19/09/2021
బందరువాళ్ల కోసం:
తెలుగులందరి పట్టణం మన బందరు
గేట్ వే ఆఫ్ ఈస్ట్ ఇండియా, కూచిపూడి నాట్య జన్మస్థానం, ప్రముఖుల నెలవు, మంగినపూడి బీచ్
బందరు రేవు.. బందరు మిఠాయి.. పెడన కలంకారీ.. కూచిపూడి నాట్యం .. చిలకలపూడి బంగారం.. మంగినపూడి బీచ్... -ఇలా మన తెలుగునాటనే కాక, దేశంలో ఎక్కడైనా 'మచిలీపట్నం' పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి ఇవి.
మచిలీపట్నం అంటే ఇంతేనా.. అంతకు మించి మచిలీపట్నం గురించి చెప్పుకోవడం అంటే మధ్యాంధ్ర ప్రదేశం గురించి చెప్పుకోవడమే. ఇంకా చెప్పాలంటే.. ఆధునిక భారతదేశ ఆవిర్భావానికి కారణమైన అసలైన 'గేట్ వే ఆఫ్ ఇండియా” మన మచిలీపట్నమే. ఇప్పుడు ఎన్నో మహానగరాలు ఉన్నా మన తొలినాళ్ల మహానగరం మచిలీపట్నమే. ఆధునిక భారతదేశంలో తొలి కంపెనీ ఏర్పాటయినది బందరులోనే. దేశంలోని తొలి కాస్మోపాలిటన్ సిటీ బందరు అంటే అతిశయోక్తి కాదు. దేని గురించైనా చెప్పుకోవాలంటే “నిన్న-నేడు-రేపు” అని చెప్పుకుంటాం. కాని బందరు గురించి చెప్పుకోవాలంటే “మొన్న-నిన్న-నేడు-రేపు" అని చెప్పుకోవాలి. క్లుప్తంగా చెప్పుకుంటాం.
మొన్నటి చరిత్ర:
క్రీ.పూ. 3 శతాబ్దం నాటికే.. అంటే ఇప్పటికి 2,300 సంవత్సరాల క్రితమే ఈ పట్టణం ఉనికిలో ఉంది. ఇక్కడ" (మచిలీపట్నం పక్కనే గల) శ్రీకాకుళం ను రాజధానిగా పరిపాలించిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు తెలుగువారి తొలి ప్రభువు అనుకోవచ్చును. ఈయన శాతవాహనులకు ముందు వారు. శాతవాహన వంశ వ్యవస్థాపకుడైన శ్రీముఖుడు కూడా శ్రీకాకుళం రాజధానిగా చేసుకునే తొలి పాలన చేశాడు. తర్వాత ఇక్కడికి సమీపంలోని ధాన్యకటకం (అదే నేటి ధరణికోట లేదా అమరావతి) రాజధానిగా చేసుకుని పాలించాడు.
అంటే శాతవాహనులకు ముందు నుంచి ఉనికిలో ఉన్న నగరం "మై సోలీస్". అవును.. ఈ పట్టణం తొలి పేరు అదే. ఆ తర్వాత దాని పేరు 'మసోలియా' గా మారింది. తర్వాత కాలంలో మసొలిపటం.. క్రమంగా మచిలీపట్నం అయింది. ఈ సముద్రతీరం పట్టణంలో అపారంగా చేప(మచిలీ)లు దొరుకుతాయి కాబట్టి 'మచిలీపట్నం అనే పేరు వచ్చిందని అనుకుంటే పొరపాటే. ఇక్కడి నుంచి మస్లిన్ అనే ఖద్దరు రోమ్, టర్కీ ఇంకా అరబ్, పర్షియా దేశాలకు ఎగుమతి అయ్యేది. అలా వారు పిలిచి పిలిచి మైసోలిస్ అని, తర్వాత 'మసోలియ' అనే పేరు వచ్చింది. (యాధృచ్చికంగా 'మచిలీపట్నం పదం కూడా అన్వయమే. అందుకే తర్వాత కాలం ఇక్కడ సముద్రపు బొడ్డున కోట ద్వారం ఒక భారీ చేప విగ్రహం ఏర్పాటు చేశారు). అలా క్రీస్తు పూర్వమే మచిలీపట్నం దేశంలోనే ప్రముఖ రేవు కేంద్రంగా, వాణిజ్య కేంద్రంగా ఉండేది. అంటే విదేశీయుల రాకపోకలు జరిగేవి.
