M. Venkaiah Naidu

M. Venkaiah Naidu Former Vice President of India

జర్మనీ తెలుగు సంఘం (TAG) ఆధ్వర్యంలో ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న 'తెలుగు సంబరం - 2026' ప్రారంభోత్స...
19/09/2026

జర్మనీ తెలుగు సంఘం (TAG) ఆధ్వర్యంలో ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న 'తెలుగు సంబరం - 2026' ప్రారంభోత్సవంలో ఆన్‌లైన్ (సాంకేతికత) ద్వారా పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. చొరవ తీసుకుని చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్షులు శ్రీ నరేష్ కోనేరు గారికి, కోశాధికారి శ్రీ శ్రీకాంత్ గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు, హాజరైన యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ గారికి, జర్మనీలో నివసిస్తున్న తెలుగు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంస్కృతీ సంరక్షణతో పాటు జర్మనీకి వచ్చే తెలుగు విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న TAG బృందానికి అభినందనలు.

మాతృభాష కంటి చూపు లాంటిది, పరభాషలు కళ్ళజోడు లాంటివి. ఎన్ని విదేశీ భాషలు నేర్చుకున్నా, మన ఇళ్లల్లో పిల్లలతో తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలి. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, విద్యాబుద్ధులు నేర్పిన గురువు... ఈ ఐదింటినీ జీవితంలో ఎప్పుడూ విస్మరించకూడదు. గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ బలమైన గొంతుకగా మారుతోంది. స్వదేశంలోని నవతరం ఆవిష్కరణలకు అంతర్జాతీయ విపణిలో అవకాశాలు కల్పించే వాణిజ్య వారధులుగా ప్రవాస భారతీయులు నిలవాలని అకాంక్షిస్తున్నాను.

My heartfelt birthday greetings to the architect of contemporary Bharat’s remarkable development journey, visionary lead...
17/09/2026

My heartfelt birthday greetings to the architect of contemporary Bharat’s remarkable development journey, visionary leader Shri Narendra Bhai Modi. My best wishes for a long & life filled with many more accomplishments.

దేశ ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.విశ్వమంతా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ, ప్రకృతిని కాపాడుకోవాలనే సందే...
14/09/2026

దేశ ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

విశ్వమంతా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ, ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ, సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే వినాయకచవితి నాడు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ దిశగా కంకణబద్ధులు కావాలి.

ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని, ఆ విఘ్నాధిపతి దీవెనలతో వారి వారి పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ తమతమ రంగాల్లో విజయాలు సాధించాలని, ఆకాంక్షిస్తున్నాను.

విజయవాడ ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో మాట్ల...
11/09/2026

విజయవాడ ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో మాట్లాడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. "ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది ఏదీ లేదు." యువత వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకొని స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడాలి.

ఎవరి పని వారు చిత్తశుద్ధితో, అంకితభావంతో చేయడమే నిజమైన దేశభక్తి. 2047 నాటికి 'వికసిత భారత్' సాకారం కావాలంటే యువతలో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకం. శిక్షణార్థులందరూ ఇక్కడ నేర్చుకున్న విద్యతో సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి, దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని అమర రాజా గ్రూప్ అధినేత డాక్టర్ గల్లా రామచంద్...
10/09/2026

తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని అమర రాజా గ్రూప్ అధినేత డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారికి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ గారి పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారం అందజేయడం సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గల్లా రామచంద్రనాయుడుగారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.

సాంకేతికత నాలుగు గోడల ల్యాబ్‌లకే పరిమితం కాకూడదు, సమాజంలో చివరి వ్యక్తికి ఉపయోగపడాలన్నదే 'ప్రజా శాస్త్రవేత్త' డాక్టర్ యలవర్తి నాయుడమ్మ గారి సందేశం. మేధోసంపత్తిని లాభాపేక్ష దృష్టితో చూడకుండా సామాజిక శ్రేయస్సుకు ఉపయోగించిన గొప్ప శాస్త్రవేత్త వారు. వారి పరిశోధనలు తోలు పరిశ్రమ రంగం రూపురేఖలనే మార్చేశాయి. నాయుడమ్మ గారి కృషి ఫలితంగా నేడు రూ. 1.15 లక్షల కోట్ల టర్నోవర్‌తో 45 లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తోంది.

