23/04/2024
● బతుకుదెరువునిస్తున్న బీడీల ఆకు
● కల్లాలు లేకున్నా సేకరిస్తున్న పల్లెప్రజలు
● కొమ్మకొట్టకపోవడంతో అంతంతే ఆకు
● అడవిలో జాగ్రత్తగా ఉండాలి : ఎఫ్‌ఆర్వో
అటవీ ప్రాంతాల్లోని పల్లెవాసులకు నమ్మకమైన ఉపాధినిచ్చే పని ఏదైనా ఉందీ అంటే అది తునికాకు సేకరణే. వేసవిలో పెద్దగా వ్యవసాయ పనులు, ఇతర పనులు లేని రోజుల్లో గ్యారంటీగా ఇంటిల్లిపాదికీ తునికాకు సేకరణ ఉపాధి కల్పిస్తుంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అటవీశివారు గ్రామాల్లో తునికి చెట్లు ఉన్నాయి. తునికాకు సేకరణకు జిల్లాలో అటవీశాఖ కల్లాలను ఏర్పాటు చేయలేదు. కానీ బీడీల తయారీకి వినియోగించే తునికాకు సేకరణతో పల్లెజనం ఉపాధి పొందుతున్నారు. వాస్తవానికి తునికి చెట్లను జనవరి, ఫిబ్రవరి నెలలో కొమ్మకొట్టడం(ఫ్రూనింగ్) చేస్తే మళ్లీ చిగురించి నాణ్యమైన బీడీల ఆకు లభించేది. కానీ రెండు దశాబ్దాలుగా అటవీశాఖ తునికాకు సేకరణకు జిల్లాలో స్వస్తి పలికింది. దీంతో కొమ్మకొట్టే(ప్రూనింగ్) పనిని ఆపేశారు. తునికి చెట్లు బాగా ఉన్న అటవీ ప్రాంతాల్లో ఆకు ఇగురు వచ్చింది. దీంతో తునికాకు సేకరణ సాగుతుంది. ఈ తునికాకును స్థానికంగా బీడీ కంపెనీ టేకేదారులకు, బీడీకార్మికులకు నేరుగా అమ్ముకుంటారు. 50 ఆకుల తునికాకు కట్ట ధరను ప్రభుత్వం రూ.3 ధర నిర్ణయించగా.. అదే తునికాకు కట్టను రూ.5 నేరుగా అమ్ముకునే అవకాశం ఉంది. ఒక్కో మహిళ నిత్యం 100 నుంచి 200 కట్టల తునికాను సేరిస్తారు. ఈ లెక్కన నిత్యం రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తారు.
జిల్లా పల్లెల్లో తునికాకు ఉనికి
జిల్లాలోని అటవీ గ్రామాల్లో తునికాకు చెట్లు ఉనికి ఉంది. కోనరావుపేట, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రుద్రంగి, చందుర్తి మండలాల్లోని అటవీ గ్రామాల్లో తునికాకు చెట్లు ఉన్నాయి. ఈ మండలాల్లోని అటవీ గ్రామాల్లో ఏటా తునికాకు సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎండలో ఇతర పనులకు వెళ్లకుండా నీడపట్టున ఉండి ఉపాధి పొందే వీలుండడంతో తునికాకు సేకరణ చేస్తున్నారు. పల్లెల్లో ఉపాధిహామీ పనులు ఉన్నా మెరుగైన ఉపాధి వస్తుందని ఆకు సేకరణపై ఆసక్తి చూపుతున్నారు.
గతంలో తునికాకు కల్లాలు
గతంలో తునికాకు సేకరణను అటవీశాఖ చేపట్టింది. జిల్లాలో 25వేల స్టాండర్డ్ బ్యాగుల(ఎస్‌బీ) తునికాకు సేకరణ జరిగేది. పల్లెల్లో తునికాకు కల్లాలు పెట్టి మరీ సేకరించేవారు. ఒక్క కోనరావుపేట యూనిట్ పరిధిలోనే 5వేల ఎస్‌బీల తునికాకు లభించేది. ఒక్కో స్టాండర్డ్ బ్యాగులో వెయ్యి తుని కాకు కట్టలు ఉండేవి. జిల్లాలో తునికాకు సేకరణకు అల్మాస్‌పూర్, గంభీరావుపేట, జిల్లెల్ల, మూడపల్లి, చందుర్తి, విలాసాగర్, కోనరావుపేట యూనిట్లు ఉండేవి. అప్పట్లో నక్సలైట్ల ప్రాబల్యంతో ఆకు సేకరణకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అడవుల్లో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో అధికారికంగా ఆకు సేకరణ నిలిచిపోయింది. కానీ పల్లెజనం మాత్రం ఉపాధిపై ఆశతో సేకరణ కొనసాగిస్తున్నారు. ఇంట్లో తునికాకు కట్టలు ఉంటే డబ్బులు నిల్వ ఉన్నట్లుగానే గ్రామీణులు భావిస్తున్నారు. ఇదే నమ్మకంతో ఆకు సేకరణ సాగిస్తున్నారు.