ఈ పరిణామ దశలోనే దీన్ని 'బందరు' అని పిలవడం కూడా మొదలయింది. 13వ శతాబ్దం నుంచి పర్షియన్ల ప్రభావం భారతదేశం మీద పడిన దశలో మసిలీపటాన్ని వారు 'బందరు' అని పిలిచేవారు. బందరు అంటే పర్షియన్ భాషలో రేవు అని అర్థం. పర్షియన్ భాషా ప్రభావం దేశంలో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా చాలా ప్రాంతీయ భాషల మీద పడింది. (బెంగాలీ, అస్సామీ బాషల్లో ఆ విధంగా బందరు అంటే రేవు అని స్థిరపడింది).
నిన్నటి చరిత్ర:
ఇక ఐరోపా నుంచి భారత్ కు సముద్ర మార్గం కనుగొన్న తర్వాత, 17 వ శతాబ్దం తొలినాళ్లలోనే బ్రిటీష్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్చివారు వర్తకం కోసం ఒకరి వెంట ఒకరు తొలిగ ఇండియా లోకి అడుగుపెట్టింది బందరు పోర్టు ద్వారానే.. అదీనూ బందరు కే. క్రీ.శ. 1611 లో ఆంగ్లేయులు మచిలీపట్నంలో తమ స్థావరం ఏర్పాటు చేసుకొని, 1641 లో మద్రాసుకు తరలి వెళ్ళే వరకూ బందరు హెడ్క్వార్టర్ గానే తమ వ్యవహారాలు సాగించారు. అంటే తర్వాతి కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన “ఈస్టిండియా కంపెనీ” తొలి వర్తక స్థావరం ఇదే. ఆ విధంగా, అప్పటి వరకు రాచరిక పాలనలో 'ఫ్యూడల్ బిజినెస్ స్ట్రక్చర్' గల భారతదేశంలో తొలి ఆధునిక "క్యాపిటలిస్టిక్ కంపెనీ” ఏర్పాటయింది బందరులోనే.బ్రిటిష్ వారి ఏలుబడిలో బందరు కేంద్రంగా “మచిలీపట్నం జిల్లా" ఏర్పాటయింది. దాదాపు రెండు వందల ఏళ్ల పాటు గుంటూరు, ప.గో జిల్లాలు ఈ జిల్లాలో భాగంగానే ఉండేవి. ఇదీ బందరు ఘన చరిత్ర.
వర్తమానం:
20వ శతాబ్దం తొలి నాళ్లలో గుంటూరు.. తర్వాత ప.గో. జిల్లాలను విడగొట్టి మచిలీపట్నం కేంద్రంగా "కృష్ణా జిల్లా" ఏర్పాటయింది. 20 శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని మద్రాసు, విజయవాడ తో పాటు మచిలీపట్నం కూడా ప్రధాన జాతీయోద్యమ కేంద్రంగా ఉండేది. ఇక్కడి బందరు లోని నోబుల్, హిందూ, నేషనల్ కాలేజ్, లేడీ యాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు దేశంలోని తొలి నాటి ఆధునిక విద్యాసంస్థలలో కొన్ని. ఎందరో ప్రముఖులకు ఇవి విద్యాదానం చేసాయి. దశాబ్ద కాలం క్రితం కృష్ణా యూనివర్శిటీ ఏర్పాటయినది. మచిలీపట్నం-పూనె (విజయవాడ-హైదరాబాద్-ముంబై) 35 వ నెంబరు జాతీయ రహదారి, 216 నెంబర్ కోస్తా జాతీయ రహదారి బందరు నుంచే వెళుతున్నాయి.
