08/08/2023
ఒక ఎద్దు..కధ.. పూర్తిగా చదవండి🙏🏻
----------------------------------
గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా,చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.
గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.
ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. గోపయ్య అంటే సరిపోనివాళ్ళు కొందరు "పందెం అంటే పందెం" అన్నారు.
ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి బండికి కట్టాడు.ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది…….
గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- 'తను దానికి లాగమని చెప్పనేలేదు…. 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు…….
ఇలా కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించీ పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను...
"గతంలో చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది ,మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, గోపయ్యకు. ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!
దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు:
గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.
తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. గోపయ్య ఎద్దుని కొట్టలేదు కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!
గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని కానీ ఏ జీవిని కూడా గాయపరచకూడదు' అని.
జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.
ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి