24/08/2026
*పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం వెంటనే అందించాలి*
*ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్*
గత సంవత్సరం 2025 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల్ శంకర్ గారు డిమాండ్ చేశారు.
*పంట నష్టపోయిన రైతులతో కలిసి ఈరోజు హైదరాబాద్ సచివాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు*
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారిని ఆయన ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పంట నష్ట పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే హామీ ఇచ్చి ఇంతకాలం గడిచినా బాధిత రైతులకు పరిహారం అందకపోవడం దురదృష్టకరమని పాయల్ శంకర్ గారు అన్నారు.
ఇప్పటికే పంట నష్టంతో ఆర్థికంగా చితికిపోయిన రైతులు అప్పులు తీర్చలేక, తదుపరి పంటకు పెట్టుబడులు సమకూర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని కేవలం ప్రకటనకే పరిమితం చేయకుండా ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారాన్ని తక్షణమే విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని డమాండ్ చేశారు.
అదేవిధంగా తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేసి, భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయే రైతులకు పటిష్టమైన బీమా రక్షణ కల్పించాలని కోరారు.
రైతులతో కలిసి సచివాలయం బయట నినాదాలు చేస్తూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పాయల్ శంకర్ గారు, “రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.. పంట నష్ట పరిహారం వెంటనే విడుదల చేయాలి.. తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు స్పష్టం చేశారు...