03/09/2026
యర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి అధ్యక్షతన యర్రగుంట్ల మున్సిపాలిటీ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారితో పాటు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గారు హాజరయ్యారు.
మున్సిపాలిటీలో పన్ను వసూళ్లను వంద శాతానికి పెంచాలని, పెండింగ్ బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు. పట్టణంలో గుర్తించిన గుంతలను వెంటనే పూడ్చి గుంతలు లేని రహదారులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐఐబీ తాగునీటి పథకం, టిడ్కో గృహాలు, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
పట్టణంలో రోజువారీగా ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, డంప్‌యార్డులో పేరుకుపోయిన పాత వ్యర్థాల తొలగింపు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులను నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
మున్సిపాలిటీ పరిధితో పాటు సమీప గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం తదితర అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చేందుకు సమగ్ర ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణకు అనుగుణంగా ప్రస్తుత వసతులను బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.