ఎక్కడా బతకలేని వాడు బందరు వచ్చి బతకొచ్చు అనేది ఒక నానుడి. బందరులో ఉండే కలంకారీ, రొల్దుగొల్దు నగల పరిశ్రమలు ఎంతోమందికి ఉపాధిని అందిస్తున్నాయి. ఇక్కడ అచ్చులతోనూ, చేతితోనూ వేసే అద్దకం పని పూలూ, మొక్కల డిజైన్లతో ఎంతో అందంగా ఉంటాయి. ఈ కలంకారి బట్టలు దేశ విదేశాలకు పంపబడతాయి. ఇక గిల్టు నగలు బొంబాయి, ఢిల్లీ నగలతో పోటీపడుతు అన్ని నగరాల్లో అమ్మకాలు జరుగుతుంటాయి. ఇప్పటికే ఇక్కడి బిఇఎల్ పరిశ్రమ ఉంది. కృష్ణా-గోదావరి బేసిన్ సముద్ర గర్భ చమురు, వాయు నిక్షేపాల వెలికితీతలో ముఖ్యమైన ప్రాంతం మచిలీపట్నం. ఈ మధ్యనే మచిలీపట్నాన్ని నగరపాలక సంస్థగా ప్రకటించి, రాజధాని ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగ మచిలీపట్నం నగరాభివృద్ధి సంస్థ ను ఏర్పాటు చేశారు.
రేవు-భవిత:
చరిత్రగా మిగిలిపోయిన బందరు పోర్టును పునర్నిర్మించేందుకు ఇటీవలనే శంకుస్థాపన జరిగింది. 24 బెర్తుల ఈ పోర్టును దాదాపు 5 వేల ఎకరాలలో నిర్మిస్తున్నారు. మొదటి దశలో 3 బెర్తులు అందుబాటులోకి రానున్నాయి.
చరిత్రగా మిగిలిపోయిన బందరు పోర్టును పునర్నిర్మించేందుకు శంకుస్థాపన జరిగింది. ఏపీ రాజధాని ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఈ పోర్టు మధ్యాంధ్ర ప్రదేశ్ ప్రగతికే కాక పోర్టు లేని తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉపయోగపడనున్నది. ఇక్కడి ఫిషింగ్ హార్బర్ ను భారీ ఫిషింగ్ హార్బరుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రకటించింది. ప్రభుత్వం ఆధ్వర్యాన ఏర్పాటయ్యేలా ఒక మెడికల్ కళాశాల బందరుకు మంజూరయింది. ఇక్కడి సమీపంలోనే గుల్లలమోదలో దేశంలోనే అతి పెద్దదయిన మరో మిస్సైల్ పరీక్షల కేంద్రం ఏర్పాటవుతున్నది.
వీటన్నిటితో పాటు ప్రధానమైనది విశాఖపట్నం-చెన్నై ఇంస్ట్రియల్ కారిడార్ లో “గన్నవరం-కంకిపాడు” నోడ్ కూడా ఉంది. గన్నవరం వైపు నూజివీడును, కంకిపాడు వైపు మచిలీపట్నాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక. గుల్లలమోద మిస్సైల్ పరీక్షల కేంద్రం విశాఖపట్నం-చెన్నై ఇంస్ట్రియల్ కారిడార్ లో “గన్నవరం-కంకిపాడు” నోడ్ పూర్తయితే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయనేది నిర్వివాదాంశం.