ఇప్పుడు "నాలెడ్జ్ ఈజ్ పవర్" కాదు, "ఇన్నోవేషన్ ఈజ్ పవర్!". ఆవిష్కరణ చేసేటప్పుడు మన సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. కూల్ ఫాబెట్స్ యాప్ ఇలాంటిదే. ఈ యాప్ ద్వారా తెలుగు లిపిని భవిష్యత్ తరాలకు చేరువ చేస్తున్న రంజిత్ బృందం ప్రయత్నాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. యువత పరిశోధనల రంగంలోకి వచ్చి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి భారత దేశ స్వయంసమృద్ధి లక్ష్య సాధనకు తమవంతు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. 'జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్' తో పాటు 'జై ఆవిష్కరణ్!' నినాదంతో యువత ముందుకు సాగి, భారత్‌ను విశ్వగురువుగా నిలబెట్టాలి.

తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం జరిగిన స్వర్గీయ శ్రీ తమిరిశ రామాచార్యుల వారి శత జయంతి స్మారక సమావేశంలో పా...
10/09/2026

తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం జరిగిన స్వర్గీయ శ్రీ తమిరిశ రామాచార్యుల వారి శత జయంతి స్మారక సమావేశంలో పాల్గొని ప్రసంగించడం సంతోషంగా ఉంది. తమ జీవితాన్ని సమాజ సేవకు, జాతీయవాద భావజాల వ్యాప్తికి అంకితం చేసిన నిస్వార్థ త్యాగమూర్తి రామాచార్యులు గారు. 1943లోనే ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుడిగా ప్రస్థానం ప్రారంభించిన వారు, 1972 జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న సమయంలో, ఎమర్జెన్సీ కాలంలో 19 నెలల పాటు రాజమండ్రి జైలులో నిర్బంధంలో ఉన్న సమయంలోనూ ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడక చివరిశ్వాస వరకూ నిబద్ధతతో వ్యవహరించిన గొప్ప వ్యక్తి. బీజేపీలో అగ్రనేతలతో పరిచయాలున్నా ఏనాడూ పదవులను ఆశించలేదు. తెనాలి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారంలోనూ, అర్చకుల సమస్యల పరిష్కారంలోనూ వారు చూపిన చొరవ వారిని ప్రజల మనిషిని చేశాయి. నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు కట్టుబడి ఉన్న రామాచార్యులు గారి ఆదర్శాలు నేటి తరానికి ఆదర్శం.

మనోగతం:: ఆత్మసంతృప్తిని అందించిన "స్వర్ణభారత్ ట్రస్ట్" వెండి వెన్నెల పండుగస్వర్ణభారతి - గ్రామీణ భారతానికి 25 ఏళ్ళ సేవా హ...
08/09/2026

మనోగతం:: ఆత్మసంతృప్తిని అందించిన "స్వర్ణభారత్ ట్రస్ట్" వెండి వెన్నెల పండుగ

స్వర్ణభారతి - గ్రామీణ భారతానికి 25 ఏళ్ళ సేవా హారతి
- ముప్పవరపు వెంకయ్యనాయుడు
-------------------------
పరోపకారాయ ఫలంతి వృక్షాః
పరోపకారాయ వహంతి నద్యః ।
పరోపకారాయ దుహంతి గావః
పరోపకారార్థమిదం శరీరమ్ ॥

"ఇతరుల ఆకలిని తీర్చేందుకే చెట్లు ఫలాలను అందిస్తాయి. లోకంలోని సమస్త జీవరాశుల దాహాన్ని తీర్చేందుకే నదులు నిరంతరం ప్రవహిస్తాయి. సమస్త జీవకోటి పోషణ కోసమే ఆవులు సైతం అమృతం లాంటి పాలను అందిస్తాయి. అలాగే ఈ మానవ జన్మ స్వార్థం కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసమే ఉపయోగపడాలి" అన్నది ఈ సుభాషితం భావం.
--------
సెప్టెంబర్ 7న సోమవారం... స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవం కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి తో కలిసి పాల్గొన్నాను. ఆ సమయంలో ఈ సంస్థ 25 ఏళ్ళ ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకునే అవకాశం కలిగింది. ఒక్కసారి పాతికేళ్ళ వెనుకకు వెళ్ళి చూస్తే... ఏదో మాటల సందర్భంలో నా కుమార్తె శ్రీమతి దీపా వెంకట్ అడిగిన ఒక ప్రశ్న నుంచి ఉద్భవించిన ఆలోచనే స్వర్ణభారత్ ట్రస్ట్ కు బీజారోపనంగా మారింది. సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచన అక్కడే ఆగిపోకుండా... 8 మంది మిత్రుల సహకారంతో స్వర్ణభారత్ స్వప్నం సాకారమైంది. అంతకు ముందే శ్రీ నానాజీ దేశ్ ముఖ్ గారు చిత్రకూట్ లో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నుంచి ప్రేరణ పొందాను. గ్రామాల్లో భారతీయ ఆత్మ దాగి ఉందన్న మహాత్మ గాంధీ స్ఫూర్తిని మనసులో నిలుపుకున్నాను. అయితే కారణాలు ఏవైనా ట్రస్ట్ స్థాపన కార్యరూపం దాల్చలేదు. 2001లో మిత్రులతో కూర్చుని సంభాషిస్తున్న సమయంలో నా కుమార్తె చొరవతో నిలదీసినంత పని చేసింది. బాధ్యత వహించడానికి కూడా సిద్ధమైంది. అప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు దాటాయి. మిగతా 8 మంది మిత్రులు మేము తోడుంటాం అని ముందుకు వచ్చారు. ఫలితంగా యువ ఉత్తేజం, పెద్దల ఆశీస్సులతో ట్రస్ట్ కు పునాది పడింది. అప్పటి ఉప ప్రధానమంత్రి, నాకు పితృ సమానులు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారి చేతుల మీద స్వర్ణభారత్ ట్రస్ట్ అనే అంత్యోదయ కల... నా మానస పుత్రికగా... వాస్తవరూపం దాల్చింది.

స్వర్ణభారత్ ట్రస్ట్ ఆలోచన నాదే అయినా... నా ప్రతి ఆలోచనను శరవేగంగా ముందుకు తీసుకుపోయిన చొరవ మాత్రం దీపమ్మదే. మొదటి అడుగు నుంచి నేటివరకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం ఆశించకుండా, "అంత్యోదయ" సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నాం. ఈ మహోన్నత యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోందంటే దానికి కారణం... మమ్మల్ని విశ్వసించిన శ్రేయోభిలాషులు, మా ఆశయాల్లో భాగస్వామ్యమైన వివిధ సంస్థలు, నిస్వార్థంగా చేయూతనందిస్తున్న ఉదార దాతలు, ప్రతి అడుగులో వెన్నంటే నిలుస్తున్న ఆత్మీయులు. ప్రజారోగ్య, విద్యా వికాసం, మహిళల సాధికారత, శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధికల్పనలో సహకారం, మూగజీవాల సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ... ఇలా అనేక ఆశయాల సంగమంగా స్వర్ణభారత్ ట్రస్ట్ ముందుకు సాగుతోంది. రైతులు, మహిళలు, యువత అభివృద్ధి మీద స్వర్ణభారత్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒక్క పూట అన్నం పెట్టడం కాదు, రోజూ అన్నం సంపాదించుకునే స్వశక్తిని పెంపొందించుకునే నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ఇప్పటి వరకూ వేలాది మంది యువత స్వర్ణభారత్ లో నైపుణ్య శిక్షణ పొంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అదే విధంగా ఎంతో మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది, తమ కాళ్ళ మీద తాము నిలబడే సాధికారత సంపాదించారు. మరెందరో రైతులు స్వర్ణభారత్ ట్రస్ట్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధిని సాధిస్తున్నారు. ఈ చొరవతో పాటు మన పండుగలను ఘనంగా నిర్వహించడం వంటివి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం దిశగా స్వర్ణభారత్ ట్రస్ట్ తీసుకున్న చొరవలో మరో కీలకమైనది. ఈ చొరవ నెల్లూరు నుంచి విజయవాడ, హైదరాబాద్ లకు కూడా విస్తరించింది. ముచ్చటగా మూడు చాప్టర్ ల ద్వారా స్వర్ణభారత్ ట్రస్ట్ తన సేవలను దేశానికి అందిస్తోంది. మా గ్రామానికి సేవ చేస్తే చాలు అనుకున్న ఆలోచన నుంచి... దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన యువత వచ్చి నైపుణ్య శిక్షణ పొందే వరకూ సాగడం వెనుక స్వర్ణభారత్ చేస్తున్న ఈ సేవా యజ్ఞాన్ని తమ సొంత బాధ్యతగా భావించి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.

