05/09/2026
తాడేపల్లి...
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురు పరిరక్షణ దీక్ష.
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు. సాయంత్రం వరకు కొనసాగిన నిరసన.
డీఎస్సీ -2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకోవాలి. కేంద్రాన్ని ఒప్పించాలి.
టీచర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్.
డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ సీపీ పోరాడుతుంది.
ఎమ్మెల్సీల దీక్షకు సంఘీభావం తెలిపిన వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మేయర్లు, జడ్పీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు
ఎమ్మెల్సీలకు నల్ల కండువాలు వేసి దీక్షను ప్రారంభించిన వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.
దీక్షను ప్రారంభించిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, పి.సురేష్ బాబు, ఇసాక్ బాషా, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్ కుమార్, రామచంద్రారెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, రూహుల్లా, కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
డీఎస్సీ అక్రమాల పుట్టపై తక్షణమే సీబీఐ విచారణ వేయాలి. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకున్నట్లు.. రాష్ట్రంలో నారా లోకేష్ రాజీనామా చేయాలి:
వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డిమాండ్.
గురువుల నియామకాల్లోనూ దొంగలు పడ్డారు.. లోకేష్ తక్షణమే మంత్రి పదవి వీడాలి. సాక్ష్యాధారాలతో అవినీతి బయటపడ్డాక బుకాయింపులా? లోకేష్ రాజీనామా చేయాల్సిందే: మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
మెగా డీఎస్సీ పేరుతో నకిలీ గురువులను తెచ్చి భావితరాలకు వెన్నుపోటు పొడిచారు. కోట్ల రూపాయల అవినీతి ఆధారాలున్నా కూటమి ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు: కురసాల కన్నబాబు మండిపాటు
దేశ చరిత్రలోనే ఎన్నడూ చూడని రీతిలో డీఎస్సీలో అడుగడుగునా దోపిడీ.
అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరగాలి: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శాసనమండలి సభ్యులు చేపట్టిన ‘గురు పరిరక్షణ దీక్ష’ కూటమి ప్రభుత్వ అవినీతి విధానాలపై సమరశంఖం పూరించింది. డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదల నుంచి నియామకాల ముగింపు వరకు ప్రతి దశలోనూ వ్యవస్థీకృతంగా భారీ కుంభకోణం జరిగిందని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, అర్హత లేని వారికి పోస్టుల కేటాయింపు, అడ్డగోలు జీవోల జారీ తదితర ఆధారాలను మీడియా ముఖంగా బట్టబయలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏమాత్రం సిగ్గుపడకుండా బుకాయిస్తున్నారని వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రతిపక్ష సభ్యులు లేని శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో కాలక్షేపం చేసిన మంత్రి లోకేష్, వాస్తవాలు నిలదీసే విపక్ష బలం ఉన్న శాసనమండలిలో నాలుగు రోజుల పాటు చర్చకు రాకుండా తోకముడిచారని వైయస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. నీట్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించినట్లుగా, రాష్ట్రంలో జరిగిన ఈ మెగా కుంభకోణానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని, ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునిస్తూ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే..
వైవీ సుబ్బారెడ్డి, వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మాట్లాడుతూ..డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలు రోజుకొకటిగా బయటపడుతుంటే, అనర్హులే గురువులుగా నియమితులయ్యారని ప్రభుత్వం రహస్య విచారణలతోనే తేల్చేస్తోంది. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు నకిలీ సర్టిఫికెట్లు, తప్పుడు రిజర్వేషన్లతో నడిపిన మెగా డీఎస్సీ పూర్తిగా అక్రమాల పుట్టగా మారిపోయింది. నీట్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకున్నట్లుగానే, రాష్ట్రంలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. అనర్హులు పాఠశాలల్లో గురువులుగా చేరితే రేపటి భావి పౌరుల భవిష్యత్తు అంధకారమవుతుందని రాష్ట్ర ప్రజలంతా తీవ్రంగా ఆలోచించాలి. కష్టపడి మెరిట్ సాధించిన నిజమైన అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించకుండా పోరాడుతుంది.
మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..
