09/02/2026
పేదలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
39వ డివిజన్ మూలాపేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్‌ను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మంత్రి మాట్లాడుతూ, నగరంలో రోజుకు 3 లక్షల లీటర్ల మినరల్ వాటర్‌ను ప్రజలకు అందించేందుకు 2014లోనే శ్రీకారం చుట్టామని చెప్పారు. మూడు మదర్ ప్లాంట్లు, 60 చిన్న ప్లాంట్ల ఏర్పాటుకు రూ.2 కోట్ల 60 లక్షలతో పనులు చేపట్టామని, గత ప్రభుత్వం వాటిని నిలిపివేసి ప్రజా ధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించామని తెలిపారు.
ఇప్పటికే 26 ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లను ప్రారంభించామని, మరో ఐదు ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అవసరమైతే మరో 60 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను పేదలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని స్పష్టం చేశారు. జూన్ 12 నాటికి చేపట్టిన అన్ని పనులను పూర్తి చేస్తామని, ప్రజల సహకారంతో నెల్లూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నగర ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలన్న మంత్రి నారాయణ సంకల్పంతో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 60 వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మూలాపేటలో 26వ వాటర్ ప్లాంట్‌ను ఈరోజు మంత్రి ప్రారంభించారని చెప్పారు. అలాగే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ హైస్కూల్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, పేదల సంక్షేమం కోసం కూడా సంవత్సరానికి 10 కోట్లు సొంత నిధులను నారాయణ గారు ఖర్చు చేస్తున్నారని, ఇది మంత్రి సేవ భావానికి నిదర్శంగా రూప్ కుమార్ చెప్పారు
అనంతరం మూలాపేట బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆదునీకరణ పనులను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. DSR ఫౌండేషన్ సహకారంతో కార్పొరేట్ హంగులతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. నిర్మాణ పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, జూన్ నాటికి పాఠశాల అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, కార్పొరేటర్ నాగరాజు, అన్నంగి ప్రసాద్, నాని స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.