08/01/2025
విజయనగరం, జనవరి 03 ః రాష్ట్రంలో రహదారులు, త్రాగునీరు, విద్యుత్ మొదలగు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఈ ఆరునెలల పాలనలో అద్భుత ఫలితాలను సాధించామని చెప్పారు. అభివృద్దితోపాటు సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. స్థానిక సోనియానగర్‌లో సుమారు రూ.5.19 కోట్ల ఖర్చుతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం మంత్రి కొండపల్లి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, అభివృద్దికి విద్యుత్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో సుమారు 7000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ముఖ్యమంత్రి చంద్రాబాబు ఒప్పందం చేసుకుంటే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దుచేసి, రాష్ట్రాన్ని విద్యుత్ లోటులోకి నెట్టిందని చెప్పారు. దీనివల్లే గత రెండేళ్లూ విపరీతంగా విద్యుత్ కోతలు పెరిగిపోయాయన్నారు. ఆర్ఈసి నుంచి రుణం తీసుకొని విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం ఉన్నా, అప్పటి ప్రభుత్వం దృష్టిపెట్టకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకాలవల్ల వినియోగదారులపై భారాలు పడ్డాయని, విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయని అన్నారు. పరిశ్రమలపైనా విద్యుత్ భారం విపరీతంగా పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. ఈ ఆరునెలల్లోనే కొత్తగా ఎంఓయు చేసుకోవడమే కాకుండా గ్రీన్ పవర్, సోలార్ పవర్‌పై దృష్టి సారించినట్లు తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. కేవలం విద్యుత్ రంగంలోనే కాకుండా రహదారులు నిర్మిస్తున్నామని, త్రాగునీటి సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. పోలవరం శరవేగంగా నిర్మాణం జరుగుతోందని, సుమారు రూ.80వేల కోట్ల ఖర్చుతో పెన్నా నీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.
విజయనగరం ఎంఎల్ఏ పూసపాటి అదితీ విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, సోనియానగర్‌లో నిర్మించిన ఈ సబ్‌స్టేషన్ వల్ల టిడ్కో కాలనీతోపాటు, వైఎస్ఆర్‌నగర్, గాజులరేగ తదితర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. గత టిడిపి ప్రభుత్వ హాయంలో వేణుగోపాలపురం వద్ద 220 కెవి సబ్‌స్టేషన్ మంజూరయ్యిందని, ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రక్కన పడేసిందని చెప్పారు. సుమారు రూ.200 కోట్లు ఖర్చు అయ్యే ఈ సబ్‌స్టేషన్‌కు ఇటీవలే తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇది పూర్తయితే విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, భోగాపురం విమానాశ్రయానికి బ్యాకప్‌గా పనిచేయడమే కాకుండా జిల్లాలో పారిశ్రామికాభివృద్దికి ప్రయోజం చేకూరుతుందని చెప్పారు.
రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి, ఎపిఈపిడిసిఎల్ సూపరింటిండెంట్ ఇంజనీర్ ఎం.లక్ష్మణరావు మాట్లాడారు. కార్యక్రమంలో ఈఈలు పి.త్రినాధరావు, పి.హరి, ఎడిఈలు, డిఈలు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.