విద్యాశాఖను లోకేష్ డబ్బులు దండుకునే కేంద్రంగా మార్చారు. జాతిని నిర్మించే పవిత్రమైన గురువుల నియామకంలో కూడా దొంగలు పడ్డారని ఈరోజు రోడ్డెక్కి ఉద్యమం చేయాల్సి రావడం సిగ్గుచేటు. రెండేళ్లుగా ఏ శాఖలో రానన్ని అవినీతి ఆరోపణలు విద్యాశాఖపై వెల్లువెత్తుతున్నా, మంత్రిగా ఉన్న లోకేష్ వివరణ ఇచ్చే ధైర్యం చేయడం లేదు. ఒక్క నకిలీ నియామకం నిరూపించినా తప్పుకుంటానన్న లోకేష్, ఇప్పుడు పదుల సంఖ్యలో నకిలీ బాపతు వ్యవహారాలు దొరికిపోయాక ఎందుకు రాజీనామా చేయడం లేదు? అక్రమాలను ప్రశ్నించే సామాజిక మాధ్యమాలను, మీడియా గొంతులను పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమంగా బ్లాక్ చేయిస్తున్నారు. అన్ని ఆధారాలతో సహా డీఎస్సీ మోసాలు నిరూపితమైన తర్వాత ప్రభుత్వం చెప్పే పిట్టకథలతో చర్చలు అనవసరం, లోకేష్ వెంటనే గద్దె దిగాలి.
కురసాల కన్నబాబు, మాజీ మంత్రి మాట్లాడుతూ..
కోట్లకు కక్కుర్తి పడి విద్యా వ్యవస్థను బలితీసుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు గురువులను పూజించాల్సింది పోయి, కూటమి ప్రభుత్వం తెచ్చిన నకిలీ గురువుల తీరును ఎండగట్టాల్సి వస్తోంది. కేవలం కోట్ల రూపాయల కమీషన్లకు కక్కుర్తి పడి విద్యాశాఖ మంత్రి చేసిన అక్రమాలు లక్షలాది మంది నిరుద్యోగుల భవితవ్యాన్ని బలిపీఠం ఎక్కించాయి. కూటమి సర్కార్ తీసుకున్న ఈ దారుణ నిర్ణయం ఆంధ్రరాష్ట్రంలో భావితరాల విద్యా ప్రమాణాలకే తీరని వెన్నుపోటుగా మారింది. బాధితులు ఆధారాలతో సహా ఆధారాలు బయటపెడుతున్నా కూటమి పాలకుల్లో కనీస స్పందన, సిగ్గు లేకపోవడం దారుణం. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు, అవినీతి మంత్రులు తప్పుకునే వరకు వైయస్ఆర్ సీపీ పోరాటం ఆగదు.
లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ. మాట్లాడుతూ..దేశంలోనే అత్యంత అవినీతిమయమైన పాలనను చూస్తున్నాం. 2025 ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి పోస్టింగులు ఇచ్చే వరకు ప్రతి అడుగునా అడ్డగోలు అవకతవకలకు పాల్పడ్డారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ ఇంతటి దుర్మార్గమైన, పనికిమాలిన ప్రభుత్వాన్ని, విద్యాశాఖ తీరును ప్రజలు చూడలేదు. ఓవైపు పేపర్లు లీక్ కావడం, మరోవైపు అర్హులైన మెరిట్ విద్యార్థులను అన్యాయంగా రోడ్డున పడేయడం ద్వారా యువత జీవితాలను నాశనం చేశారు. పార్టీ పరంగా గతంలో జగన్ గారి నాయకత్వంలో నిజమైన విద్యావేత్తలను గౌరవిస్తే, ఈ ప్రభుత్వం నియామకాలనే వ్యాపారంగా మార్చేసింది. డీఎస్సీలో జరిగిన కోట్ల రూపాయల దోపిడీపై నిష్పాక్షికమైన సీబీఐ ఎంక్వైరీ జరిగితేనే పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు సరైన న్యాయం జరుగుతుంది.
కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ మాట్లాడుతూ..
కూటమి సర్కారు మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చేసింది. ఉపాధ్యాయుల సమస్యలను ఏమాత్రం పరిష్కరించకుండా, ఇన్-సర్వీస్ టీచర్లపై టెట్ భారం మోపి వేడుకలు చేయడం హాస్యాస్పదం. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ మొదటి ఏడాదే రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా మారింది. మెరిట్ సాధించిన నవీన్ లాంటి పేద అభ్యర్థులను పక్కనబెట్టి, బ్యాక్‌డోర్ విధానంలో పోస్టులను భారీ రేట్లకు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట ఏకంగా 80 శాతానికి పైగా నకిలీ సర్టిఫికెట్లతో అర్హత లేని వారికి అక్రమంగా పోస్టింగులు కట్టబెట్టారు. రిజర్వేషన్లు మార్చేసి నిరుద్యోగుల కడుపు కొట్టిన ఈ డీఎస్సీ బాగోతంపై వెంటనే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి.
ఇసాక్ బాషా, ఎమ్మెల్సీ. మాట్లాడుతూ..
అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు. టెట్, డీఎస్సీ పాస్ కాని అభ్యర్థులకు అడ్డగోలుగా పోస్టులు కట్టబెట్టి తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్యత్తును ఏం చేయాలనుకుంటున్నారు? . తమవారి కోసం జీవో నెంబర్ 4, 47లను తెచ్చి, తప్పు బయటపడగానే 27 రోజుల్లోనే జీవో 36తో రద్దు చేయడం దొంగతనానికి నిదర్శనం కాదా?. ఒక్కో ఉపాధ్యాయ పోస్టుకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బేరసారాలు నడిపిన ఆడియో టేపులపై ప్రభుత్వం ఎందుకు నోరు విప్పదు? శాసనమండలిలో మేం ముఖాముఖిగా నిలదీస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేక పారిపోయిన విద్యాశాఖ మంత్రికి పదవిలో ఉండే అర్హత లేదు. కూటమి ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా ఉంటే వెంటనే సీబీఐ విచారణ వేయాలి, లేకపోతే లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి.
రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మాట్లాడుతూ..
16 వేల డీఎస్సీ పోస్టులకు 16 వేల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. శాసనమండలిలో వైయస్ఆర్ సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, బండారం బయటపడుతుందని భయపడే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు చర్చ నుంచి తప్పించుకుంది. గతంలో జగన్ మోహన్ రెడ్డి 1.26 లక్షల సచివాలయ పోస్టులను ఒక్క ఆరోపణ లేకుండా భర్తీ చేస్తే, వీరు 16 వేల పోస్టులకే 16 వేల ఆరోపణలు తెచ్చుకున్నారు. తమ హక్కుల కోసం ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తి చేసిన ఐదుగురు నిజాయితీపరులైన ఇన్-సర్వీస్ టీచర్లను అన్యాయంగా సస్పెండ్ చేయడం దుర్మార్గం. పీఆర్సీ, ఐఆర్, డీఏల పేరుతో ఉపాధ్యాయులను దారుణంగా మోసం చేసిన కూటమి సర్కారు తక్షణమే ఆర్థిక బకాయిలన్నీ విడుదల చేయాలి. నిరుద్యోగుల గొంతు నొక్కిన ఈ మెగా మోసంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ పర్యవేక్షణలో మాత్రమే నిజాలు నిగ్గుతేలుతాయి.
పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ..
లోకేష్ మంత్రి పదవిలో ఉంటే సాక్ష్యాలు తారుమారవుతాయి. వైయస్ జగన్ గారి పాలనలో కేరళ రాష్ట్రంతో పోటీపడేలా విద్యా సంస్కరణలు తెస్తే, కూటమి ప్రభుత్వం రాగానే ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. గురుపూజోత్సవం నాడు పాఠశాలల్లో పండుగ వాతావరణం ఉండాల్సింది పోయి, హక్కుల కోసం ప్రజాప్రతినిధులే దీక్షలు చేయాల్సి రావడం సిగ్గుచేటు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పదవిలో కొనసాగితే నిష్పక్షపాత విచారణ జరగదు, ఆధారాలు తారుమారయ్యే ప్రమాదముంది. పారదర్శకమైన విచారణకు సహకరించడానికి లోకేష్ వెంటనే తన మంత్రి పదవి నుంచి వైదొలగాలి. కష్టపడి రాత్రింబవళ్లు చదివి నష్టపోయిన నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ సీపీ న్యాయపోరాటం ఆపదు.
సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ మాట్లాడుతూ..
పరీక్షలు రాయని వారికి కూడా స్పోర్ట్స్ కోటా పోస్టులు కట్టబెట్టారు. గతంలో జగన్ గారి నాయకత్వంలో లక్షలాది ఉద్యోగాలతో పాటు వైద్య విభాగంలోనే 40 వేల పోస్టులను జీరో వేకెన్సీతో అత్యంత పారదర్శకంగా నింపాం. ఈ ప్రభుత్వంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికే ఉద్యోగం ఇవ్వకుండా ఎస్సీఈఆర్టీ కాంట్రాక్ట్ సిబ్బందితో పేపర్లు లీక్ చేయించారు. నేషనల్ లెవల్ క్రీడాకారులను పక్కనపెట్టి, కనీసం పరీక్ష కూడా రాయని వారికి దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టారు. తప్పుడు నియామకాల వల్ల తీవ్ర అన్యాయానికి గురైన 3.30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల పక్షాన మేం పోరాడుతున్నాం. మంత్రి తన అవినీతి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో బహిరంగ విచారణ జరిపించాలి.
అంబటి మురళి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త మాట్లాడుతూ..
జాతిని తీర్చిదిద్దే గురువుల కొలువులను వ్యాపారంగా మార్చారు. గ్రామీణ గురువుల వద్ద చదువుకునే గొప్ప నాయకులు తయారవుతారనే భావనతో గతంలో జగన్ గారు 'నాడు-నేడు'తో బడుల రూపురేఖలు మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆఖరికి పవిత్రమైన ఉపాధ్యాయ ఉద్యోగాలను కూడా అంగట్లో సరుకులా అమ్మేసుకుంటోంది. రాష్ట్రంలో మహిళలకు, ఆలయాలకు రక్షణ లేకుండా పోయినట్లే విద్యా వ్యవస్థ కూడా మాఫియా చేతుల్లో చిక్కుకుంది. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిగే వరకు పార్టీ శ్రేణులు శాసనమండలి వేదికగా గళం విప్పాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పారదర్శక వ్యవస్థలు నిలబడాలంటే మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వమే శరణ్యం.
మాధవి, పల్నాడు జిల్లా న్యాయవిభాగం అధ్యక్షురాలు మాట్లాడుతూ..
బాధిత అభ్యర్థుల తరఫున కోర్టుల్లో సంపూర్ణ న్యాయపోరాటం చేస్తాం. శాసనమండలి సభ్యులు చేపట్టిన ఈ దీక్ష కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీ వల్ల అన్యాయానికి గురైన వేలాది మంది బాధితులకు కొండంత అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వంలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తే, ఈ ప్రభుత్వం నియామకాల్లో దారుణమైన అక్రమాలకు పాల్పడింది. మెరిట్ నిబంధనలను కాలరాసి తమ వర్గానికి చెందిన వారికి ఉద్యోగాలు పంచుకున్న వైనంపై సీబీఐ సమగ్ర దర్యాప్తు చేయాలి. ఉద్యోగాలు కోల్పోయిన అర్హులైన నిరుద్యోగుల పక్షాన వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ కోర్టుల్లో నిలబడి న్యాయపోరాటం చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను, ప్రభుత్వ పెద్దలను చట్టం ముందు దోషులుగా నిలబెట్టే వరకు పోరాడతాం.
భగవాన్, గుంటూరు జిల్లా లీగల్ విభాగం అధ్యక్షులు మాట్లాడుతూ..
ప్రభుత్వం నిజాయితీపరులైతే విచారణకు ఎందుకు జంకుతున్నారు?గురుపూజోత్సవం రోజే మెగా డీఎస్సీని మెగా స్కామ్ గా మార్చిన కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా లీగల్ సెల్ పూర్తి మద్దతు ఇస్తోంది. నియామక ప్రక్రియలో అంతులేని లోపాలు వెలుగుచూసిన నేపథ్యంలో సీబీఐ విచారణ మాత్రమే సరైన పరిష్కారం. ప్రభుత్వ నిర్వహణ నిజంగా పారదర్శకంగా ఉంటే కేంద్ర సంస్థల విచారణను ఎదుర్కోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు?. నిజాయితీ ఉంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి కేంద్ర దర్యాప్తునకు సిఫార్సు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. బాధిత యువతకు న్యాయం జరిగే వరకు శాసనమండలి సభ్యులతో కలిసి న్యాయవాదులమంతా ముందుంటాం.
చైతన్య, వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ..
దమ్ముంటే దీక్షా వేదిక వద్దకే లోకేష్ చర్చకు రావాలి. అధికారంలోకి వస్తే మొదటి సంతకమంటూ మోసగించి, ఏడాది తర్వాత విడుదల చేసిన నోటిఫికేషన్‌లో అడుగడుగునా దోచుకున్నారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నవీన్ అనే యువకుడికి ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకు తొక్కిపెట్టారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. తమ వారికి పోస్టులు కట్టబెట్టడం కోసమే జీవో 56ను మార్చి, ఆ తర్వాత రద్దు చేసి పచ్చి మోసాలకు పాల్పడ్డారు. సవాళ్లు విసిరే లోకేష్‌కు దమ్ముంటే కూతవేటు దూరంలో ఉన్న ఎమ్మెల్సీల దీక్షా శిబిరానికి వచ్చి బహిరంగ చర్చకు సిద్ధపడాలి. పేపర్ లీకేజీలపై కేంద్ర మంత్రి నైతిక బాధ్యతతో తప్పుకున్నట్లే, డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి.
రవి, వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాట్లాడుతూ..
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత హేయమైన కుంభకోణం డీఎస్సీ-2025. లక్షలాది రూపాయలు చేతులు మార్చి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో పెట్టారు. ఈడబ్ల్యూఎస్ నిబంధనల ప్రకారం ఏడాది ముందే సర్టిఫికెట్ ఉండాలనే నిబంధనను తుంగలో తొక్కి నియామకాలు ముగిశాక తెచ్చిన ఫేక్ సర్టిఫికెట్లకు ఆమోదం తెలిపారు. 382 స్పోర్ట్స్ కోటా పోస్టుల్లో టెట్, కనీస డీఎస్సీ పరీక్ష రాయని వారికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చి జాబ్స్ ఎలా ఇచ్చారో చెప్పాలి. ఎస్సీఈఆర్టీ సభ్యుడు హరిగోపాల్, ఒంగోలుకు చెందిన వంశీ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాల తయారీ నుంచే తీవ్ర కుంభకోణం నడిచింది. నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చలేరు, దీనిపై సీబీఐ విచారణ వేయడంతో పాటు లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.
డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణరాజు, ఎమ్మెల్సీ మాట్లాడుతూ..
శాసనమండలిలో నిలదీస్తే లోకేష్ ముఖం చాటేశారు. గురువులను సత్కరించుకోవాల్సిన పర్వదినాన విద్యాశాఖ మంత్రి అక్రమాలకు నిరసనగా ఎమ్మెల్సీలమంతా దీక్షలు చేయాల్సి రావడం సిగ్గుచేటు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన లోకేష్, కౌన్సిల్‌లో మేం ఐదు రోజుల పాటు నిలదీస్తే సమాధానం చెప్పలేక పారిపోయారు. సభ్యుల ప్రశ్నల నుంచి పారిపోవడాన్ని చూస్తేనే ప్రభుత్వం ఎన్ని తప్పుడు పనులకు ఒడిగట్టిందో ప్రజలకు అర్థమైపోయింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ మంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత లేదు. ఉద్యోగాల కుంభకోణంపై కేంద్ర ఏజెన్సీలతో సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
దేవినేని అవినాష్, వైయస్ఆర్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ..
నిరుద్యోగ యువతకు సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల బతుకులతో ఆడుకుంటూ మెరిట్ సాధించిన అర్హులను రోడ్డున పడేశారు. నిత్యం చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసిరే మంత్రి లోకేష్, రోజూ బయటపడుతున్న ఆధారాలపై ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? ఢిల్లీలో కేంద్ర మంత్రి చూపిన కనీస నైతికతను చూసైనా లోకేష్ సిగ్గుతో తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. ఈ మెగా డీఎస్సీ కుంభకోణంలో జరిగిన దగాపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకు క్షమాపణ చెప్పాలి. వైయస్ జగన్ గారి నాయకత్వంలో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు ఎంతటి పెద్ద పోరాటానికైనా పార్టీ సిద్ధంగా ఉంది.
టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మాట్లాడుతూ..
పేద, దళిత, బలహీన వర్గాల పిల్లలకు తీరని ద్రోహం చేశారు. డీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీలు చేస్తున్న దీక్షకు స్వచ్ఛందంగా నిరుద్యోగులు, తల్లిదండ్రులు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. భర్తీ చేసిన పోస్టుల్లో తీవ్రమైన అక్రమాలకు పాల్పడి పేద, ఎస్సీ, బలహీన వర్గాల బిడ్డల భవిష్యత్తును పూర్తిగా నాశనం చేశారు. న్యాయబద్ధంగా ఉద్యోగాలు సాధించిన వారిపై కాకుండా, దొడ్డిదారిన పోస్టులు తెచ్చుకున్న అక్రమార్కులపైనే మా పోరాటం. నిరుద్యోగుల గొంతుకై నిలబడిన వైయస్ జగన్ గారికి, ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణుల తరఫున పాదాభివందనాలు. ప్రజల ఆగ్రహాన్ని చూసి భయపడి టీడీపీ నాయకులు నల్లటి అద్దాల కార్లలో దాక్కుని తిరిగే పరిస్థితి వచ్చింది.
రుహుల్లా, ఎమ్మెల్సీ మాట్లాడుతూ..
డీఎస్సీ కమిషనర్‌ను కార్యాలయంలో దాచిపెట్టిన పిరికి ప్రభుత్వం ఇది. ఉపాధ్యాయుల దినోత్సవం రోజున కూడా ప్రజలను, నిరుద్యోగులను మోసం చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అక్రమాలపై మేం నిలదీయడానికి వెళ్తే నిజాలు బయటపడతాయనే భయంతో డీఎస్సీ కమిషనర్‌ను లోపల దాచిపెట్టారు. శాసనసభలో మైకులు పట్టుకుని నీతులు చెప్పే సకల శాఖల మంత్రికి కౌన్సిల్‌కు వచ్చి సమాధానం చెప్పే దమ్ము లేకపోయింది. సొంత శాఖను వదిలేసి అన్ని శాఖల మీద పెత్తనం చేసే లోకేష్‌కు నిజాయితీ ఉంటే ముఖాముఖి చర్చకు రావాలి. డీఎస్సీ స్కామ్‌పై ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రజల సమక్షంలో నిగ్గుతేల్చేందుకు వైయస్ఆర్ సీపీ పూర్తి సిద్ధంగా ఉంది.
కె. శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ..
లక్షలాది మంది ఆశల డీఎస్సీని అంగట్లో సరుకులా అమ్మేశారు. గురువుల గౌరవాన్ని కాపాడాల్సిన రోజున వారి రక్షణ కోసం దీక్షలు చేయాల్సి రావడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ. డీఎస్సీ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అది పేద నిరుద్యోగ కుటుంబాల ఆశ మరియు జీవిత శ్వాస. అలాంటి పవిత్రమైన ఉపాధ్యాయ ఉద్యోగాలను కోట్ల రూపాయల కమీషన్ల కోసం లోకేష్ బజారులో అమ్మేసుకున్నారు. గతంలో జగన్ గారు 1.35 లక్షల పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తే, వీరు 16 వేల ఉద్యోగాల్లోనూ దారుణంగా దోచేశారు . ఈ మహా కుంభకోణంపై సీబీఐ విచారణ వేసి, విద్యాశాఖ మంత్రి తన పదవిని వీడేవరకు ఈ ప్రజాపోరాటం ఆగదు.
