14/02/2017
భారత రాజ్యాంగం అమలుకు నాలుగు పట్టుకొమ్మలు, వాటినే నాలుగు స్థంభాలుగా మనం వ్యవహరిస్తాం. 1. లెజిస్లేచర్ (చట్టసభలు), 2.జ్యూడిషియల్ (న్యాయవ్యవస్థ), 3.ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక), 4.మీడియా (ప్రసార సాధనాలు) ఈ నాలుగు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, పౌరుల హక్కుల్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మీడియా మినహాయిస్తే పై మూడు సంస్థలకు రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ వాటి విధులు, హక్కుల గురించి స్పష్టంగా పొందుపర్చడం జరిగింది. మీడియా పరోక్షంగా తనవంతు పాత్ర పోషిస్తోంది.
అయితే ఎస్సీ, ఎస్టీల విషయానికి వచ్చేసరికి మీడియాలో స్వాతంత్య్రం వచ్చి 70 సం||లు గడిచినప్పటికీ 30%గా జనాభా వున్న ఎస్సీ, ఎస్టీల పాత్ర నామమాత్రం, 1% కూడా లేదు. అందుచేతనే పాలకులు ఎస్సీ,ఎస్టీ వర్గాల హక్కుల్ని కాలరాసినప్పుడు మీడియా గొంతు మూగబోతోంది. కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్ పవర్స్) సంస్థలుగా వున్నటువంటి ఎస్సీ, ఎస్టీలకు చెందిన జిల్లా లెజిస్లేటివ్‌లు కూడా అవమానాలు పడుతున్న పరిస్థితులు, పాలకులు వారిని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. పదోన్నతుల్లో ప్రజలకు మేలు చేసేటువంటి పదవులు ఇవ్వడంలోగానీ, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించినప్పుడుగానీ అదేవిధంగా అటు లోక్‌సభ, రాజ్యసభలు, రాష్ట్రాల శాసనసభ, విధానసభల్లో ఎస్సీ, ఎస్టీల ప్రతినిధులను మాట్లాడనీయకుండా అడ్డుకోవడం అనివార్యంగా మారింది.
ఇక చివరికి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పూర్తిగా అగ్రకులాలతో నిండి, భూతద్ధంతో వెదికినా ఒక్క దళితుడు కానరారు. దళితవర్గానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కలిసి మూకుమ్మడిగా న్యాయస్థానాన్ని ధిక్కరించాడనే నెపంతో అతడిని వేధించడాన్ని బహుజన రాజ్యాధికార పార్టీ (బీఆర్‌పి) తీవ్రంగా గర్హిస్తుంది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించినట్టు పాలితులైన దళితులు అధికారంలో స్వంతంగా వాటా సంపాదించుకున్నప్పుడే ఈ వైషమ్యాలు తగ్గే అవకాశముంది. ఇప్పటికైనా బహుజన సమాజం కళ్లు తెరిచి, జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-నల్లా సూర్య ప్రకాశ్, స్టీరింగ్ కమిటీ ఛైర్మన్,
బహుజన రాజ్యాధికార పార్టీ (బిఆర్‌పి)