ఎందరో మహానుభావులు:
ఎందరో ప్రముఖులకు పుట్టినిల్లు మచిలీపట్నం. మువ్వ గోపాల పదాలు రాసిన తుమ్మలపల్లి క్షేత్రయ్య, కూచిపూడి నాట్య సృష్టి కర్త సిద్ధేంద్రయోగి ఇక్కడి వారే. కూచిపూడి నాట్య జన్మస్థానం అయిన కూచిపూడి ఈ పక్కనే ఉంది. స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకరు. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఈయనే. దేశంలోనే తొలి ఇన్యూరెన్స్ కంపెనీ అయిన “ఎల్‌ఐసి" వ్యవస్థాపక సంస్థలలొ ఆంధ్రాబ్యాంక్ ఒకటి కావడం గమనార్హం. తొలి తెలుగు పత్రిక అయిన కృష్ణా పత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు ఇక్కడి వాడే. ముంబై కేంద్రంగా స్థాపించబడిన అమృతాంజన్ కంపెనీ వ్యవస్థాపకులు బందరు ప్రాంతానికి చెందిన కాశినాథుని నాగేశ్వరరావు పంతులుగారు. ఈయన స్వాతంత్య్ర సమరయోధులు, తొలినాటి పత్రికలలో ఒకటైన ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు. నాలుగు దశాబ్దాల పాటు కృష్ణా పత్రిక (ఒక జిల్లా పేరు మీద ఏర్పాటయిన జాతీయ పత్రిక) సంపాదకునిగా తెలుగు సాహితీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన బందరుకే కాక తెలుగు రాష్ట్రానికే గర్వకారణం..
మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించి తెలియనవారు ఉండరు. 1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని కూడా ఆయన రచించాడు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కోలవెన్ను రామకోటేశ్వరరావు 1928లో బందరు నుండి వెలువరించే 'త్రివేణి' పత్రికలో రాధాకృష్ణన్, రాజాజీ, నెహ్రూ మొదలైన నాయకులు రచనలు చేసేవారు. మహాత్మా గాంధీ 1934 లో బందరు వచ్చినప్పుడు త్రివేణి చూసి ఎంతో ప్రశంసించారు. దక్షిణ భారత సినిమా రంగ పితామహుడు రఘపతి వెంకయ్యనాయుడు ఇక్కడి వారే. తెలుగు, తమిళ తొలి సినిమా కర్తె కాకుండా, మద్రాసులో తొలి స్టూడియో నిర్మించినది ఈ మచిలీపట్నం వాసే. సంఘసంస్కర్త, బ్రహ్మసమాజ స్థాపకులలో ఒకరైన రఘుపతి వెంకటరత్నం నాయుడు ఈయన సోదరులే.జాతీయ విద్యకై కృషి చేసిన తెలుగువాడు కోపల్లె హనుమంతరావు 1910 లో స్థాపించిన ఆంధ్ర జాతీయ కళాశాల జాతీయోద్యమానికి వేదికైంది.
మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ ఒక విధంగా అవిభాజ్యమైనవి. గుంటూరు, తెనాలితొ కలపుకుంటే ఇంకా సమగ్రం. తొలి తరం సినీ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం, వి. మధుసూదనరావు, కె. ప్రకాశరావు, భారతదేశం గర్వించదగ్గ సినీనటులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విజయవాడ-మచిలీపట్నం ప్రాంతీయులే. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు కూడా. ఇంకా కైకాల సత్యనారాయణ, కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు, నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి, మల్లాప్రగడ శ్రీ రంగారావు, కాటంరాజు నారాయణరావు, కొర్రపాటి గంగాధరరావు లాంటి ప్రముఖుల నెందరినో మనకందించింది బందరు. కవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు లాంటి బహుముఖ ప్రజ్ఞాశీలి అడివి బాపిరాజు కూడా ఇక్కడి వాడే. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న “బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే.