వి. బాలవజ్ర బాబు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వ డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి
ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురు పరిరక్షణ కోసం వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలంతా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒకరోజు దీక్ష చేపట్టారు. జగన్ గారి హయాంలో 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు, 2.50 లక్షల వాలంటీర్ వ్యవస్థతో పాటు ఆర్టీసీ, హెల్త్ విభాగాల్లో కలిపి సుమారు 6 లక్షల ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా ఇచ్చాం. 16 వేల డీఎస్సీ ఉద్యోగాల భర్తీలో నిబంధనలకు విరుద్ధంగా జీవోలు తీసుకురావడం, రద్దు చేయడం, స్పోర్ట్స్ పోర్టల్స్ ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఎస్సీ అంశంపై కౌన్సిల్‌లో చర్చకు మేం సిద్ధమని సవాల్ విసిరినా ప్రభుత్వం సమాధానం చెప్పలేక పారిపోతోంది. జగన్ గారు విసిరిన సీబీఐ విచారణ సవాల్‌ను స్వీకరించే ధైర్యం లోకేష్‌కు ఉందా?
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి, డీఎస్సీ వ్యవహారంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి న్యాయ విచారణకు సిద్ధపడాలి.
జోగి రమేష్, మాజీ మంత్రి మాట్లాడుతూ..
అర్హులైన నిరుద్యోగులకు కాకుండా పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అసలైన గురువులకు అన్యాయం చేసి, తమ పార్టీ కార్యకర్తలను, తాబేదారులను దొడ్డిదారిన నియమించడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్ సీపీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తోంది. వైయస్ జగన్ గారి హయాంలో ఒకేసారి 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా భర్తీ చేశాం. 16 వేల డీఎస్సీ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పేరిట అర్హులకు అన్యాయం చేసి పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టిన ఆరోపణలపై లోకేష్ సమాధానం చెప్పాలి. కేంద్రంలో పేపర్ లీక్ ఆరోపణలు వస్తే కేంద్ర మంత్రిని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, రాష్ట్రంలో డీఎస్సీ అవకతవకల ఆరోపణలు వస్తుంటే లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? లోకేష్‌కు నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలి. మళ్లీ వైయస్ జగన్ గారి ప్రభుత్వం వచ్చాక మోసపోయిన ప్రతి డీఎస్సీ అభ్యర్థికి న్యాయం చేస్తాం.
చంద్రశేఖర్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ..
డీఎస్సీ ఉద్యోగాలను సొంత ఎస్టేట్‌లా అమ్ముకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులను గౌరవించుకోవాల్సిన రోజే నిరుద్యోగ యువత పక్షాన నిరసన దీక్ష చేయాల్సి రావడం రాష్ట్రానికి అత్యంత దురదృష్టకరం. యువగళం పాదయాత్రలో లోకేష్ వెంట తిరిగిన వారికి నిబంధనలు, మెరిట్, రాతపరీక్షలతో సంబంధం లేకుండా ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం అనేది నారా వారి సొంత ఎస్టేట్ కాదు. ప్రజల ఆస్తి లాంటి ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఇష్టారాజ్యంగా జీవోలు తీసుకురావడం, రద్దు చేయడం సరికాదు. విశాఖలో విలేకరులు ప్రశ్నిస్తే పొగరుగా మాట్లాడటం కాదు. దమ్ము ఉంటే రాష్ట్ర నిరుద్యోగుల ముందుకొచ్చి డీఎస్సీ నియామకాలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణను ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలి.
మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ..
టెట్ అర్హత లేని స్పోర్ట్స్ కోటా నియామకాలను రద్దు చేయాలి. ఎంతో కష్టపడి డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్‌తో సంబంధం లేకుండా, టీడీపీ సర్టిఫికెట్ ఉండి లోకేష్‌తో యువగళంలో నడిచిన వారికే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యా ప్రమాణాలు, టెట్ అర్హత లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన నారా లోకేష్‌కు ఎలా వచ్చింది? దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 16 వేల డీఎస్సీ ఉద్యోగాల్లో టెట్ అర్హత లేకుండా, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఉన్న నియామకాలను ప్రభుత్వం వెంటనే పరిశీలించాలి. అక్రమ నియామకాలు జరిగినట్లు తేలితే వాటిని వెంటనే రద్దు చేసి, అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఈ పోరాటాన్ని రాష్ట్ర కౌన్సిల్‌తో ఆపబోం. నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లి కేంద్ర పెద్దలు, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం.