09/11/2026
➡️సైబర్ భద్రతపై రాజీపడొద్దు
➡️ఏఐ దాడుల వేళ.. మరింత అప్రమత్తం!
➡️బ్యాంకులు, క్విక్ కామర్స్ సంస్థలకు నగర సీపీ సజ్జనర్ హెచ్చరిక
➡️థర్డ్ పార్టీ మాడ్యూళ్లకూ పకడ్బందీ రక్షణ తప్పనిసరి
✳️అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ సైబర్ ముఠాలు విరుచుకుపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరుల ఆర్థిక లావాదేవీలు, సున్నితమైన సమాచారాన్ని (డేటా) నిక్షిప్తం చేసే సంస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్ వేదికలు, మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌లు తమ సైబర్ రక్షణ వ్యవస్థలతో పాటు నిపుణులైన మానవ వనరులను వెంటనే బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులతో పాటు విదేశీ హ్యాకర్లు విసురుతున్న సరికొత్త సవాళ్లను తిప్పికొట్టేలా ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
✳️చాలా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్స్ కంపెనీ(ఎన్ఎఫ్బీసీ)లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, చెల్లింపుల నిర్వహణ కోసం థర్డ్ పార్టీ మాడ్యూళ్లు, ఏపీఐ సేవలపై ఆధారపడుతున్నాయని, ఇలాంటి సహాయక వ్యవస్థలను కూడా ప్రధాన అప్లికేషన్లతో సమానంగా పరిగణించి అత్యున్నత భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఏఐ ఏజెంట్ల సాయంతో ఆర్థిక సంస్థల నెట్‌వర్క్‌లలోని లోపాలను సులువుగా గుర్తిస్తున్నారని తెలిపారు.
✳️ముఖ్యంగా అప్డేట్ చేయని పాత సాఫ్ట్వేర్లు, తప్పుడు కాన్ఫిగరేషన్ ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థలు, కస్టమర్ల ఫిర్యాదుల పోర్టళ్లలోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆటోమేటెడ్ ఫండ్ డిస్బర్స్మెంట్ వ్యవస్థలు, పేమెంట్ ఏపీఐల ద్వారా కంటిరెప్ప మూసి తెరిచేలోగా మ్యూల్ ఖాతాల్లోకి కోట్ల రూపాయల నిధులను మళ్లించి, పోలీసులకు ఆనవాళ్లు దొరక్కుండా డిజిటల్ రికార్డులను సైతం పూర్తిగా తుడిచిపెట్టేసేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
✳️ఈ సరికొత్త సైబర్ ముప్పును అడ్డుకునేందుకు ఆర్థిక సంస్థలు తక్షణమే పలు కీలక రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం వినియోగంలో లేనివి, గతంలో టెస్టింగ్ కోసం రూపొందించి వదిలేసిన పాత ఏపీఐలను సిస్టమ్‌ల నుంచి వెంటనే తొలగించాలన్నారు.
✳️ముఖ్యంగా నగదు విడుదల చేసే కీలక వ్యవస్థలకు పటిష్ఠమైన భద్రత కల్పించడంతో పాటు సంస్థల్లో వాడే సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఇంటర్నెట్తో అనుసంధానమైన కస్టమర్ పోర్టళ్ల భద్రతను ప్రతిరోజూ నిశితంగా సమీక్షించాలని స్పష్టం చేశారు. ఒకేసారి అసాధారణ వేగంతో, భారీ మొత్తాల్లో జరిగే లావాదేవీలను వెంటనే గుర్తించేలా ప్రత్యేక పరిమితులు విధించాలని, లబ్ధిదారుల వివరాలను క్షుణ్నంగా పరిశీలించాలని సూచించారు.
✳️నగదు ఖాతాల్లోకి వెళ్లేముందు పూర్తిస్థాయి కేవైసీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడటంతో పాటు ఉన్నతాధికారుల ఆమోదాన్ని తప్పనిసరి చేయాలన్నారు. అలాగే ఆకస్మిక దాడులు జరిగితే ఎలా స్పందించాలో తెలుసుకునేందుకు ఐటీ, సైబర్ భద్రతా బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తరచూ ‘రెడ్ టీమ్’ మాక్ డ్రిల్స్ నిర్వహించి సిబ్బందిని సంసిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.
✳️డిజిటల్ వ్యవస్థల్లో ఎక్కడా చిన్నపాటి భద్రతా లోపం కూడా తలెత్తకుండా సంస్థలు అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, పౌరుల ఆర్థిక భద్రత దృష్ట్యా ఈ ముందస్తు నివారణ చర్యలు అత్యంత కీలకమని పునరుద్ఘాటించారు. ఎవరైనా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించినా లేదా సైబర్ మోసానికి గురైనా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరు 1930ను సంప్రదించాలని లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.