11/08/2026
చెస్ విజేతలకు ఘనంగా బహుమతులు
విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తిని పెంచే సాధనం చెస్: ఎం. లక్ష్మీకుమారి
తుని: 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్ ఎడ్యుకేటెడ్ ఫోరం – తుని ఆధ్వర్యంలో జూలై 31న తుని శాంతినగర్‌లోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన పాఠశాల స్థాయి చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మంగళవారం స్థానిక రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. లక్ష్మీకుమారి విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెస్ విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, మేధోపరమైన పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.
ఫోరం కన్వీనర్ టి. శేషగిరి మాస్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, మేధోపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇటువంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని విద్యా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు, కాకినాడ పోర్ట్ రిటైర్డ్ అధికారి జి. గాంధీ, జి. రాము తదితరులు పాల్గొన్నారు.
G. Ram Perumallu