29/06/2026
కామ్రేడ్ యార్లగడ్డ జోయకు జోహార్లు 🌹
యార్లగడ్డ జోయ ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్ సీపీఎం నాయకురాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) నాయకురాలు. చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటాలు, భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి ఉన్న కుటుంబంలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచే ప్రజా ఉద్యమాలతో అనుబంధం పెంచుకున్నారు.
ఆమె సుదీర్ఘ రాజకీయ, ప్రజా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ ప్రజాశక్తి బుక్ హౌస్ "ఉద్యమాల ఒడిలో యార్లగడ్డ జోయ" పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించింది.
యార్లగడ్డ జోయ నందిగామ డివిజన్ సీపీఎం కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం కృష్ణా జిల్లా కమిటీ సభ్యురాలిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA)లో నాయకురాలిగా మహిళల హక్కులు, సమానత్వం, గౌరవప్రదమైన జీవితం కోసం దశాబ్దాల పాటు నిరంతరం పోరాడారు.
అఖిల భారత కిసాన్ సభ కమిటీ సభ్యురాలిగా రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు, పాల ఉత్పత్తిదారుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ సంక్షోభంపై ప్రభుత్వాల దృష్టి సారించేలా అనేక పోరాటాలు నిర్వహించారు.
మహిళలపై జరుగుతున్న హింస, లైంగిక దాడులు, వివక్షలకు వ్యతిరేకంగా ఆమె నిరంతరం గళమెత్తారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో అనేక ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన నాయకురాలు యార్లగడ్డ జోయ వారికి విప్లవ జోహార్లు.