02/08/2026
"దాంపత్యం" ❤️❤️❤️
రెండు నిమిషాలు ఓపికతో చదవండి... 🙏
దాంపత్యం అంటే ఫోటోలలో నవ్వుతూ కనిపించే రెండు ముఖాల కథ కాదు. ఒకే ఇంట్లో వేలసార్లు మనస్పర్థలు వచ్చినా, బయటివారికి తెలియకుండా మళ్లీ మళ్లీ కలిసిపోయే రెండు హృదయాల ప్రయాణమే దాంపత్యం.
భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రమే ఉండదు. కోపం ఉంటుంది. అహంకారం ఉంటుంది. బాధ ఉంటుంది. రోజుల తరబడి మాట్లాడుకోని మౌనం కూడా ఉంటుంది. "ఇతను ఎప్పటికీ మారడు" అనే భార్య వేదన ఉంటుంది. "ఆమె నన్ను అర్థం చేసుకోవడం లేదు" అనే భర్త మనోవేదన కూడా ఉంటుంది.
అయినా చూడండి... అదే భార్య, భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే తలుపు తెరుచుకున్న శబ్దానికి మేల్కొంటుంది. అదే భర్త, భార్య భోజనం చేయలేదని తెలిసినా కోపంలో ఉన్నప్పటికీ ఆమె ముందు భోజనం పెడతాడు.
అదే దాంపత్యం.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు సందడిగా ఉంటుంది. వారి చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు... ఇలా వారి జీవితాల్లో తల్లిదండ్రులు పూర్తిగా మమేకమైపోతారు. కానీ ఒక రోజు పిల్లలు తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోతారు. ఇల్లు క్రమంగా నిశ్శబ్దమవుతుంది.
అప్పుడు మిగిలేది ఇద్దరే.
ఒకప్పుడు చిరాకుగా అనిపించిన అదే గురక, ఒకరోజు వినిపించకపోతే కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. "ఇంకా మాట్లాడొద్దు" అని మందలించిన అదే స్వరం, ఒకరోజు శాశ్వతంగా వినిపించకపోతే ఇంటి గోడలే వెలితిగా అనిపిస్తాయి.
ఒకరు దూరమైన తర్వాత చాలామంది వచ్చి ఓదార్పు మాటలు చెబుతారు. కానీ రాత్రి మంచం మీద ఖాళీగా మిగిలిన ఆ స్థలాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మందు ఇచ్చే చేయిని, "భోజనం చేశావా?" అని అడిగే స్వరాన్ని, కోపంలోనూ దాగి ఉన్న ఆప్యాయతను ఎవరూ తిరిగి తీసుకురాలేరు.
అందుకే గుర్తుంచుకోండి...
అత్యుత్తమ జంట అంటే ఎప్పుడూ గొడవపడని జంట కాదు. గొడవల తర్వాత కూడా ఒకరినొకరు విడిచి వెళ్లని జంటే నిజమైన దాంపత్యానికి నిదర్శనం.
దాంపత్యంలో ప్రేమకంటే గొప్పది అన్యోన్యత.
అన్యోన్యతకంటే గొప్పది సహనం. సహనం కంటే గొప్పది... చివరి వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలనే మనసు.
చిలిపితనం, సిగ్గు, గొడవలు, మౌనం, కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు, నవ్వులు, పరస్పర అవగాహన—ఇవన్నీ కలిసి దాంపత్యాన్ని పవిత్రంగా నిలబెడతాయి.
జీవించి ఉన్నప్పుడే జీవిత భాగస్వామి విలువను గుర్తించండి. ఎందుకంటే వారు లేనప్పుడు కార్చే కన్నీటి కంటే, వారు ఉన్నప్పుడే చూపే ప్రేమ, గౌరవం, ఆదరణ మరింత పవిత్రమైనవి.
గుర్తుంచుకోండి......
జీవితంలో పరిపూర్ణమైన జీవిత భాగస్వామి ఎవరూ దొరకరు. కానీ ఒకరి లోపాలను మరొకరు అంగీకరించి, చివరి వరకు చేయి విడవకుండా కలిసి నడిచే జీవిత భాగస్వామి కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది 🌹🌹
#😍👍