07/09/2026
*దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది....*
*: జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్. గారు*
విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి ఉంటుందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు పేర్కొన్నారు. సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఇటీవల మృతిచెందిన ఇద్దరు పోలీసు కుటుంబాలకు సంక్షేమ నిధుల కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను జిల్లా ఎస్పీ గారు స్వయంగా అందజేశారు.
భీమవరం టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ గత జూలై 9వ తేదీన అకాల మరణం చెందిన పిసి-1527 ఎస్.వి.వి.ఎస్. కృష్ణారావు గారి సతీమణి సుంకర సత్యదుర్గ గారికి 'విడో వెల్ఫేర్ ఫండ్' (Widow Welfare Fund) నుండి మంజూరైన రూ. 1,00,000/- (అక్షరాలా లక్ష రూపాయలు) చెక్కును అందజేశారు. అదేవిధంగా, పశ్చిమ గోదావరి జిల్లా నుండి పెదవేగి డి.టి.సి (DTC) లో విధులు నిర్వహిస్తూ గత ఆగస్టు 7వ తేదీన మృతిచెందిన ఏఆర్ పిసి - 2759 జి. విజయ కృష్ణ గారి సతీమణి జి. ఉష గారికి 'డిసీజ్డ్ వెల్ఫేర్ ఫండ్' (Deceased Welfare Fund) నుండి మంజూరైన రూ. 1,00,000/- (అక్షరాలా లక్ష రూపాయలు) చెక్కును ఎస్పీ గారు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ....,
ఆపత్కాలంలో తక్షణ ఆర్థిక భరోసా కల్పించేందుకే శాఖాపరమైన సంక్షేమ నిధుల ద్వారా ఈ సహాయాన్ని త్వరితగతిన విడుదల చేసినట్లు తెలిపారు. కేవలం తక్షణ ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా రావలసిన అన్ని రకాల ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్ తదితర క్లెయిమ్‌లు, అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు. పోలీసు శాఖ ఎల్లవేళలా వారి వెన్నంటే ఉండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ గారు, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సి.హెచ్.మోజేష్ గారు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.