14/08/2026
*హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో రిటైర్డ్ ఆర్మీ సైనికుడికి ఘన సన్మానం*
- కార్గిల్ వీరుల స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించాలి
- సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి
హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం నాగారం డివిజన్ ఆర్ఎం నగర్ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీలో ఇంజనీర్ రెజిమెంట్, 108 పుణే కిర్కీలో సేవలందించిన రిటైర్డ్ ఆర్మీ సైనికుడు సుంకరి నారాయణ గారిని *మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి* గారు ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం భారత సైనికుల ధైర్యసాహసాలకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచిందన్నారు.
1999 మే నుంచి జూలై వరకు భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ మద్దతుతో చొరబడిన సైనికులు కార్గిల్–ద్రాస్ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించగా, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టిందన్నారు. భారత వాయుసేన ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
భారత సైన్యం అపారమైన ధైర్యసాహసాలతో ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుని 1999 జూలై 26న విజయాన్ని సాధించిందని, అందుకే జూలై 26ను దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నామని వివరించారు.
కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ వంటి వీర సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలు దేశ యువతకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తున్నందువల్లే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని, వారి త్యాగాలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని, హర్ ఘర్ తిరంగా అభియాన్‌ను విజయవంతం చేసి దేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నారాయణ గారి కుమారుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు