04/06/2026
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన - తేది: 04.06.2026,
• హత్నూర పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
• స్టేషన్ ఆవరణ, రికార్డులు, సిబ్బంది బ్యారెక్స్ పరిశీలన.
• ప్రతి రికార్డును ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి.
• సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
• పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలి – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: హత్నూర పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారెక్స్ పరిశుభ్రతను పరిశీలించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించగలమని, అందుకు సిబ్బంది ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక (ప్లాన్ ఆఫ్ యాక్షన్) ఉండాలని అన్నారు.
తరచూ వాహనాల తనిఖీలు, నాకాబందీ వంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని సూచించారు. పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, కేడీలు, అనుమానిత వ్యక్తుల వివరాలు ప్రతి సిబ్బందికి తెలుసుకొని ఉండాలని, పగలు-రాత్రి బీట్‌లలో క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఆన్‌లైన్ రికార్డుల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల నేరాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్‌హెచ్‌ఓ కు సూచించారు.
సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని, తమకు కేటాయించిన విధులను పూర్తి భాద్యతగా నిర్వర్తించాలని సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికగా విని సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పోలీసు శాఖలో శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యమని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో గానీ, వ్యక్తిగతంగా గానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని, సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ తనిఖీలో హత్నూర ఎస్‌హెచ్‌వో శ్రీధర్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.