DPRO Wanaparthy

DPRO Wanaparthy INFORMATION & PUBLIC RELATIONS DEPARTMENT

తేదీ: 29-07-2026            వనపర్తి జిల్లా             *ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన నిర్మాణాలను త్వ...
29/07/2026

తేదీ: 29-07-2026
వనపర్తి జిల్లా

*ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్)లో పీఎం శ్రీ పథకం కింద నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల, సైన్స్ ల్యాబ్ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రతి దశలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. పనులు పూర్తయ్యే వరకు ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ నాణ్యతతో కూడిన నిర్మాణాలను అందించాలని ఆదేశించారు.

నిర్మాణాలకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేసి సైన్స్ ల్యాబ్, అదనపు తరగతి గదులను త్వరలోనే విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.

జెడ్పి సీఈవో యాదయ్య, ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

తేదీ: 29-07-2026                          వనపర్తి జిల్లా            ఎస్‌ఐఆర్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేసేందుకు బీఎల్ఏలు...
29/07/2026

తేదీ: 29-07-2026
వనపర్తి జిల్లా

ఎస్‌ఐఆర్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేసేందుకు బీఎల్ఏలు సహకరించేలా రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలనీ అదనపు కలెక్టర్ రెవెన్యూ టి. వినోద్ కుమార్ సూచించారు.

బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ ఐ ఆర్ పురోగతిపై జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ డిజిటైజేషన్ 85% పూర్తయిందని తెలిపారు. వనపర్తి పట్టణంలో మాత్రం కేవలం 68 శాతం పూర్తి అయ్యిందని మిగిలిన వా కొంత నెమ్మదిగా కొనసాగుతోందని, ఇంకా మిగిలిపోయిన వారు ఎవరూ, ఎక్కడున్నారో గుర్తించి ఎన్యూమరేషన్ ఫారం అందజేసే విధంగా చొరవ చూపాలని కోరారు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు స్థానికంగా పని చేస్తున్న బూత్ లెవల్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని తెలిపారు. బిఎల్ఓలతో సహకరిస్తూ ఓటర్లందరూ తమ ఎన్యుమరేషన్ ఫారంలను సమర్పించే విధంగా బి ఎల్ ఏ లు చొరవ తీసుకోవాలన్నారు. ఆగస్టు 3తో ఫారాలు తీసుకునే ప్రక్రియ ముగుస్తుందని, అప్పటి వరకు ఫారాలు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ఫోటోలు జాబితాలో ఉంటాయని తెలిపారు. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించడం జరుగుతుందని, జాబితాపై అభంతరాలు ఉంటే అదే తేదీ నుండి సెప్టెంబర్ 9 వరకు ఫిర్యాదులు పెట్టుకోవచ్చని చెప్పారు. అన్ని ఫిర్యాదులు పరిష్కరించి అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు.
అక్టోబర్, 1, 2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న యువత ఫారం 6 ద్వారా ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు ఇప్పటి వరకు 4 దరఖాస్తులు వచ్చాయని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే సూచనలు చేయాలని అదనపు కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.

ఈ సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు కాంగ్రెస్ నుండి తిరుపతయ్య, వెనాచారి, బి.ఆర్.ఎస్ నుండి గట్టు యాదవ్, బి.జి.పి. కుమార స్వామి, సి.పి.ఐ.(యం) పుట్ట ఆంజనేయులు, లోక్ సత్తా గంధం నాగరాజు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తేదీ: 29-07-2026            వనపర్తి జిల్లా             *భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ ...
29/07/2026

తేదీ: 29-07-2026
వనపర్తి జిల్లా

*భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ (రెవెన్యూ) టి. వినోద్ కుమార్*

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ భూ రీ-సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) టి. వినోద్ కుమార్ ఆదేశించారు.