మచిలీపట్నం ప్రత్యేకత:
తెలుగు రాష్ట్రాలలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు జరిగే విజయవాడ తర్వాత పెద్దఎత్తున దసరా ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయి. దసరా ఉత్సవాల్లో బందరంతా శక్తిపటాలతో సందడిగా మారుతుంది. కోలకతా మాదిరి కాళీమాతను ఊరేగింపులు, పూజలు ఇక్కడ జరుగుతాయి. పట్టణానికి చెందిన మాజీ సైనికుడు ఒకరు దశాబ్దాల క్రితం కోలకతాలోని కాళీకామాత చిత్రపటాన్ని ఈడేపల్లిలో ప్రతిష్టించి పూజలు చేయడం మొదలెట్టాడట. ఇది ఇప్పుడు సంప్రదాయంగా మారి ప్రతి ఏడాది పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పండుగకు నెలముందే ఊళ్లో శక్తిపటాలు తయారు మొదలవుతాయి. శక్తివేషం వెసుకొని 8 అడుగుల దుర్గామాత శక్తిపటాలను అతని వీపున కట్టుకుని పురవీధులలో ఊరేగుతు డప్పులమోతతో నృత్యం చేస్తుంటే ఊరు ఊరంతా వారిని అనుసరిస్తుంటారు. అలా పండుగ నవరాత్రులు వీధులన్నీ తిరిగి పండుగరోజు రాత్రి ఆయాప్రాంతాల పటాలను కోనేరుసెంటరు కు ప్రదర్శనగా తీసుకువచ్చి తెల్లవారుజాము వరకు పూజలు నిర్వహించడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
54 అడుగులతో కొత్త శతాబ్దంలో నిర్మించిన సాయిబాబా విగ్రహం పట్టణానికే వన్నె తెచ్చింది. 36 అడుగుల వెడల్పుతో ఉన్న బాబా విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లనుంచే కాక ఇతర ప్రాంతాలనుంచి కూడా భక్తులు వస్తుంటారు.
ఇక బందరు లడ్డు పేరు వినని తెలుగు వారు ఉండరు. 150 సంవత్సరాల క్రితం స్థిరపడిన బొందిలీలు అని పిలిచే సింగుల కుటుంబాలు బందరు లడ్డు సృష్టికర్తలుగా చెపుతారు. బందరు లడ్డు ను తొక్కుడు లడ్డు అని కూడా అంటారు. స్వచ్ఛమైన శనగపిండి నుండి ముందు పూస తీసి ఘుమఘుమలాడే అతి స్వచ్ఛమైన నేతితో తయారయ్యే ఈ లడ్డులలో ఎటువంటి రంగు, రసాయనాలు కలుపరు. సింగుల కుటుంబాలు ఎవరూ ఇపుడు లేకున్నా లడ్డూలు మాత్రం ఇక్కడ తయారయి దేశంలోని అన్నిచోట్లకు వెళుతుంటాయి.
బందరు అందాలు:
పట్టణ సమీపంలో మంగినపూడి బీచ్ ఉంది. ఇసుక తిన్నెలు, సరుగుడు చెట్లుతో ఈ బీచ్ ప్రత్యేకమైన సొగసుతో ఉంటుంది.
ఇక్కడి సాగర తీరాన గల నృత్య శాలలో కూచిపూడి నృత్యము నేర్పిస్తున్నారు. తీరంలో ఉన్న దత్తాశ్రమంలో రామేశ్వరంలో ఉన్నట్లుగా పన్నెండు బావులు లింగాకారంలో ఉండటమేకాక ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయి. కార్తీక పౌర్ణమికి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్నానం చేస్తారు. చిలకలపూడి లో గల పాండురంగ స్వామి దేవాలయం రాష్ట్రంలోనే ప్రముఖమైనది. ఇది మంగినపూడి బీచికి చాలా దగ్గరలో ఉంది. అంతరాలయంలోనున్న పాండురంగడు నల్లరాతి విగ్రహం, గర్భగుడి బయటవున్న పాలరాతి అమ్మవార్ల విగ్రహలు భక్తిభావంతో కట్టిపడేస్తాయి. ఇక బందరు సమీపంలో కొల్లేరు, కృష్ణానది-సాగర సంగమ ప్రాంతం హంసలదీవి, నృత్య కేంద్రం కూచిపూడి, శ్రీకాకుళంలోని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం వంటి ప్రఖ్యాత సుందర ప్రాంతాలు ఉన్నాయి.
