మనం ఆయనకిచ్చే నవాళి.

Address

Anantapur
515001

Telephone

+18297732948

Website

Alerts

Be the first to know and let us send you an email when K S Babu Madiga Mrps posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to K S Babu Madiga Mrps:

Share