East Godavari District Police

East Godavari District Police Safety, Security of the People and Social Justice are our concern.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలితూర్పుగోదావరి జిల్లా ఎస్...
03/09/2026

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలి

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్..

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., గారు జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలు, విగ్రహాల ప్రతిష్ఠ, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

ప్రతి గ్రామం, మండలం, పట్టణ పరిధిలోని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను ముందస్తుగా పరిశీలించాలని జిల్లా ఎస్పీగారు ఆదేశించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, అగ్నిప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళలు మరియు భక్తుల రక్షణతో పాటు అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.

గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, నిమజ్జన మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో బందోబస్తు తదితర అంశాలపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

ఉత్సవాల నిర్వహణలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని ఎస్పీగారు ఆదేశించారు.

గణేష్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఆరుగురు ప్రత్యేక అధికారులను నియమించి, జిల్లా వ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. వీరు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తారని తెలిపారు.

సింగిల్ విండో విధానం ద్వారా తప్పనిసరిగా అనుమతులు పొందాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., గారు తెలిపారు. ఇందుకు ఎటువంటి చలానా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

దరఖాస్తు విధానం:

1. రిజిస్ట్రేషన్: ganeshutsav.net వెబ్‌సైట్‌లో New Application పై క్లిక్ చేయాలి.
2. OTP వెరిఫికేషన్: మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా వెరిఫై చేయాలి.
3. వివరాల నమోదు: నిర్వాహకులు, కమిటీ, మండపం, నిమజ్జనం, వాహనం తదితర వివరాలను నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలి.
4. పోలీసు పరిశీలన: స్థానిక పోలీసులు మండప ప్రదేశాన్ని పరిశీలించి నిబంధనల మేరకు అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తారు.
5. NOC & QR కోడ్: దరఖాస్తు ఆమోదం అనంతరం ganeshutsav.net/applicationStatus ద్వారా NOC, QR కోడ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చుని తెలిపారు.
6.సదరు QR కోడ్‌ను స్కాన్ చేసి, అందులో సంబంధిత గణేష్ మండపం యొక్క Latitude & Longitude వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు.

గణేష్ నిమజ్జనోత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు, ఉత్సవ కమిటీలు, వివిధ ప్రభుత్వ శాఖలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., గారు విజ్ఞప్తి

02/09/2026

తూర్పు గోదావరి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు - 48 మందికి కోర్టు ద్వారా శిక్షలు మరియు జరిమానాలు

తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్. వారి ఆదేశాల మేరకు, రాజమహేంద్రవరం ట్రాఫిక్ డి.ఎస్.పి. శ్రీ వై. శ్రీకాంత్ గారి సారధ్యంలో రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మొత్తం 48 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, వారిని రాజమహేంద్రవరం 1వ స్పెషల్ జ్యుడిషియల్ 2వక్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడంయైనది.

ఈ కేసులను విచారించిన గౌరవనీయ మేజిస్ట్రేట్ శ్రీమతి పి. ఈశ్వరి గారు మొత్తం 48 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు వివిధ శిక్షలు ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.

తీర్పు వివరాలు:

• జైలు శిక్ష పొందినవారు: మొత్తం 05 కేసులలో నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

o 1 కేసులో: 05 రోజుల జైలు శిక్ష

o 3 కేసులలో: 3 రోజుల చొప్పున జైలు శిక్ష

o 1 కేసులో: 01 రోజు జైలు శిక్ష

• జరిమానా విధించినవారు: మిగిలిన 43 మంది నిందితులకు ఒక్కొక్కరికి రూ. 10,000/- చొప్పున మొత్తం రూ. 4,30,000/- జరిమానాను కోర్టు విధించడం జరిగింది.

వాహనదారులు ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు (జైలు శిక్షలు మరియు భారీ జరిమానాలు) తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు మునుముందు కూడా మరింత కఠినంగా కొనసాగుతాయని తెలియజేయడమైనది.

రానున్న గోదావరి పుష్కరాలు–2027: పటిష్ట భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన• గోదావరి రైల్వే స్టేషన్ నుండి కోటిలింగల ఘ...
02/09/2026

రానున్న గోదావరి పుష్కరాలు–2027: పటిష్ట భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన

• గోదావరి రైల్వే స్టేషన్ నుండి కోటిలింగల ఘాట్ వరకు మార్గాల తనిఖీ
• ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్, భద్రతా చర్యలపై దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ & కలెక్టర్

రానున్న గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా రాజమహేంద్రవరానికి తరలివచ్చే భక్తులకు అత్యంత సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్. మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, ఐఏఎస్. గార్లు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.

గోదావరి రైల్వే స్టేషన్ నుంచి ప్రధాన పుష్కర ఘాట్ అయిన కోటిలింగల రేవు ఘాట్ కి భక్తులు చేరుకునే మార్గాలు మరియు నిత్యం రద్దీగా వుండే దేవిచౌక్ సెంటర్ పరిసర ప్రాంతాలను, ప్రధాన రహదారులు, ప్రత్యామ్నాయ మార్గాలు మరియు ఘాట్‌లకు అనుసంధానమయ్యే వీధులను అధికారులు సమగ్రంగా పరిశీలించారు.

పుష్కరాల సమయంలో లక్షలాదిగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల రాకపోకలు, సమర్థవంతమైన ట్రాఫిక్ మళ్లింపు (Traffic Diversion) ప్రణాళికలు, అత్యవసర వాహనాల (Ambulance/Emergency) రాకపోకలకు వీలుగా ప్రత్యేక రూట్లను సిద్ధం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ ఐ.ఎ.ఎస్ గారు,అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐ.పి.ఎస్. గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ కె. ఆదిత్య శర్మ గారు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ వై. శ్రీకాంత్ గారు, ఇతర పోలీస్ అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫారెస్ట్ అకాడమీ లో 2 రోజుల పాటు జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు రేంజ్ I.G. గారు శ్రీ...
02/09/2026

ఫారెస్ట్ అకాడమీ లో 2 రోజుల పాటు జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు రేంజ్ I.G. గారు శ్రీ G.V.G. అశోక్ కుమార్ IPS గారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ, రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో WWF-India సహకారంతో 30 మంది పోలీసు సిబ్బందికి నిర్వహించిన Law Enforcement Training of Trainers (ToT) Workshop ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు రేంజ్ I.G గారు మాట్లాడుతూ:
ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా ఈ క్రింది సవాళ్లును ఎదురుకుంటున్నారు
(1) ఎర్రచందనం దొంగలు & అక్రమ రవాణాలో దొరకకుండా వాహనాలు మార్చుతున్నారు, వారిని గుర్తించడం.
(2) భారతదేశ జాతీయ జంతువు అయిన పులులు జనావాసాలలోకి రాకుండా నియంత్రనించడం.
(3) గంజాయి అక్రమ రవాణాను నివారించడం.

Law & Order పోలీసులతో సాంకేతిక విధి విధానాలు పాటిస్తూ కేసులు ఎలా పరిష్కరిస్తున్నారో అదే విధంగా టెక్నాలజీ వినియోగంలో ఫారెస్ట్ అధికారులు కూడా పాటించి పై సవాళ్లును విజయవంతంగా ఎదుర్కోవాలి.

అనంతరం ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (TOT)కు I.G. గారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు డైరెక్టర్, ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ, శ్రీ బి. విజయ్ కుమార్, ఐ.ఎఫ్.ఎస్., జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ D. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్ గారు, అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ పటేల్ దేవాంశ్ మనీష్ IPS గారు పాల్గొన్నారు.

P4 విధానంలో దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు ₹24 లక్షల విలువైన రెండు బొలెరో వాహనాల అందజేతఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్...
02/09/2026

P4 విధానంలో దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు ₹24 లక్షల విలువైన రెండు బొలెరో వాహనాల అందజేత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 (Public-Private-People Partnership) విధానంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు మొత్తం ₹24 లక్షల విలువైన రెండు నూతన మహీంద్రా బొలెరో వాహనాలు విరాళంగా అందజేశారు.

గోపాలపురం శాసనసభ్యులు శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు ఒక వాహనాన్ని, దేవరపల్లికి చెందిన పరమేశు బయోటెక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆనంద స్వరూప్ గారు దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు మరో వాహనాన్ని విరాళంగా అందజేశారు.

రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దాతలు రెండు వాహనాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారికి అధికారికంగా అందజేశారు. అనంతరం దాతలతో కలసి పచ్చజెండా ఊపి ఈ నూతన వాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లకు నూతన వాహనాలు సమకూరడం ద్వారా అధికారులు, సిబ్బంది విధులను మరింత వేగవంతంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సత్వర స్పందన అందించడంతో పాటు, పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేసి ప్రజలకు మెరుగైన రక్షణ, సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

P4 భాగస్వామ్యంలో భాగంగా ముందుకు వచ్చి పోలీసు శాఖకు వాహనాలను విరాళంగా అందించిన దాతలను జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శాలువా కప్పి ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సమాజంలోని వివిధ వర్గాల నుంచి లభిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐ.పి.ఎస్. గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ కె. ఆదిత్య శర్మ గారు, డీఎస్పీ ఎస్‌బీ శ్రీ బి. రామకృష్ణ గారు, డీఎస్పీ కొవ్వూరు శ్రీ జి. దేవకుమార్ గారు, డీఎస్పీ ఏ.ఆర్. శ్రీ టి.వి.ఆర్.కె. కుమార్ గారు, దేవరపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. నాగేశ్వర నాయక్ గారు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

01/09/2026

లారీ బ్యాటరీల దొంగతనాల కేసులో నిందితులకు 18 నెలల కఠిన కారాగార శిక్ష

మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన లారీ బ్యాటరీల దొంగతనం కేసుల్లో ఇద్దరు నిందితులకు ఆలమూరు జేఎఫ్‌సీఎం న్యాయస్థానం 18 నెలల కఠిన కారాగార శిక్ష మరియు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఒక నెల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని ఆలమూరు గౌరవ మెజిస్ట్రేట్ శ్రీ ఐ. ప్రవీణ్ కుమార్ గారు తమ తీర్పులో పేర్కొన్నారు.

కేసు వివరాలు:

2025లో మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగి ఉన్న లారీల నుంచి బ్యాటరీలను దొంగిలించిన ఘటనలపై క్రైమ్ నంబర్లు 431/2025, 432/2025, 434/2025 కింద బిఎన్‌ఎస్ (BNS) సెక్షన్ 303(2) ప్రకారం కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు A1 దాసరి సూరిబాబు, A2 దేవరకొండ వీరబాబులను అరెస్టు చేసి, పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శ్రీ రామ్ తులసి గారు సమర్థవంతంగా వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేశారు.

ఈ కేసుల్లో సమర్థవంతంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన సహాయ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ (Asst. PP) కుమారి బి. రామ తులసి, మండపేట టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. సురేష్, ఎస్సై శ్రీ ఎం. రాము, కోర్టు కానిస్టేబుల్ శ్రీ ఎం. శ్రీధర్ మరియు సిబ్బందిని తూర్పు గోదావరి జిల్లా ఈస్ట్ డివిజన్ డిఎస్పి శ్రీమతి బి. విధ్య గారు, SP శ్రీ డి. నరసింహ కిశోర్ గారు అభినందించారు.

సత్ఫలితాలు అందిస్తున్న ‘యూత్ కనెక్ట్’ – జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృతంగా కార్యక్రమాలుయువతను సన్మార్గంలో నడిపించడమే లక్...
01/09/2026

సత్ఫలితాలు అందిస్తున్న ‘యూత్ కనెక్ట్’ – జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృతంగా కార్యక్రమాలు

యువతను సన్మార్గంలో నడిపించడమే లక్ష్యంగా ‘యూత్ కనెక్ట్ ప్రోగ్రామ్’

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘యూత్ కనెక్ట్ ప్రోగ్రామ్’ ద్వారా ఇప్పటికే మంచి ఫలితాలు వస్తుండటంతో, కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

యువతను సన్మార్గంలో నడిపించడం, వారిలో సామాజిక బాధ్యతను పెంపొందించడం, చెడు వ్యసనాలు మరియు నేరాలకు దూరంగా ఉంచడం, విద్య, ఉపాధి, కెరీర్ మరియు నైపుణ్యాభివృద్ధి వైపు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు యువతతో నేరుగా సమావేశమై మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలు మరియు బాలికల భద్రత తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. యువతకు ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని, వాటిపై తగిన సూచనలు అందిస్తూ వారి ప్రతిభను ఉన్నత లక్ష్యాల సాధనకు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ముందుకు సాగాలని, చెడు వ్యసనాలు మరియు నేరాలకు ఆకర్షితులు కాకుండా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పోలీసులు సూచిస్తున్నారు.

