31/07/2026
జర్నలిస్టుపై దాడికి రంగం సిద్ధం!..
రేపు ఉదయం 5 గంటలకి ఆ విలేఖరు ఇంటికి వెళ్లి దాడి చేయండి అని కొత్త సత్రం రెడ్డిపాలెం ఇసుక మాఫియా టీంకు "హుకుం" జారీ చేసిన ఎమ్మెల్యే రెడ్డిగారు?!..
జర్నలిస్టుపై దాడులకు ప్రోత్సాహమా..?
ప్రజాస్వామ్యంపై మాఫియా ముసుగా..?
కావలి రూరల్ మండలం కొత్తసత్రం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఇసుక మాఫియా అక్రమాలపై కథనం రాసిన ఓ విలేకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ వార్త ఎమ్మెల్యే దృష్టికి చేరిన తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
సమాచారం ప్రకారం, మాఫియా టీం స్థానిక ఎమ్మెల్యేను కలిసి తమ వాదనలు వివరించగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి జర్నలిస్టుకు రక్షణ కల్పించే దిశగా స్పందించాల్సింది పోయి, “రేపు ఉదయం ఐదు గంటల సమయంలో అతని ఇంటిపై దాడి చేసి, కాళ్లు చేతులు కట్టేసి గ్రామానికి తీసుకెళ్లి, మహిళల చేత కొట్టించి చెట్టుకు కట్టేయండి” అన్నట్లుగా సూచనలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి
ఈ ఆరోపణలు నిజమైతే, ఇది కేవలం ఒక జర్నలిస్టుపై బెదిరింపు మాత్రమే కాదు… ప్రజాస్వామ్యంపై, భావప్రకటన స్వేచ్ఛపై, మీడియా స్వాతంత్ర్యంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా పరిగణించాల్సిందే.అక్రమాలను వెలికితీసినందుకు విలేకరిని అభినందించాల్సింది పోయి, అతనిపై దాడులకు ప్రోత్సాహం ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అధికారాన్ని విమర్శిస్తే శత్రువా? ప్రశ్నిస్తే దాడులా? ఇదేనా ప్రజాస్వామ్యం?
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి తీవ్రమైన ఆరోపణలపై కావలి మీడియా సోదరులు ఏకతాటిపై నిలబడి పాత్రికేయుడికి మద్దతు తెలపాల్సిన సమయంలో, సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే మాట వింటేనే కరెక్టా? వినకపోతే దాడులా? అక్రమాలను బయటపెడితే శిక్షా? పాత్రికేయుడి కలం మౌనమవ్వాలా ?
ప్రజలారా… మీడియా మిత్రులారా… ఈ ఘటనలో నిజం ఏదో బయటపడాల్సిన అవసరం ఉంది.జర్నలిస్టుపై బెదిరింపులు, దాడుల పిలుపులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అక్రమాలపై రాసిన కలాన్ని అణిచివేయాలనుకునే ప్రతి ప్రయత్నాన్ని సమాజం తీవ్రంగా ఖండించాలి.
ప్రశ్నించే గొంతు బలహీనపడితే… రేపు ప్రజల గొంతుకే తాళం పడుతుంది.