బుధవారం ఏదుల మండలంలోని రేకులపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్‌గా కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే బృందాలు నిర్వహిస్తున్న డిజిటల్ మ్యాపింగ్, భూ సరిహద్దుల గుర్తింపు, నమోదు ప్రక్రియలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నిర్దేశిత గడువులోగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్వేయర్లు ప్రతిరోజూ ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి సర్వే పనిని నాణ్యతతో, పారదర్శకంగా నిర్వహించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సర్వే ప్రక్రియలో స్థానిక రైతులు, గ్రామస్తుల సహకారంతో ముందుకు సాగాలని, రైతులకు సర్వే విధానంపై పూర్తి అవగాహన కల్పించి వారి సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్తులు కూడా సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

భూ రీ-సర్వే ద్వారా దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రతి రైతు భూమి విస్తీర్ణం, సరిహద్దులు అత్యంత ఖచ్చితత్వంతో నమోదవుతాయని తెలిపారు. దీంతో భవిష్యత్తులో భూ సంబంధిత వివాదాలు తగ్గి రైతుల హక్కులు మరింత భద్రంగా ఉంటాయని పేర్కొన్నారు.

రీ-సర్వే పూర్తయిన అనంతరం భూములకు సంబంధించిన డిజిటల్ రికార్డులు మరింత ఖచ్చితంగా సిద్ధమవుతాయని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సర్వే ప్రక్రియలో భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో ఏడీ సర్వేయర్ శ్రీనివాసులు, యేదుల తహసీల్దార్, మండల సర్వేయర్లు, డిజిటల్ సర్వే బృందం ప్రతినిధులు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.

తేది: 29-7-2026                            వనపర్తి జిల్లా       *వనపర్తి జిల్లాలో  85 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన...
29/07/2026

తేది: 29-7-2026
వనపర్తి జిల్లా
*వనపర్తి జిల్లాలో 85 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి*
*త్వరలో వంద శాతం పూర్తి కానున్న వనపర్తి జిల్లా ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ - జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

వనపర్తి జిల్లాలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని, ఇప్పటి వరకు జిల్లాలో 84.12 శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
బుధవారం ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పై రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్.ఐ. ఆర్ ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మొత్తం ఓటర్లు 2,75,570 కి గాను వంద శాతం ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు అందజేసి ఇప్పటి వరకు 2,31,808 ఎన్యూమరేషన్ ఫారాలను 84.12 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. రెండు మూడు రోజుల్లో వందశాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ సైతం చేపట్టడం జరుగుతుందన్నారు. ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో 1200 ఓట్ల కన్నా ఎక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్లు, 2 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి రేషనలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
డిజిటలైజేషన్ ప్రక్రియకు గడువు 4,5 రోజులు మాత్రమే మిగిలి ఉందని, వేగవంతంగా పూర్తి చేయాలని అదే సమయంలో తప్పులు లేకుండా ఉండేందుకు ఈ.ఆర్.ఓ లు ర్యాండం గా తనిఖీలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఆర్డీఓ టి. వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తేదీ : 29-07-2026            వనపర్తి జిల్లా              *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వనపర్తిని పూరి గుడిసెలు...
29/07/2026

తేదీ : 29-07-2026
వనపర్తి జిల్లా

*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వనపర్తిని పూరి గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి*

నియోజకవర్గంలోని పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పక్కా ఇల్లు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు.

వనపర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పక్కా ఇల్లు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై కూడా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అలాంటి వారి వివరాలను సేకరించి, నిజంగా ఇల్లు అవసరమైన అర్హులైన పేదలకు ఆ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే, ఇప్పటికే గుర్తించిన 287 గుడిసెలతో పాటు నియోజకవర్గంలోని అన్ని గుడిసెలను పూర్తిస్థాయిలో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని, ఈ ప్రక్రియతో పాటు పెండింగ్ అంశాలన్నింటినీ వారం రోజుల్లోపు పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. అదేవిధంగా, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు పరిమితులకు లోబడే ఇంటి నిర్మాణం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

సమావేశంలో హౌసింగ్ పీడీ విటోబా, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తేదీ : 28-07-2026            వనపర్తి జిల్లా              *వచ్చే పదో తరగతి పరీక్షల్లో గణితం, ఇంగ్లీష్,ఫిజిక్స్ సబ్జెక్టుల...
29/07/2026

తేదీ : 28-07-2026
వనపర్తి జిల్లా

*వచ్చే పదో తరగతి పరీక్షల్లో గణితం, ఇంగ్లీష్,ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

*ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

జిల్లాలో వచ్చే పదో తరగతి పరీక్షల్లో గణితం, ఇంగ్లీష్,ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంగ్లీష్, ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ తయారీ అంశంపై సంబంధిత ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఇంగ్లీష్, ఫిజిక్స్ ప్రత్యేక పాఠ్య పుస్తకాల తయారీ పురోగతిపై కలెక్టర్ ఆరా తీయగా, ఉపాధ్యాయులు స్పందిస్తూ తయారీ పూర్తయిందని ప్రింటింగ్ చేయాల్సి ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతేడాది గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ తయారు చేసి బోధించిన మాదిరిగానే, ఈ ఏడాది గణితంతోపాటు ఇంగ్లీష్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అమలు చేయాలని సూచించారు. ఇంగ్లీష్, ఫిజిక్స్ ప్రత్యేక పుస్తకాలను రాబోయే వారం రోజుల్లో సిద్ధం చేసుకోవాలన్నారు.

ఆగస్టు 12వ తేదీలోగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులకు నూతనంగా రూపొందించిన ఇంగ్లీష్, ఫిజిక్స్ పాఠ్యపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా, ఆగస్టు 4, 5, 6 తేదీల్లో పదో తరగతి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆ పరీక్షల ఆధారంగా సబ్జెక్టుల్లో వెనుకబడిన (స్లో లెర్నర్స్) విద్యార్థులను గుర్తించాలని తెలిపారు.

గుర్తించిన విద్యార్థులకు కొత్త స్టడీ మెటీరియల్‌తో మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఆయా సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వచ్చే ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఎవరూ ఫెయిల్ కాకుండా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

*ఎంఈవోలు విద్యార్థుల విద్యా ప్రమాణాలను పర్యవేక్షించాలి*
జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై మండల విద్యాధికారుల(ఎంఈఓలు)తో వేరుగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థుల అడ్మిషన్ వివరాలను వెంటనే యూడైస్ పోర్టల్ ఆన్‌లైన్‌లో నవీకరించాలని ఆదేశించారు. డ్రాప్‌అవుట్ విద్యార్థులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రతి విద్యార్థిని తిరిగి పాఠశాలలో చేర్పించేలా కృషి చేయాలని సూచించారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు, ఎంఈఓలు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మరుగుదొడ్లు లేని పాఠశాల ఒక్కటి కూడా ఉండకూడదని స్పష్టం చేశారు.

మండల విద్యాధికారులు తమ పరిధిలోని పాఠశాలలను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. పాఠశాలల సందర్శన సమయంలో విద్యార్థుల విద్యా పురోగతి, అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించి అవసరమైన సూచనలు అందించాలని ఆదేశించారు.

సమావేశంలో జెడ్పి సీఈవో యాదయ్య, ఎంఈఓ లు, ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులు, ఇతర విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తేదీ: 28-07-2026            వనపర్తి జిల్లా             *భూ రీ-సర్వే పనులను పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి ...
28/07/2026

తేదీ: 28-07-2026
వనపర్తి జిల్లా

*భూ రీ-సర్వే పనులను పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్*

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామాల భూ రీ-సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా, నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ ఆదేశించారు.

మంగళవారం ఘన్‌పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామం, కొత్తకోట మండలంలోని పుల్లారెడ్డికుంట గ్రామాల్లో కొనసాగుతున్న డిజిటల్ భూ రీ-సర్వే పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్వే బృందాలు రైతుల సమక్షంలోనే భూ సరిహద్దులను స్పష్టంగా గుర్తించాలని సూచించారు. డ్రోన్, రోవర్ వంటి ఆధునిక సర్వే పరికరాలను సమర్థవంతంగా వినియోగించి భూ విస్తీర్ణం నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో సర్వే నిర్వహించాలని ఆదేశించారు.

సర్వే ప్రక్రియలో రైతులకు ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు తలెత్తితే రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు వెంటనే స్పందించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ వారి సహకారంతో రీ-సర్వే పనులను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

రీ-సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన వివరాలను వెంటనే రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని, భూ యజమానుల వివరాలు, సరిహద్దులు, విస్తీర్ణం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

పనుల నాణ్యతపై రాజీ పడవద్దని, ప్రతి దశను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రీ-సర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో సర్వే శాఖ ఏడి శ్రీనివాసులు, సంబంధిత రెవెన్యూ అధికారులు, సర్వే బృందాలు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.

తేదీ: 28-07-2026            వనపర్తి జిల్లా             *డబుల్ బెడ్‌రూం గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయా...
28/07/2026

తేదీ: 28-07-2026
వనపర్తి జిల్లా

*డబుల్ బెడ్‌రూం గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం గృహాల పనులను పరిశీలించి నిర్మాణాల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా నిర్మాణాల ప్రస్తుత స్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 48 గృహాలు స్లాబ్ దశలో ఉండగా, మరో 2 గృహాలు బేస్‌మెంట్ దశలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పనులు ఎప్పటి వరకి పూర్తవుతాయనే అంశంపై కాంట్రాక్టర్‌తో మాట్లాడిన కలెక్టర్, నిర్ణీత గడువులోగా అన్ని గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనుల వేగాన్ని మరింత పెంచాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పనులకు సంబంధించిన బిల్లులు త్వరితగతిన విడుదలయ్యేలా జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నిర్మాణాల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కాంట్రాక్టర్‌కు సూచించిన కలెక్టర్, అధికారులు కూడా పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో హౌసింగ్ పీడీ విటోభా, సంబంధిత శాఖ అధికారులు, పీ ఆర్ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

*ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే ఉద్యాన పంటలను సాగు చేయాలి: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్...
27/07/2026

*ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే ఉద్యాన పంటలను సాగు చేయాలి: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. డి. రాజిరెడ్డి*

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, కృష్ణా–గోదావరి జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఉద్యాన పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగుపై దృష్టి సారించాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. డి. రాజిరెడ్డి సూచించారు.

వనపర్తి జిల్లాలోని నందిమల్లగడ్డ గ్రామంలో కూరగాయల సాగు చేస్తున్న రైతుల పొలాలను ఆయన సోమవారం సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉద్యాన పంటల సాగును విస్తరించాలని సూచించారు.

సమగ్ర సాగు విధానాలను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు నికర లాభాలు పెరుగుతాయని తెలిపారు. ఆధునిక సాగు సాంకేతికత, సూక్ష్మ నీటిపారుదల విధానాలను వినియోగించి తక్కువ నీటితోనే కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చని వివరించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ఎ. భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డా. చీనా, విశ్వవిద్యాలయ కన్సల్టెంట్ డా. వీరాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఉద్యాన కళాశాల మోజర్ల అసోసియేట్ డీన్ డా. వీణ జోషి, మండల ఉద్యాన అధికారులు శ్రీకాంత్, సాయితేజ, సురేష్, డా. శంకరస్వామి, రాజేందర్ రెడ్డి కెవికె మదనాపురం నందిమల్లగడ్డ గ్రామ రైతులు పాల్గొన్నారు.

తేదీ: 27-07-2026             వనపర్తి జిల్లా          *జిల్లా ప్రజావాణితోపాటు, సీఎం ప్రజావాణి అర్జీలను ప్రాధాన్యతగా పరిష్...
27/07/2026

తేదీ: 27-07-2026
వనపర్తి జిల్లా

*జిల్లా ప్రజావాణితోపాటు, సీఎం ప్రజావాణి అర్జీలను ప్రాధాన్యతగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారునికి సమాచారమివ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి అట్టి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను సైతం సత్వరమే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 45 దరఖాస్తులు వచ్చాయి.

ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 2 దరఖాస్తులు వచ్చాయి.

నేటి ప్రజావాణిలో జెడ్పి సీఈవో యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్. తిరుపతయ్య, శిక్షణ ఉప కలెక్టర్లు మేడం శ్రావ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Address

ROOM NO. 29, IDOC WANAPARTHY
Wanaparthy
509103

Website

Alerts

Be the first to know and let us send you an email when DPRO Wanaparthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share