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం – ఆత్మీయ వీడ్కోలుతూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్...
31/08/2026

పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం – ఆత్మీయ వీడ్కోలు

తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్. గారు ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన 1. శ్రీ బీరం సాయి రామ్, సబ్ ఇన్‌స్పెక్టర్, 2. శ్రీ కె. వెంకటేశ్వరరావు, సబ్ ఇన్‌స్పెక్టర్, PCR, 3. శ్రీ మాడ సత్యనారాయణ, సబ్ ఇన్‌స్పెక్టర్, ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్, 4. శ్రీ నీలాతి రాంబాబు, హెడ్ కానిస్టేబుల్, ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్, 5. శ్రీ మంటిన శ్రీనివాస్ రాజు, ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ గార్లకి శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.

అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖకు వీరు అందించిన విలువైన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారి భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి ఉండాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

పదవీ విరమణ అనంతరం కూడా వారికి ఏవైనా వ్యక్తిగత లేదా శాఖాపరమైన సమస్యలు ఎదురైనా, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ గారు, నార్త్ జోన్ డిఎస్పి కుమారి సి.హెచ్. జీవన గారు, సౌత్ జోన్ డిఎస్పి శ్రీమతి శివ ప్రియ గారు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి శ్రీ బి.రామకృష్ణ గారు, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ శ్రీ పి.ఈ.పవన్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఐ వెల్ఫేర్ శ్రీ పి. సంజీవ్ కుమార్ గారు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక "పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”,...
31/08/2026

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక "పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”, (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారు ఈరోజు అనగా ది. 31.08.2026 వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు.

జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలని తెలుసుకుని, వెనువెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చినారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐ.పి.ఎస్. గారు పలు పిటిషన్లను పరిశీలించి, బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు.

నేటి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం” కార్యక్రమానికి 42 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు మరియు ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు కలవు.

విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబాల సంక్షేమంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక సమీక్షతూర్పుగ...
31/08/2026

విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబాల సంక్షేమంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక సమీక్ష

తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలు మరియు రిటైర్డ్ పోలీసు అధికారుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్. గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలు, రిటైర్డ్ పోలీసు అధికారులకు ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు అందిన ఆర్థిక ప్రయోజనాలు, పెన్షన్, ఇతర బెనిఫిట్స్ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఆయా కుటుంబాలకు ఇంకా అందాల్సిన ప్రయోజనాలు, పరిష్కరించాల్సిన పెండింగ్ అంశాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి పోలీసు సిబ్బంది కుటుంబాలకు అందాల్సిన ప్రతి ప్రయోజనం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా పదవి విరమణ చేసిన 5గురు హోంగార్డులకు ఎస్పీ గారి చేతుల మీదగా నగదు చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ గారు, నార్త్ జోన్ డిఎస్పి కుమారి సి.హెచ్. జీవన గారు, సౌత్ జోన్ డిఎస్పి శ్రీమతి శివ ప్రియ గారు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి శ్రీ బి.రామకృష్ణ గారు, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ శ్రీ పి.ఈ.పవన్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఐ వెల్ఫేర్ శ్రీ పి. సంజీవ్ కుమార్ గారు, ఏ.ఏ.ఓ శ్రీ కె. శ్రీనివాస్ గారు, పోలీస్ కార్యాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Address

Police Quarters, Lalacheruvu
Rajamahendravaram
533106

Telephone

100

Alerts

Be the first to know and let us send you an email when East Godavari District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to East Godavari District Police:

Shortcuts

Share