10/08/2026
*దళిత క్రిస్టియన్ల ధర్నాతో దద్దరిల్లిన జంతర్ మంతర్*
* *ఎస్సీ హోదా సాధించే వరకు పోరాటం ఆగదు*
* *ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ హోదా బిల్లు ప్రవేశపెట్టాలి*
* *బ్లాక్ డేగా 1950రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన రోజు*
* *ధర్నాకు సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర*
* *మతం మారినంత మాత్రన వివక్ష మారదు - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్*
* *దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్దం - మేడే రాజీవ్ సాగర్*
* *ఎస్సీ హోదా ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు ప్రొ. గాలి వినోద్ కుమార్*
1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పిచాలని డిమాండ్ చేస్తూ న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో దళిత క్రిస్టియన్లు పెద్ద పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర సంఘీభావం ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పోరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, ప్రొ. గాలి వినోద్ కుమార్ ప్రసంగించారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దుచేసి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందజేసినట్లు తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు వివరించారు. ఎస్సీ హోదా లేకపోతే దళిత క్రిస్టియన్లకు విద్యా, ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దళిత క్రిస్టియన్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. పురాతన విధానాలకు పార్లమెంట్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా వచ్చే వరకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితుల పట్ల వివక్ష మారదని స్పష్టం చేశారు. కారంచేడు, చుండూరు ఘటనల్లో బాధితులు మతం మారిన దళితులేనని గుర్తుచేశారు. బీసీ, ఎస్టీలకు మతమార్పిడి స్వేచ్ఛ ఉన్నదన్నారు.. వారు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారని తెలిపారు. కేవలం మతం మారిన దళితులకు మాత్రమే రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
1950 రాష్ట్రపతి ఉత్తర్వులు అశాస్త్రీయం, రాజ్యాంగ వ్యతిరేకమని వివరించారు. ఆర్టికల్ 15, 18, 21, 25 దేశంలోని పౌరులందరికీ మత స్వేచ్చను ఇచ్చాయని గుర్తుచేశారు. కానీ దళితులకు మాత్రం మతపరమైర ఆంక్షలు విధించడం ఎందవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ మాట్లాడుతూ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా బిల్లు ప్రవేశపెట్టాలని తెలిపారు. 1950 ఆగస్టు 10 ఉత్తర్వులు వెలువడ్డాయని అందుకే ఈ రోజును బ్లాక్ డే పాటిస్తున్నట్లు వివరించారు. మతం మారినంతా మాత్రన కులం మారదని తెలిపారు. ఏ దేవున్ని అయిన విశ్వసించే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని తెలియజేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. రిజర్వేషన్ లేకుంటే దళిత క్రైస్తవులు ఇంకా వెనకబాటుకు గురవుతారని తెలియజేశారు.
అంతేకాకుండా 1950 నాటి రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వులోని పేరా 3 యందు హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు ఆచరించే దళితులకు మాత్రమే ఎస్సీ హోదాను పరిమితం చేసిందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ఆర్టికల్ 14, 15 మరియు మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 25 యొక్క అసలు ఉద్దేశ్యాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రం కుట్రలు పన్నుతుందన్నారు.
భారత ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన సచార్ కమిటీ, తన నివేదికలో దళితులు మతం మారినా వారి సామాజిక స్థితి, అంటరానితనం, వివక్ష మారలేదని స్పష్టం చేసిందన్నారు. అనంతరం 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ తమ నివేదికలో దళితులు క్రైస్తవ లేదా ఇస్లాం మతానికి మారినా, వారిపై ఉండే వివక్ష, అవమానం మాత్రం మారలేదని అందుకే మతం మారిన దళితులకు ఎస్సీ హోదానే ఇవ్వాలని తమ నివేదికలో పొందుపరిచిందని వివరించారు. కమిటీలు నివేదికలు ఇచ్చిన కావాలనే భారత ప్రభుత్వం దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
అలాగే ప్రొపెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. క్రైస్తవ, ముస్లిం మతం స్వీకరించిన దళితులకు మాత్రమే రిజర్వేషన్ తొలగించడం రాజ్యాంగ విరుద్దమని మండిపడ్డారు. అగ్రవర్ణాలకు, ముస్లిం, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న ప్రభుత్వం కావాలనే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ రాకుండా చేస్తున్నారని స్పష్టం చేశారు.
క్రైస్తవ సేవా సమితి అధ్యక్షులు గడ్డం సాల్మోన్ రాజు, ఆల్ ఇండియా దళిత క్రిస్ట్ రైట్స్ సమితి అధ్యక్షులు సంగటి మనోహర్, దళిత క్రిస్టియన్ ఫోరం చిన్న జోసెఫ్, రావులపాటి మోసెస్, మానిక్యాల ఎలియా, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డా. ఇస్లాముద్దీన్ తో పాటు పెద్ద ఎత్తున క్రిస్టియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.