23/02/2026
ఉన్నత విలువలకు ఎర్రన్నాయుడు ప్రతిరూపం : దేవినేని ఉమా
విజయవాడ రూరల్ (గొల్లపూడి): 23 ఫిబ్రవరి 2026
సుదీర్ఘ కాలం శ్రీకాకుళం ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టి.. కేంద్ర మంత్రిగా వ్యవహరించి మూడు దశాబ్దాల పాటు గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణించిన మహోన్నత వ్యక్తి కింజారపు ఎర్రన్నాయుడు గారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. సోమవారం గొల్లపూడి కార్యాలయంలో ఎర్రన్న జయంతిని పురస్కరించుకొని స్థానిక నేతలతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందుతూ, ప్రభుత్వ చీఫ్‌వీప్‌గా, నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రైల్వే, అగ్రికల్చర్ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా, పార్లమెంట్ హౌస్‌లో ఫుడ్ కమిటీ ప్రతినిధిగా పదవులు చేపట్టారని కొనియాడారు. అటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, పొలిట్‌బ్యూరో సభ్యుడితో పాటు పార్టీ పార్ల మెంటరీ నేతగా అరుదైన గౌరవం దక్కించుకున్నారన్నారు. ప్రజలతో మమేకం కావడంతో ముందంజలో ఉండేవారని, చివరిగా గొల్లపూడిలో పాదయాత్ర ప్రారంభంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ఆ మరుసటిరోజున రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడాన్ని జీర్ణించుకోలేకపోయామన్నారు. కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా, సోదరులు అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా, వాసు రాజమండ్రి శాసనసభ్యులుగా ప్రజాసేలందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎర్రన్న స్ఫూర్తిదాయకమన్నారు.