ఇక బందరులో అయ్యవార్లకు అమ్మవార్లకు కొదవలేదు. సర్కిల్ పేటలో కొలువైయున్న శ్రీ సంతానవేణుగోపాలస్వామివారి ఆలయానికి 150 సంవత్సరాల చరిత్ర ఉంది. సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేసినచో సంతానం కలుగుతుందని ప్రతీతి. ఇంకా కాలేఖాన్ పేటలోని శ్రీ కోదండ రామాలయం కాలేఖాన్ పేట.రాబర్ట్ సన్ పేటలోని శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం", నిజాంపేటలోని శ్రీ నూతి వనలమ్మ తల్లి ఆలయం, ఈడేపల్లి లోని శ్రీ శక్తి ఆలయం ప్రముఖ దేవాలయాలు. శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం.శ్రీ భద్రాద్రి రామాలయం. శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం, బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం ఇక్కడ ప్రముఖ ఆలయాలు.
కొన్ని గుర్తులు:
చరిత్రకు దర్పణం పడుతూ ఇప్పటికీ ఇక్కడ ఇంగ్లీషు పేట, డచ్చి పేట, రాబర్ట్ సన్ పేట, నిజాంపేట అనే పేర్లతో ఏరియాలు ఉన్నాయి. 1864 సంవత్సరంలో వచ్చిన ఉప్పెనలో బందరు పట్టణం లోనె 30 వేల మంది చనిపోయారు. అప్పటి విజయవాడ జనాభా 9,336 మంది మాత్రమే. అంటే మచిలీపట్నం అప్పట్లోనే ఎంత పెద్ద నగరమో అర్ధం చేసుకోవచ్చు. 16వ శతాబ్దంలో పట్టణం మధ్య నుంచి (ప్రస్తుతం ఉన్న రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి) బందరు కోట వరకు రాకపోకలకు అనువుగా 12 అడుగుల వెడల్పుతో చెక్కవంతెన ఉండేదట. ప్రస్తుతం ఆ నమూనా నెదర్లాండ్ లోని మ్యూజియంలో ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు చెబుతారు.
బందరు రుచులు:
ఇక్కడ రుచులనగానే వెంటనే గుర్తుకు వచ్చేది బందరు లడ్డు. అయితె ఇక్కద తయారయ్యె బందరు హల్వా కూడా ఇక్కడ ప్రముఖమైనదే. అంతేకాక బందరు అనగానే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా వేట మాంసం-గోంగూర (మటన్-గోంగూర) వంటకం ఇక్కడ పుట్టినదే. అలాగే జీడిపప్పు-రొయ్యలు, చింతకాయ-చేపలు వంటి ఎన్నొ సీఫుడ్స్ కి ఇది ఫేమస్.
మన బందరు
జాతిపితకు జన్మనిచ్చినది పోరుబందరు
జాతీయ జెండా నిచ్చినది మన పోర్టు బందరు
ఆంధ్ర, కృష్ణా పత్రికల అక్షరాంజనం
ఆంధ్రాబ్యాంక్ నవ ఆర్థిక అమృతాంజనం
భలే.. భలే.. బందరు మిఠాయి దుకాణం
పల్లె నుంచి ఢిల్లీ వరకు ఈ పేరు విఖ్యాతం
బందరు లడ్డు అంటే ఊరని నోరుండదు
ఇట్టే కరిగిపోయే ఈ లడ్డూ రుచెరగని వారుండరు
మస్లిన్ ఖద్దరు పై అద్దిన అందాల అలంకారి
ప్రపంచమంతా ప్రఖ్యాతం మన పెడన కలంకారీ
మంగినపూడి బీచ్, చిలకలపూడి బంగారం
బందరు రేవు, బందరు కోట మహా ప్రాచీనం
ఎందరో ప్రముఖులను కన్న వూరు మన బందరు
ఇక్కడే జనించారు. తొలితరం మహానుభావులందరు.👏👏
మరో సముదాయం నుంచి🙏🙏