ఈ సందర్భంగా ఓ విషయాన్ని ప్రస్తావించాలి. 2016లో ఒకరోజు దీపమ్మ నాకు ఫోన్ చేసింది. స్వర్ణభారత్ ట్రస్ట్ తరుఫున ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం నిడుంపల్లికి మడితపు శివయ్య, బుజ్జమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. మద్యానికి బానిసైన శివయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. కొంత కాలానికి భార్య బుజ్జమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న దీపమ్మ... వారిని దత్తత తీసుకుని చదివించేందుకు సిద్ధమైంది. నేను సానుకూలంగానే స్పందించాను. ట్రస్ట్ అంటే సేవా కార్యక్రమాలే గానీ... ఇలాంటి బాధ్యతను ఎలా నిర్వహిస్తుందా అని గమనిస్తూ వచ్చాను. నా అంచనాలకు మించి, దీపమ్మ వారి ఆలనా పాలనా చూసుకుంది. వారిలో పెద్దమ్మాయి అయిన శిరీషకు 2023లో ఘనంగా పెళ్ళి కూడా జరిపించింది. ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. మిగిలిన ప్రసన్న, మల్లీశ్వరి, నందిని, లిజితలను చదివిస్తూ.. వారి బాగోగులు చూస్తోంది. వారికి వివాహాలు చేయడం కూడా తన బాధ్యతే అని ఆ రోజు ప్రకటించింది. అంతకంటే ముందు అదే విషయాన్ని నాకు కూడా చెప్పింది. ఈ సందర్భం తర్వాత దీపమ్మకు స్వర్ణభారత్ ట్రస్ట్ అప్పజెప్పడం సరైనదే అనే సంతృప్తి ఆరోజే నాకు కలిగింది. నా నమ్మకాన్ని నిలబెట్టిన దీపమ్మకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తారు. అందులో వారికి ఆనందం లభిస్తుంది. అయితే ఆస్తులు మాత్రమే కాదు మంచితనాన్ని, మానవత్వాన్ని, సమాజం పట్ల బాధ్యతను కూడా వారసత్వంగా అందించాలి. అప్పుడు మహదానంద లభిస్తుంది. ఈ ఆనందాన్ని స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్ళ ప్రస్థానం ద్వారా నేను పూర్తిగా ఆస్వాదించాను. మన అభివృద్ధికి బాసటగా నిలిచిన సమాజానికి, మనం పుట్టిన ఊరికి మేలు చేయాలనే తలంపుతో... నా మనసులో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఆలోచనను, చొరవ తీసుకుని నా కుమార్తె శ్రీమతి దీపా వెంకట్ నా మిత్రుల సహకారంతో సాకారం చేసింది. నా కుమారుడు హర్ష సైతం ముప్పవరపు ఫౌండేషన్ పేరుతో, స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం... నా కోడలు రాధమ్మ సైతం ముప్పవరపు ఫౌండేషన్ బాధ్యత తీసుకోవడం నా జీవితంలో నన్ను నిజంగా ఆనందింపజేసిన అంశం. నా మనుమడు, మనుమరాళ్ళు సైతం ఈ సేవా కార్యక్రమాలకు తమ చేతనైన సాయం అందించడం... నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. తమ వివాహాలను సైతం సేవా కార్యక్రమాలుగా మార్చుకున్న వారి చొరవ అందించిన సంతృప్తి అసాధారణమైనది.

ప్రతి ఊరిలోనూ ఒక విద్యాలయం, ఒక గ్రంథాలయం, ఒక వైద్యాలయం, ఒక దేవాలయం ఉండాలి. వీటితో పాటు ఒక సేవాలయం కచ్చితంగా ఉండాలన్నది నా ఆకాంక్ష. కనీసం ప్రతి జిల్లా కేంద్రంలోనైనా ఓ సేవా సంస్థ ఉండాలన్నది నా ఆకాంక్ష. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారు తమ తమ గ్రామాల్లో ఓ సేవాలయాన్ని ఏర్పాటు చేసేందుకు గానీ, ఇతరులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించేందుకు ముందుకు రావాలి. అప్పుడే మన సంపదకు సరైన సార్థకత చేకూరుతుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో భాగమైన షేర్ అండ్ కేర్, వసుధైవ కుటుంబ భావనలను జీవితానికి అన్వయించుకోవాలి. భర్తృహరి సుభాషితం తెలియజేసినట్లుగా...

శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన
దానేన పాణిర్న తు కంకణేన ।
విభాతి కాయః కరుణాపరాణాం
పరోపకారైర్న తు చందనేన ॥

"చెవులకు అందాన్నిచ్చేది బంగారు కుండలాలు కాదు... మంచి మాటలు, శాస్త్ర విషయాలు వినడం. చేతులకు నిజమైన అలంకారాలు కంకణాలు కాదు, దానం చేయడం. అదే విధంగా సజ్జనుల శరీరం ప్రకాశించేందుకు సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం వల్ల కాదు... పరోపకారం ద్వారా మాత్రమే" అని దీని అర్థం.

ఇలాంటి నా ఆలోచనను నా కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు, మనుమడు, మనుమరాళ్లు... ఆచరణలో పెట్టి నాకు పరిపూర్ణ ఆనందాన్ని అందించారు. ఈ సందర్భంగా నా మనసులో మాట ఒక్కటే. నేను రాజకీయ వారసత్వానికి వ్యతిరేకిని. కానీ నా సేవా వారసత్వం మాత్రం తరతరాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. నా తదనంతరం నా పేరిట ఉన్న ప్రతిదీ స్వర్ణభారత్ కే చెందేలా ఇటీవల నిర్ణయం తీసుకున్నాను. నా పిల్లలు రాజకీయాల్లోకి వస్తారా, లేదా అనే విషయం నాకు ఎలాంటి పట్టింపు లేదు. అయితే వారి సేవా మార్గానికి మాత్రం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను. నా మీద చూపించే ఆదరం, అభిమానం, గౌరవం స్వర్ణభారత్ పట్ల చూపించాలని స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్ళ సేవా వసంతాల సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ "వెండి వెన్నెల పండుగ" సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను.

జైహింద్...

"స్వర్ణభారత్" ట్రస్ట్ 25 ఏళ్ళ సేవా వసంతం కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారితో కలిసి పాల్గొన...
07/09/2026

"స్వర్ణభారత్" ట్రస్ట్ 25 ఏళ్ళ సేవా వసంతం కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారితో కలిసి పాల్గొనడం ఆనందదాయకం. పాతికేళ్ళ క్రితం నా కుమార్తె శ్రీమతి దీపావెంకట్ చొరవతో, మహాత్మగాంధీ "గ్రామ స్వరాజ్యం" స్ఫూర్తితో, శ్రీ నానాజీ దేశ్ ముఖ్ గారి చిత్రకూట్ సేవా సంస్థల ప్రేరణతో స్థాపించిన "స్వర్ణభారత్" రజతోత్సవ పడిలోకి ప్రవేశించిన సందర్భంగా లబ్ధిదారులకు, స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహణా బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నా మూడో బిడ్డ, నా మానస పుత్రిక స్వర్ణభారత్ ట్రస్ట్. నా ఇద్దరు పిల్లలను రాజకీయాల దిశగా నేను ప్రోత్సహించ లేదు. కానీ సేవ దిశగా ప్రోత్సహించాను. ఆ ప్రోత్సాహమే... స్వర్ణభారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ లుగా ఆవిష్కృతమయ్యాయి. నా మీద చూపించే ప్రేమ, ఆదరణ, గౌరవం... స్వర్ణభారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ ల మీద కూడా భవిష్యత్ లో చూపవలసిందిగా దేశ ప్రజలందరినీ ఈ చారిత్రక వేదిక నుంచి కోరుతున్నాను.

మా స్వగ్రామంలోని పేదలు, మహిళలు, యువత సాధికారతతో తలెత్తుకుని సగర్వంగా నిలబడాలన్న ఆకాంక్షతో ప్రారంభించిన స్వర్ణభారత్... ఈరోజు నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ చాప్టర్ల ద్వారా సేవలు అందించడం, దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన యువత ఇక్కడ నైపుణ్యశిక్షణను అందుకోవడం ఆనందదాయకం. ఈ "25 ఏళ్ళ సేవా వసంతం" ద్వారా స్వర్ణభారత్ ట్రస్ట్ సింహావలోకనం చేసుకుని, మరిన్న సమగ్రమైన కార్యక్రమాలతో మహాత్ముడు కలలుగన్న "వికసిత గ్రామ భారతం" నిర్మాణం దిశగా కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

భారతరత్న, దేశ తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివా...
05/09/2026

భారతరత్న, దేశ తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. జ్ఞానం, సంస్కృతి, తత్వశాస్త్ర రంగాల్లో భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి. ఉన్నత పదవులు అధిరోహించినా, జీవితాంతం తనను తాను ఒక ఉపాధ్యాయుడిగానే భావించిన నిరాడంబరుడు ఆయన. వారి జయంతి సందర్భంలో వికసిత భారత నిర్మాణం కోసం భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్న గురువర్యులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఉపాధ్యాయులు అక్షరాలు నేర్పే వారు మాత్రమే కాదు. రేపటి పౌరులను తీర్చిదిద్దే శిల్పులు, దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు అందించే శక్తులు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని సన్మార్గంలో నడిపించే గురువుల త్యాగం, కృషి వెలకట్టలేనివి. సమాజ ప్రగతికి ఉపాధ్యాయులే మూలస్తంభాలు. భావి తరాలకు జ్ఞానజ్యోతిని అందిస్తూ, దేశ నిర్మాణంలో నిస్వార్థంగా భాగస్వాములవుతున్న ప్రతి ఉపాధ్యాయుడికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. డాక్టర్ రాధాకృష్ణన్ గారి ఆదర్శాలను స్మరిస్తూ, విద్యా రంగ పరిపుష్టికి సమాజం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

భారతరత్న, దేశ తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివా...
05/09/2026

భారతరత్న, దేశ తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. జ్ఞానం, సంస్కృతి, తత్వశాస్త్ర రంగాల్లో భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి. ఉన్నత పదవులు అధిరోహించినా, జీవితాంతం తనను తాను ఒక ఉపాధ్యాయుడిగానే భావించిన నిరాడంబరుడు ఆయన. వారి జయంతి సందర్భంలో వికసిత భారత నిర్మాణం కోసం భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్న గురువర్యులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఉపాధ్యాయులు అక్షరాలు నేర్పే వారు మాత్రమే కాదు. రేపటి పౌరులను తీర్చిదిద్దే శిల్పులు, దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు అందించే శక్తులు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని సన్మార్గంలో నడిపించే గురువుల త్యాగం, కృషి వెలకట్టలేనివి. సమాజ ప్రగతికి ఉపాధ్యాయులే మూలస్తంభాలు. భావి తరాలకు జ్ఞానజ్యోతిని అందిస్తూ, దేశ నిర్మాణంలో నిస్వార్థంగా భాగస్వాములవుతున్న ప్రతి ఉపాధ్యాయుడికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. డాక్టర్ రాధాకృష్ణన్ గారి ఆదర్శాలను స్మరిస్తూ, విద్యా రంగ పరిపుష్టికి సమాజం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

Address

No1 Thayaraja Marg
New Delhi
110001

Telephone

01123016422

Website

Alerts

Be the first to know and let us send you an email when M. Venkaiah Naidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share