Jogulamba Gadwal Cyber Security Bureau

Jogulamba Gadwal Cyber Security Bureau To report cyber crime, Dial 1930 or log in to https://cybercrime.gov.in

06/08/2026
➤ "సురక్ష కా తిరంగా" అనే థీమ్ తో సైబర్ నేరాలపై సమరశంఖం ⟹ సైబర్ నేరాలపై అప్రమత్తతే ప్రజలకు అసలైన రక్షణ: ⟹ సైబర్ స్వతంత్ర ...
06/08/2026

➤ "సురక్ష కా తిరంగా" అనే థీమ్ తో సైబర్ నేరాలపై సమరశంఖం

⟹ సైబర్ నేరాలపై అప్రమత్తతే ప్రజలకు అసలైన రక్షణ:

⟹ సైబర్ స్వతంత్ర తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆగస్టు-2026 స్వతంత్ర మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ" మహత్తర సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని MALD డిగ్రీ కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై "సురక్ష కా తిరంగా" ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సైబర్ భద్రత ప్రతి పౌరుడి బాధ్యతగా మారిందని అన్నారు. "ఆగు... ఆలోచించు... నిజం నిర్ధారించు... సైబర్ భద్రత పెంచు" అనే "సురక్ష కా తిరంగా" సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసులతో పాటు ప్రజల అప్రమత్తత కూడా అత్యంత కీలకమని అన్నారు. ప్రస్తుతం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, APK ఫైల్ మోసాలు, ఆన్‌లైన్ లోన్ యాప్ మోసాలు, నకిలీ ఉద్యోగాల ఆఫర్లు, ఓటీపీ, కేవైసీ అప్‌డేట్ పేరుతో జరుగుతున్న మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలు, గుర్తు తెలియని లింకులు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా సందేశాలను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వొద్దని సూచించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే సమయం వృథా చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లోని సైబర్ సిబ్బందిని సంప్రదించి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. వేగంగా స్పందిస్తే మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు.

"సురక్ష కా తిరంగా" ద్వారా ప్రతి ఇంటికి సైబర్ భద్రత సందేశాన్ని చేరవేసి, సైబర్ నేర రహిత జోగుళాంబ గద్వాల జిల్లాతో పాటు సైబర్ స్వతంత్ర తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో సైబర్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

కళాశాల ప్రిన్సిపాల్ ఖలందర్ భాష మాట్లాడుతూ, నేటి కాలంలో ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్, సోషల్ మీడియాను వినియోగిస్తున్న నేపథ్యంలో సైబర్ భద్రతపై అవగాహన అత్యంత అవసరమన్నారు. పోలీసులు తెలియజేసిన సూచనలను ప్రతి విద్యార్థి పాటించడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసర ప్రాంత ప్రజలకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌. ఖలందర్ భాష, వైస్ ప్రిన్సిపాల్ డా. కె. చంద్రమోహన్, ఎన్‌.ఎస్‌.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ వి. సురేందర్ రెడ్డి, గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, గద్వాల పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్ కుమార్, జిల్లా D-4-C సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్, పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➤ APK ఫైల్ మోసాలకు బ్రేక్: అప్రమత్తతతో బాధితులకు 100% న్యాయం  ➤  గోల్డెన్ అవర్‌లో  ఫిర్యాదు - 100% డబ్బు రికవరీతో నేరగాళ...
20/04/2026

➤ APK ఫైల్ మోసాలకు బ్రేక్: అప్రమత్తతతో బాధితులకు 100% న్యాయం

➤ గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు - 100% డబ్బు రికవరీతో నేరగాళ్లకు చెక్ : జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు గారి ఆదేశాలు, నిరంతర పర్యవేక్షణతో గద్వాల జిల్లా పోలీసులు సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు సైబర్ మోసాల కేసుల్లో జిల్లా సైబర్ సెల్ సిబ్బంది అసాధారణమైన చురుకుదనం, సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితులకు నష్టం లేకుండా 100 శాతం డబ్బును తిరిగి రికవరీ చేయడం విశేషం.

సైబర్ మోసాల్లో డబ్బు కట్ అయిన వెంటనే వచ్చే మొదటి 1 గంటను “గోల్డెన్ అవర్” అంటారు. ఈ సమయంలో వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తే బ్యాంకులు ఖాతాను ఫ్రీజ్ చేసి, డబ్బును తిరిగి రికవరీ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

మొదటి ఘటనలో, గద్వాల పట్టణానికి చెందిన జయన్న అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా వచ్చిన ఫేక్ APK ఫైల్‌ను ఓపెన్ చేయడంతో, సైబర్ నేరగాళ్లు అతని మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేసి, అతని క్రెడిట్ కార్డు ద్వారా రూ.44,921ను అక్రమంగా దోచుకున్నారు. డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ రావడంతో అప్రమత్తమైన బాధితుడు వెంటనే జిల్లా పోలీస్ కార్యాలయంలోని సైబర్ సెల్‌ను ఆశ్రయించారు.

ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సైబర్ సెల్ సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్ క్షణాల్లో స్పందించి, సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు సంబంధిత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. దర్యాప్తులో ఆ మొత్తంతో ఫ్లిప్‌కార్ట్‌లో రెండు మొబైల్ ఫోన్లు ఆర్డర్ చేసినట్లు గుర్తించి, వెంటనే ఫ్లిప్‌కార్ట్ అధికారులతో సమన్వయం చేసి ఆ ఆర్డర్‌ను రద్దు చేయించారు. ఫలితంగా రూ.44,921 మొత్తాన్ని పూర్తిగా బాధితుడి ఖాతాలోకి తిరిగి జమ చేయగలిగారు.

ఇక రెండో ఘటనలో, ధరూర్‌కు చెందిన బి. కృష్ణకు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి, KYC పేరుతో ఫేక్ APK ఫైల్ పంపించారు. ఆ ఫైల్‌ను ఓపెన్ చేయడంతో అతని ఫోన్ హ్యాక్ అయి, కొద్దిసేపటికే రూ.15,696 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే బాధితుడు జిల్లా సైబర్ సెల్‌ను సంప్రదించగా, సిబ్బంది వేగంగా స్పందించి సంబంధిత బ్యాంకులకు సమాచారం అందించి, నేరగాళ్లు డబ్బును విత్‌డ్రా చేయకముందే ఖాతాను ఫ్రీజ్ చేయించారు. దీంతో మొత్తం రూ.15,696ను సురక్షితంగా తిరిగి బాధితుడి ఖాతాలో జమ చేయించారు.

ఈ రెండు ఘటనలలో బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి స్వయంగా వచ్చి, జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు గారిని కలిసి, సైబర్ సెల్ సిబ్బంది వేగవంతమైన స్పందనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై స్పందించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, సైబర్ సెల్ సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్‌లను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే స్పూర్తితో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.

సైబర్ మోసాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత లింకులు, APK ఫైళ్లు, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

💥సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్న రూ.1.75 లక్షలు రికవరీ-జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు..✍️గద్వాల (మార్చి 06): జోగుళాంబ గద్వ...
09/03/2026

💥సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్న రూ.1.75 లక్షలు రికవరీ

-జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు..✍️

గద్వాల (మార్చి 06): జోగుళాంబ గద్వాల జిల్లాలో నమోదైన రెండు వేర్వేరు సైబర్ నేరాల కేసుల్లో బాధితులు కోల్పోయిన మొత్తంలో మొత్తం రూ.1,75,244 ను విజయవంతంగా రికవరీ చేసి వారి ఖాతాల్లో జమ చేయించామని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు.కోర్టు ఆదేశాలు, పోలీస్–బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో ఈ మొత్తాన్ని తిరిగి సాధించడం బాధితులకు పెద్ద ఊరటనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుల్లో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గద్వాల్ న్యాయమూర్తి ధరావత్ ఉదయ నాయక్ మరియు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అలంపూర్ న్యాయమూర్తి ఆర్.వి.ఎస్.ఎస్. మిధున్ తేజ రిఫండ్ ఆర్డర్లు జారీ చేశారు.
పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వచ్చిన లోన్ ప్రకటనను నమ్మి ఫీజుల పేరుతో రూ.88,244 చెల్లించి మోసపోయాడు. మరో ఘటనలో గద్వాల్ టౌన్ పరిధిలో టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెట్టి మోసం చేశారు.
బాధితులు 1930 హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కోర్టు మరియు బ్యాంకుల సహకారంతో మొత్తం రూ.1,75,244 ను రికవర్ చేసి బాధితుల ఖాతాల్లో జమ చేయించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజులు లేదా పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు సమాచారం అందిస్తే త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ రికవరీ ప్రక్రియలో కీలకంగా పనిచేసిన డిస్ట్రిక్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌చార్జ్ ఎస్సై తేజస్విని, సిబ్బంది రమేష్ ఆచారి, రియాజ్, సైబర్ వారియర్లు ప్రహ్లాద్ రెడ్డి, రాజు లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఎస్పీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Personal Cyber Hygiene For Citizens.Cyber cell Gadwal.
24/01/2026

Personal Cyber Hygiene For Citizens.
Cyber cell Gadwal.

Address

Gadwal
509125

Alerts

Be the first to know and let us send you an email when Jogulamba Gadwal Cyber Security Bureau posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category